You are on page 1of 1

(https://twitter.

com/intent/tw
(https://api.whatsapp.c
(https://telegram
(https://w
సంప్రదాయం url=https://www.eenadu.net/
text= url=https%3A%
-
https%3A%2F%2Fw

గురుపరంపరాగత సదుపదేశం సంప్రదాయమని శాస్త్రవచనం. గురుపరంపరగానే కాక, శిష్యపరంపరగా అవతరించిన ఉపదేశం కూడా సంప్రదాయమేనని అమరకోశ వ్యాఖ్యానం చెబుతోంది. ఆచార
వ్యవహారాల్ని కొందరు సంప్రదాయంగా భావిస్తారు. ఆచారం ఆచరణకు సంబంధించింది. సంప్రదాయం ఆలోచనకు సంబంధించింది. వ్యవహారంలో ఈ రెండింటికీ భేదం పాటించడంలేదు.
గతతరం ఈ తరానికి సంప్రదాయమనే మూలధనాన్ని అందిస్తుంది. ఒక సాంఘిక వ్యవస్థకు సంబంధించిన ప్రజలు ఆమోదించినప్పుడే ఒక సంప్రదాయం వేళ్లూని నిలుస్తుంది. సంప్రదాయమనేది
ఒక వ్యవస్థ కాదు. అది వ్యవస్థ పట్ల విశ్వాసం. మానవ జీవితంలోని సమస్త విషయాల్లోనూ సంప్రదాయం పూసల్లో దారంలో ఉంటుంది. జాతిజీవన సౌధానికి అది పునాది వంటిది.
జీవనది ఎప్పుడూ ఒకేలా ప్రవహించదు. ప్రవాహం మధ్యలో అనేక ఉపనదుల్ని తనలో లీనం చేసుకుంటుంది. అడవులు ఆటంకపరచినా, కొండలు అడ్డు నిలిచినా నది ఆగకుండా ప్రవహిస్తుంది.
సంప్రదాయమూ అంతే. కాలగతిలో మార్పులకు లోనవుతుంది. కొత్త పద్ధతులు చోటు చేసుకొని కొన్నాళ్లకు పాతబడి సంప్రదాయాలుగా మారిపోతాయి.
రుషుల నుంచి, శ్రుతిస్మృతి పురాణాల నుంచి, ఉపనిషత్తుల నుంచి మనకు లభించిన అమూల్యనిధి- సంప్రదాయం. ఇది జాతి జీవనానికి ఆత్మవంటిది. శ్రేష్ఠులు దేన్ని ఆచరిస్తారో, దాన్ని ఇతరులు
అనుసరిస్తారని గీతాచార్య వచనం. ఒక విలక్షణ ప్రతిభామూర్తి పూర్వులు నడిచిన బాటలో నడవక ఏదో ఒక కొత్తదనం చూపుతాడు. కంటక మార్గాల్ని పూలబాటలుగా మలచుకునే కార్యదక్షులూ
ఉంటారు. క్రమంగా ఆ బాటలో జనం నడవడానికి అలవాటు పడతారు.
‘కొత్త వింత పాత రోత’ అనే సామెత ఉండనే ఉంది. లోకం ప్రతిక్షణ పరివర్తనాత్మకం. వాస్తవానికి నవ్యత్వం లోకాన్ని రసమయం చేస్తుంది. కొత్తదనం సమాజాన్ని, కళాసాహిత్య రంగాలను
వికసింపజేస్తుంది. అనుశ్రుతంగా వస్తున్న సంప్రదాయాలు, విశ్వాసాలు మారుతున్న కాలానికి సరిపోకపోవచ్చు. ఆచరణ యోగ్యం కాకపోవచ్చు. మత ధార్మిక విషయాల్లో కాలానుగుణంగా
సంస్కరణోద్యమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తుంటాయి. దార్శనికులు, ప్రవక్తలు నూతన ధర్మాలను, విలువలను ఉపదేశిస్తారు. శిశిరంలో జీవశక్తి నశించి రాలిపడిన ఆకుల్ని గురించి
విచారించడం అజ్ఞానం. చేవ ఉన్న చెట్టయితే మళ్ళీ చిగుళ్లు తొడుగుతుంది. లేకపోతే గొడ్డలి పాలవుతుంది. కాలం చెల్లిన దురాచారాలను ఎవరూ పనిగట్టుకు పునరుద్ధరించలేరు. కొన్ని
సంప్రదాయాలను సమాజం ఆమోదించి స్థిరపరచుకుంటుంది. కొన్నింటిని తనకనుకూలంగా మార్పు చేసుకుంటుంది. కొన్నింటిని పూర్తిగా నాశనం చేస్తుంది.
సంప్రదాయం, సంస్కృతి, సంస్కరణ, సమాజం- ఇవన్నీ ఒక దానికొకటి విడదీయరానివి. శరీరంలోని ఒక అంగం చెడిపోయినప్పుడు దాన్ని తొలగించి దేహాన్ని కాపాడుకోవడం వాంఛనీయం.
అలాగే, నిర్జీవమైన సంప్రదాయాలను రూపుమాపి సమాజాన్ని రక్షించుకోవాలి.
కళాసాహిత్యరంగాల్లోనూ సంప్రదాయం బలీయమైనది. త్యాగరాజు కీర్తనలు ఎంత పాతబడినా నిత్యనూతనంగానే ప్రజలు ఆదరిస్తున్నారు. రామాయణ, మహాభారత గాథలు, గీతోపదేశం
మొదలైనవాటిని కాలానికతీతంగా భారతీయ సమాజం ఆరాధిస్తోంది. కాలపరీక్షకు నిలిచిన పద్ధతులను సంప్రదాయంగా స్వీకరిస్తూ, మంచి మార్పుల్ని కలుపుకొంటూ మనుగడ సాగించడం
భారతీయ సంస్కృతి లక్షణం.
- డాక్టర్‌దామెర వేంకట సూర్యారావు

You might also like