You are on page 1of 25

దశకమ్ 34 – శ్రీరామావతారము-01

34-1 శ్లో.
గీర్వాణైరర్ధ్యమానో దశముఖనిధనం కోసలేష్వృశ్యశృంగే
పుత్రీయామిష్టిమిష్ట్వా దదుషి దశరథక్ష్మాభృతే పాయసాగ్ర్యమ్ ।
తద్భుక్త్యా తత్పురంధ్రీష్వపి తిసృషు సమం జాతగర్భాసు జాతో
రామస్త్వం లక్ష్మణేన స్వయమథ భరతేనాపి శత్రుఘ్ననామ్నా ॥

ప్రతిపదార్థము: గీర్వాణైః= దేవతలు (గీః వాఙ్మయం ఏవ వాణః అస్య - వాఙ్మయమే


అస్త్రముగా కలవారు దేవతలు), దశముఖ- నిధనం= రావణుని చంపుమని
(దశకంఠాః యస్య - పది కంఠములు కలవాడు. రావణుడు), అర్ధ్యమానః =
ప్రార్థింపగా, కోసలేషు= కోసలమునందు(కుంసయతి ప్రకాశతే తం లాతి
బిభర్తి ప్రకాశించునది. ప్రకాశమును ధరించునది. అయోధ్యానగరము),
ఋశ్యశృంగే = ఋష్య శృంగుడు(ఋషస్య హరిణస్య శృంగమివ శృంగం యస్య-
లేడికొమ్ములవంటి కొమ్ములు కలవాడు. విభాండక మహర్షి కుమారుడు,
ఋష్యశృంగుడు), పుత్రీయామ్ ఇష్టిమ్ = పుత్రకామేష్టి (పుత్రస్య ఇచ్ఛా ఆత్మనః
పుత్రం కామయతే పుత్ర సంతానము కోరునది(వాడు).) (ఇజ్యతే అసౌ యజ్ఞము),
ఇష్ట్వా= నిర్వహించాడు, దశరథ క్ష్మాభృతే = దశరథ మహారాజునకు(దశసు దిక్షు
రథో గతో యస్య - పది దిక్కులకు పయనించు రథములు కలవాడు. దశరథుడు,
సూర్యవంశపు రాజు), దదుషి = పాయసమును ఈయగా, తత్ పాయస- అగ్ర్యమ్=
ఆ దివ్యమైన పాయసమును(పయసి దుగ్ధే సంస్కృతః - పాలలో సంస్కరించబడినది.
పాయసము పరమాన్నము.)(అగ్రే భవమ్ ప్రధానము, ముఖ్యము), తిసృషు తత్
పురంధ్రీషు అపి = అతని భార్యలు ముగ్గురు(పురం గేహం రూపాది గుణసంపన్నం
వపుర్వా దధాతి రూపగుణాది సంపదలచే శరీరమును ధరించునది. స్త్రీ), భుక్త్యా =
భుజించి, సమం జాతగర్భాసు= ఒకేసారి గర్భవతులు కాగా, అథ = అటుపిమ్మట,
త్వం = నువ్వు, రామః లక్ష్మణేన భరతేన శత్రుఘ్ననామ్నా = రామ లక్ష్మణ భరత
శత్రుఘ్నుల రూపములో (రమ్యతే అనేనేతి వా ఆనందించువాడు. దీనితో ఆనందం
పొందుదురు.) (లక్షణం అస్తి అస్య మంచి ఆకారము గలవాడు. లక్ష్మణుడు.)

374
(భరతి పుష్ణాతి అసౌ పోషించువాడు. భరతుడు.)(శత్రూన్ హంతి శత్రువులను
చంపువాడు. దశరథుని కుమారుడు, శత్రుఘ్నుడు), స్వయమ్ అపి = స్వయముగా
నువ్వే, జాతః = అవతరించావు.

తాత్పర్యము: దేవతలు రావణుని చంపుమని ప్రార్థింపగా, కోసలమునందు ఋష్య


శృంగుడు పుత్రకామేష్టి నిర్వహించాడు. దశరథునకు పాయసమును ఈయగా,
అతని భార్యలు ముగ్గురు దానిని భుజించి ఒకేసారి గర్భవతులు కాగా, వారియందు
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల రూపములో నువ్వే అవతరించావు.

విశేషాలు

ఋశ్యశృంగుడు(ఋష్యశృంగుడు): ఒకానొక ముని. తలపై ఋశ్యమృగము(ఒక


జాతి మగ జింక) కొమ్ము వంటి కొమ్ము గల మహర్షి. దశరథుని పుత్రికయైన శాంత
భర్త. విభాండకముని పుత్రుడు.

ఇతఁడు తండ్రికి అతిభక్తితో శుశ్రూష చేయుచు లోకవ్యవహారమును ఒక్కటిని


ఎఱుంగక బ్రహ్మచర్యాశ్రమమున అడవియందు ఉండునపుడు, అంగదేశపు రాజు
అగు రోమపాదుడు తన దేశము అనావృష్టిచే అవస్థచెంది ఉండుట మాన్పకోరి,
‘ఋశ్యశృంగుఁడు ఉండుదేశమున అనావృష్టి ఉండదు’ అని పెద్దలవలన ఎఱింగి
అతని కొందఱు విలాసినీ జనులగుండ తోడి తెప్పించి, అనావృష్టి మానగానే,
అతనికి తన కూతును ఇచ్చి వివాహము చేసెను. ఇతఁడు దశరథునిచే పుత్రకామేష్టి
అను యాగము చేయించెను.

34-2 శ్లో.
కోదండీ కౌశికస్య క్రతువరమవితుం లక్ష్మణేనానుయాతో
యాతో భూస్తాత వాచా మునికథితమనుద్వంద్వశాంతాధ్వ ఖేదః ।
నౄణాం త్రాణాయ బాణైర్మునివచనబలాత్ తాటకాం పాటయిత్వా
లబ్ధ్వాఽస్మాదస్త్రజాలం మునివనమగమో దేవ సిద్ధాశ్రమాఖ్యమ్ ॥

ప్రతిపదార్థము: దేవ= ఓ గురువాయూరు దేవా!, కౌశికస్య = విశ్వామిత్రుని (కుశిక


వంశే భవః - కుశిక వంశంలో పుట్టినవాడు. విశ్వామిత్రుడు), క్రతువరమ్=
375
శ్రేష్ఠమయిన యాగ, అవితుం=రక్షణకు, కోదండీ= కోదండము ధరించి (కౌతి
శబ్దం కరోతి దండః అస్య - శబ్దము చేయు దండము కలది. ధనుస్సు), లక్ష్మణేన =
లక్ష్మణుడు, అనుయాతః= నీ వెంట రాగా, తాత వాచా= తండ్రి ఆజ్ఞ చే (తనోతి
విస్తారయతి గోత్రాదికమ్ వంశమును విస్తరించువాడు. తండ్రి), యాతః అభూః =
వెళ్లి, మునికథిత = విశ్వామిత్రుడు ఉపదేశించిన, మనుద్వంద్వ = బల అతిబల –
అను రెండు మంత్రాలమహిమచే, శాంత -అధ్వ ఖేదః = ప్రయాణశ్రమను
ఆకలిదప్పికలను జయించావు, మునివచనబలాత్= మునివాక్యబలముతో,
నౄణాం త్రాణాయ= మానవసంరక్షణకు, బాణైః= బాణములతో, వనమ్ అగమః
=అడవికి వెళ్ళి, తాటకాం పాటయిత్వా = తాటకను చంపి, అస్త్రజాలం = అస్త్ర
సమూహమును, అస్మాత్ లబ్ధ్వా= విశ్వామిత్రుడు నుండి స్వీకరించి,
సిద్ధాశ్రమ-ఆఖ్యమ్= సిద్ధాశ్రమము అను పేరుగల (ఆ ముని ఆశ్రమమునకు
వచ్చావు).

తాత్పర్యము: విశ్వామిత్రుని యాగరక్షణకు కోదండము ధరించి. లక్ష్మణుడు నీ


వెంట రాగా తండ్రి ఆజ్ఞ చే వెళ్లి విశ్వామిత్రుడు ఉపదేశించిన బల అతిబల - అను
మంత్రాలమహిమచే ప్రయాణశ్రమను ఆకలిదప్పికలను జయించావు.
మునివాక్యబలముతో మానవసంరక్షణకు బాణ సహితుడవై వెళ్ళి తాటకను చంపి,
విశ్వామిత్రుడు ఇచ్చిన అస్త్ర సమూహమును స్వీకరించి ఆయన సిద్ధాశ్రమమునకు
వచ్చితివి.

విశేషాలు

తాటక: ఒక రాక్షసస్త్రీ. మారీచ సుబాహువుల తల్లి. కడుక్రూరురాలు. రాముడు


విశ్వామిత్రుని యాగమును కాచుటకు పోవునపుడు మధ్యేమార్గమున ఈరాక్షసిని
చంపెను. సుకేతుడు అను యక్షుని కూతురు. దీనికి వేయియేనుఁగుల బలముగలదు.
దీని మగడు సుందుడు అను యక్షుడు. ఇది భర్తృ మరణానంతరము ఒకనాడు
అగస్త్యాశ్రమమునకు పోయి అతనిని బెదరింపపోవ అతడు దీనిని దీని సుతులు
అగు మారీచ సుబాహువులను రాక్షసులు అగునటుల శపించెను.

376
34-3 శ్లో.
మారీచం ద్రావయిత్వా మఖశిరసి శరైరన్యరక్షాంసి నిఘ్నన్
కల్యాం కుర్వన్నహల్యాం పథి పదరజసా ప్రాప్య వైదేహగేహమ్ ।
భిందానశ్చాంద్రచూడం ధనురవనిసుతామిందిరామేవ లబ్ధ్వా
రాజ్యం ప్రాతిష్ఠథాస్త్వం త్రిభిరపి చ సమం భ్రాతృవీరైస్సదారైః ॥

ప్రతిపదార్థము: మారీచం= యజ్ఞంలోమారీచుని (మరీచేః అపత్యం పుమాన్


మరీచుని కుమారుడు. మారీచుడు, రాక్షసుడు), ద్రావయిత్వా= తరిమి, మఖ
శిరసి= యజ్ఞ ప్రారంభంలో, శరైః= బాణములచే, అన్య- రక్షాంసి= సుబాహుని
ఇతరరాక్షసులను, నిఘ్నన్ = సంహరించి, పథి = మార్గ మధ్యంలో, పదరజసా=
మీ పాదధూళిచే, అహల్యాం = అహల్యను (అహని లీయతే దినములో లీనమగునది.
రాత్రి.)( న హలాయ యోగ్యమ్ దున్నుటకు యోగ్యము కానిది. బంజరు భూమి),
కల్యాం కుర్వన్ =శుద్ధితో ధన్యురాలినిచేసి, వైదేహ గేహమ్ = జనకుని ఇంటికి,
ప్రాప్య = వెళ్లి, చాంద్రచూడం ధనుః = శివుని విల్లును, భిందానః = విఱచి, ఇందిరామ్
ఏవ = మహాలక్ష్మియేయైన, అవనిసుతామ్= జానకిని, లబ్ధ్వా= పొంది, స దారైః=
భార్యలతో కూడిన, త్రిభిః అపి చ చ సమం భ్రాతృవీరైః= నీ ముగ్గురు మహా వీరులైన
తమ్ముళ్లతో, త్వం= నువ్వు, రాజ్యం = మీ రాజధానికి, ప్రాతిష్ఠథాః= ప్రయాణ
మయ్యావు.

తాత్పర్యము: 3. యజ్ఞంలోమారీచుని తరిమి, బాణములచే సుబాహుని


ఇతరరాక్షసులను సంహరించి, అహల్యను మీ పాదధూళిచే ధన్యురాలినిచేసి,
జనకుని ఇంటికి వెళ్లి శివుని విల్లు విఱచి, మహాలక్ష్మియైన జానకిని పెండ్లాడి,
పెండ్లికూతుర్లతో కూడిన తమ్ములతో మీ రాజధానికి ప్రయాణమయ్యావు..

విశేషాలు

అహల్య: ఈమె ముద్గలుని కూతురు గౌతమమహర్షి భార్య. దేవేంద్రునితో


జారత్వము చేసినందున భర్త ఈమెను శిలయగునట్లు శపించెను. తరువాత
బహుకాలమునకు శ్రీరాముఁడు సీతను పెండ్లాడుటకై మిథిలాపట్టణమునకు

377
పోవుచుండి గౌతమాశ్రమము ప్రవేశించి ఆపాషాణమును మెట్టగానే ఆశాపము
తీఱెను.

34-4 శ్లో.
ఆరుంధానే రుషాంధే భృగుకులతిలకే సంక్రమయ్య స్వతేజో
యాతే యాతోఽస్యయోధ్యాం సుఖమిహ నివసన్ కాంతయా కాంతమూర్తే ।
శత్రుఘ్నేనైకదాఽథో గతవతి భరతే మాతులస్యాధివాసం
తాతారబ్ధోఽభిషేకస్తవ కిల విహతః కేకయాధీశపుత్ర్యా ॥

ప్రతిపదార్థము: కాంతమూర్తే= ఓ ప్రకాశించు గురువాయూరు దేవా! (కామ్యతే


ఇతి కోరబడునది. మనోహరమైనది), భృగుకులతిలకే = భృగువంశములో
గొప్పవాడయిన పరశురాముడు (భృజ్యతే తపసా శరీరమ్ తపస్సుచే శరీరమును
తపింప చేసినవాడు. భృగువు, ఒక మహర్షి), రుషాంధే = రోషాంధకారంతో,
ఆరుంధానే = నిన్ను ఎదిరింపగా, యాతే =చివరకు, స్వతేజః= అతని
వైష్ణవతేజమును, సంక్రమయ్య= నీయందు సంక్రమింపజేసుకొన్నావు, అయోధ్యాం
= అయోధ్యకు (న యోద్ధుం శక్యఃజయించుటకు వీలు కానిది), యాతః అసి =
చేరుకొని, ఇహ= ఇచ్చట (అయోధ్యలో), కాంతయా = సీతతో, సుఖమ్ నివసన్ =
సంతోషంగా ఉన్నావు, అథః= అటుపిమ్మట, ఏకదా= ఒకప్పుడు, శత్రుఘ్నేన =
శత్రుఘ్నునితో, భరతే= భరతుడు, మాతులస్య అధివాసం= మేనమామ ఇంటికి
(మా యా మాత్రా తులాం హరతి తల్లితో సమానత్వము పొందువాడు. మామ),
గతవతి = వెళ్లగా, తాత= తండ్రి అయిన దశరథునిచే, ఆరబ్ధః తవ అభిషేకః =
ఆరంభించిన నీ పట్టాభిషేకము, కేకయ-అధీశపుత్ర్యా= కేకయ రాజు కుమార్తె కైక
వలన, విహతః కిల = ఆగిపోయింది కదా! (విశేషేణ హతః వినష్టః - చంపబడినది,
నష్టపోయినది).

తాత్పర్యము: దారిలో పరశురాముడు రోషముతో నిన్ను ఎదిరింపగా అతని


వైష్ణవతేజమును నీయందు సంక్రమింపజేసుకొన్నావు. అయోధ్యకు చేరుకొని
సీతతో సంతోషంగా ఉన్నావు.ఆ తరువాత శత్రుఘ్నుడు భరతుడు మేనమామ
ఇంటికి వెళ్లగా, దశరథుడు ఆరంభించిన నీ పట్టాభిషేకము కైక వలన ఆగిపోయింది.

378
34-5 శ్లో.
తాతోక్త్యా యాతుకామో వనమనుజవధూసంయుత శ్చాపధారః
పౌరానారుధ్య మార్గే గుహనిలయగతస్త్వం జటాచీరధారీ ।
నావా సంతీర్య గంగామధిపదవిపునస్తం భరద్వాజమారాత్
నత్వా తద్వాక్యహేతోరతిసుఖమవసచ్ఛిత్రకూటే గిరీంద్రే ॥

ప్రతిపదార్థము: తాత-ఉక్త్యా = తండ్రి దశరథుడు కైక కు ఇ చ్చిన మాటను


చెల్లించుటకు (లోకంలో తండ్రి మాటను అందరు గౌరవించాలని ప్రబోధం),
అనుజ= తమ్మునితో(అను పశ్చాత్ జాయతే తరువాత జన్మించువాడు. తమ్ముడు),
వధూసంయుతః = ధర్మపత్నితో (ఉహ్యతే పితృగృహాత్ పతిగృహమ్ తండ్రి
గృహము నుండి పతి గృహమునకు పోవునది. భార్య), చాపధారః= విల్లు ధరించి
(చపస్య వంశభేదస్య వికారః - వెదురుతో చేయబడిన ధనుస్సు), త్వం = నువ్వు,
జటాచీరధారీ = జటా చీరధారివై (జటతి పరస్పరం సంలగ్నోభవతి పరస్పరము
కలిసి వుండునవి. వెంట్రుకలు)( చినోతి ఆవృణోతి వృక్షమ్ - వృక్షమును కప్పునది.
వల్కలము.నారచీర), వనమ్ యాతుకామః = అరణ్యమునకు బయలుదేరావు,
మార్గే= నీ మార్గములో వచ్చుచున్న, పౌరాన్= పౌరులను (పురే నగరే
భవఃనగరములో వుండువాడు), ఆరుధ్య= రావద్దని ఆపి, గుహనిలయగతః =
గుహుని దగ్గరకు వెళ్ళావు, నావా= అతడు సమకూర్చిన నావపై, గంగామ్ సంతీర్య
= గంగను దాటి(గమయతి ప్రాపయతి ఉత్తమాం గతిం ఉత్తమాం లోకాన్
వా ఉత్తమగతిని, ఉత్తమ లోకమును చేర్చునది), అధిపదవి = మార్గ మధ్యంలో,
పునః= మరలా, ఆరాత్ = దగ్గర్లో ఉన్న, తం భరద్వాజమ్ = ఆ భరద్వాజునికి (భరతి
బిభర్తి వాజం అన్నమ్ అన్నమును భరించువాడు, సంపద కలవాడు. భరద్వాజ
ఋషి), నత్వా= నమస్కరించి, తత్ వాక్యహేతోః= ఆయన చెప్పినట్లుగా, చిత్రకూటే
గిరీంద్రే= చిత్రకూట పర్వతంపై (చిత్రాణి కూటాని శృంగాని యస్య - చిత్రమైన
(కూట) శిఖరములు కలది. చిత్రకూట పర్వతము), అతిసుఖమ్ అవసః =
సుఖముగా ఉన్నావు.

తాత్పర్యము: 5. తండ్రి దశరథుడు కైక కు ఇ చ్చిన మాటను చెల్లించుటకు

379
తమ్మునితో ధర్మపత్నితో విల్లు ధరించి అరణ్యమునకు జటా చీరధారివై
బయలుదేరావు. పౌరులను రావద్దని ఆపి, గుహుని దగ్గరకు వెళ్ళావు.అతడు
సమకూర్చిన నావపై గంగను దాటి భరద్వాజునకు నమస్కరించి ఆయన
చెప్పినట్లుగా చిత్రకూట పర్వతంపై సుఖముగా ఉన్నావు.

34-6 శ్లో.
శ్రుత్వా పుత్రార్తిఖిన్నం ఖలు భరతముఖాత్ స్వర్గయాతం స్వతాతం
తప్తో దత్వాంబు తస్మై నిదధిథ భరతే పాదుకాం మేదినీం చ ।
అత్రిం నత్వాఽథ గత్వా వనమతివిపులం దండకం చండకాయం
హత్వా దైత్యం విరాధం సుగతిమకలయశ్చారు భోః శారభంగీమ్ ॥

ప్రతిపదార్థం: భోః = ఓ గురువాయూరు దేవా!, పుత్ర ఆర్తిఖిన్నం= నీకై బాధపడి,


స్వతాతం=తన తండ్రి, స్వర్గయాతం= స్వర్గస్థుడయ్యాడను వార్తను, భరత ముఖాత్
= భరతుని వలన, శ్రుత్వా = విని, తప్తః = బాధపడి, తస్మై= అతనికొరకు, అంబు=
తర్పణాలు (అమంతి గచ్ఛంతి చేష్టంతే ప్రాణినః యేన - దీనివలన ప్రాణులు
జీవింతురు. జలము), దత్వా= ఇచ్చి, భరతే = భరతునకు, పాదుకాం= పాదుకలను
(పాదూరేవ పాదుకా పాదుక), మేదినీం చ= రాజ్యమును (మేదః మధుకైటభయోః
మేదః కారణం అస్తి అస్యాః - దీనికి మధుకైటభుల కొవ్వు కారణమైనది.
భూమి), నిదధిథ= ప్రసాదించి, అత్రిం నత్వా= అత్రిమునికి మ్రొక్కి, అథ = ఆ
తరువాత, అతివిపులం దండకం వనమ్ గత్వా = సువిశాల దండకారణ్యములో
ప్రవేశించి ( దండకారణ్యం జనస్థానమ్ దండకారణ్యము), చండకాయం=
భయంకర శరీరము గల, విరాధం దైత్యం= విరాధ రాక్షసుని (విరుద్ధం రాధ్నోతి
ప్రవర్తతే విరుద్ధంగా ప్రవర్తించువాడు. విరాధుడను రాక్షసుడు), హత్వా = చంపి,
శారభంగీమ్= శరభంగునకు, సుగతిమ్ = మోక్షమును, చారు అకలయః కిల=
చక్కగా అను గ్రహించావు కదా.

తాత్పర్యము: 6. నీకై బాధపడి తండ్రి స్వర్గస్థుడయ్యాడను వార్తను భరతుని వలన


విని ఆయనకు తర్పణాలు ఇచ్చి, భరతునకు పాదుకలను రాజ్యమును ప్రసాదించి,
అత్రిమునికి మ్రొక్కి ఆ తరువాత సువిశాల దండకారణ్యములో ప్రవేశించి భయంకర

380
శరీరము గల విరాధుని చంపి శరభంగునకు మోక్షము అను గ్రహించావు

విశేషాలు

శర భంగుడు: దండకారణ్యమున ఉండిన ఒక మహర్షి. ఇతనిని స్వర్గ లోకమునకు


పిలుచుకొని పోవ ఇంద్రాదిదేవతలు తామే ఇతని యాశ్రమమునకు వచ్చిరి.
రాముఁడు దండకారణ్యమునకు రాగానే అతని దర్శనము చేసికొని శరభంగ
మహాముని స్వర్గస్థుడు ఆయెను. ఇతని యాశ్రమము జాహ్నవీనదికి సమీపమున
ఉండెను.

34-7 శ్లో.
నత్వాఽగస్త్యం సమస్తాశరనికరసపత్రాకృతిం తాపసేభ్యః
ప్రత్యశ్రౌషీః ప్రియైషీ తదను చ మునినా వైష్ణవే దివ్యచాపే ।
బ్రహ్మస్త్రే చాపి దత్తే పథి పితృసుహృదం వీక్ష్య భూయో జటాయుం
మోదాద్గోదాతటాంతే పరిరమసి పురా పంచవట్యాం వధూట్యా ॥

ప్రతిపదార్థం: అగస్త్యం= ఆ తరువాత అగస్త్యునకు(అగం వింధ్యం పర్వతం


స్త్యాయతి అగస్త్యముని. నక్షత్రము), నత్వా = మ్రొక్కి, సమస్త ఆశర నికర
సపత్రాకృతిం= సర్వరాక్షస సంహారము కొరకు (ఆశర=ఆసమంతాత్ శృణాతి
హినస్తి హింస పెట్టువాడు. అసురుడు), తాపసేభ్యః= మునులకు, ప్రత్యశ్రౌషీః=
ప్రతిజ్ఞ చేసి, తదను= ఆతరువాత, ప్రియైషీ = నీ మేలు కోరువాడయిన, మునినా=
అగస్త్యుని నుండి, వైష్ణవే దివ్యచాపే= వైష్ణవాస్త్రమును, బ్రహ్మాస్త్రే చ అపి=
బ్రహ్మాస్త్రమును కూడా (బ్రహ్మస్వరూపం అస్త్రమ్ బ్రహ్మాస్త్రము), దత్తే= స్వీకరించి,
పథి = మార్గ మధ్యములో, పితృసుహృదం= నీ తండ్రికి మిత్రుడగు, జటాయుం =
జటాయువును(జటం సంహతం ఆయుః యస్య - దీర్ఘాయువు కలవాడు.
గృధ్రరాజు), వీక్ష్య = చూచి, భూయః= మరలా, మోదాత్ = సంతోషంగా,
వధూట్యా= నీ భార్యతో, గోదా తటాంతే= గోదావరీ తీరమందు(గాం జలం స్వర్గం
వా దదాతి స్నానేన - జలమును స్నానంతో స్వర్గము నిచ్చునది. గోదావరి),
పంచవట్యాం చ= పంచవటిలో (పంచానాం వటానాం సమాహారః - అశ్వత్థ,
బిల్వ, వట, ఆమలక, అశోక అనునవి పంచవటములు దండకారణ్యంలోని
381
పంచవటీ), పురా= పూర్వము, పరిరమసి= ఆనందంగా ఉన్నావు.

తాత్పర్యము: 7. ఆ తరువాత అగస్త్యునకు మ్రొక్కి సర్వరాక్షస సంహారము చేసెదనని


మునులకు ప్రతిజ్ఞ చేసి అగస్త్యుని నుండి వైష్ణవాస్త్రమును, బ్రహ్మాస్త్రమును కూడా
స్వీకరించి మార్గ మధ్యములో నీ తండ్రికి మిత్రుడగు జటాయువు చూచి, నీ భార్యతో
గోదావరీ తీరమందు పంచవటిలో ఆనందంగా ఉన్నావు.

విశేషాలు

పంచవటి: రాముడు వనవాసముచేయునపుడు దండకారణ్యమునందు ఆశ్రమము


కావించుకొని ఉన్నచోటు. (అయిదు మఱ్ఱిచెట్ల చేరిక అని శబ్దార్థము.) ఇది
గోదావరిపుట్టు తావునకు సమీపమున ఉండును. ఈతావున నాసికాపురి ఉన్నది.

34-8 శ్లో.
ప్రాప్తాయాః శూర్పణఖ్యా మదనచలధృతేరర్థనైర్నిస్సహాత్మా
తాం సౌమిత్రౌ విసృజ్య ప్రబలతమరుషా తేన నిర్లూననాసామ్ ।
దృష్ట్వైనామ్ రుష్టచిత్తం ఖరమభిపతితం దూషణం చ త్రిమూర్ధం
వ్యాహింసీరాశరానప్యయుత సమధికాంస్తత్క్షణాదక్షతోష్మా ॥

ప్రతిపదార్థం: శూర్పణఖ్యా ప్రాప్తాయాః = అంతట శూర్పణఖ వచ్చి (శూర్ప ఇవ


నఖాః అస్యాః - చేటల వంటి గోర్లు కలది. శూర్పనఖ, రావణుని చెల్లెలు), మదన
చలధృతేః = నీ పట్ల మోహపడి (మదయతి మత్తెక్కించువాడు. కామదేవుడు),
అర్థనైః =వేడుకొంది కాని నువ్వు నిరాకరించి, నిస్సహాత్మా=అసహ్యపడి, తాం =
ఆమెను లక్ష్మణుని కడకు పంపితివి, సౌమిత్రౌ = లక్ష్మణుడును (సుమిత్రాయాః
అపత్యమ్ సుమిత్ర కొడుకు), విసృజ్య= ఆమెను విడువగా, ప్రబలతమ రుషా =
విపరీత కోపము పొందిన ఆ శూర్పణఖ, తేన= ఆ లక్ష్మణుని చేత, నిర్లూన
నాసామ్=కోయబడిన ముక్కు చెవులు కలిగినదిగా మారింది, ఏనామ్ = అలా ఉన్న
శూర్పణఖను, దృష్ట్వా= చూసి, రుష్టచిత్తం = రోషపడిన మనస్సులతో, అభిపతితం
= ఎదిరించుటకు మీదికి వచ్చిన, ఖరమ్ - దూషణం = ఖరదూషణులను,
త్రిమూర్ధం చ= త్రిశిరులతో, అయుతసమ అధికాన్= వారితో ఉన్న పది వేలమంది

382
కంటె అధికంగా ఉన్న, ఆశరాన్- అపి= రాక్షసులను, తత్క్షణాత్= తక్షణమే, అక్షత-
ఊష్మా = అంతులేని పరాక్రమంతో నువ్వు, వ్యాహింసీః = నశింపచేసావు.

తాత్పర్యము: అంతట శూర్పణఖ నీ పట్ల మోహపడి నిన్ను వేడుకొంది కాని నువ్వు


నిరాకరించి అసహ్యపడి ఆమెను లక్ష్మణుని కడకు పంపితివి. లక్ష్మణుడును ఆమెను
విడువగా విపరీత కోపము పొందిన ఆ శూర్పణఖ ముక్కు చెవులను ఆ లక్ష్మణుడు
కోసాడు. అలా ముక్కు చెవులు కోల్పోయిన శూర్పణఖను చూసి రోషపడి నీ తో
యుద్ధానికి వచ్చిన ఖరదూషణ త్రిశిరులు పది వేలమంది కంటె అధికంగా ఉన్న
రాక్షసులను తక్షణమే అంతులేని పరాక్రమంతో నశింపచేసావు.

విశేషాలు

శూర్పణఖ: రావణుని చెలియలు. దీని మగడు విద్యుజ్జిహ్వుడు కొడుకు


జంబుకుమారుడు. రాముడు దండకారణ్యమున ఉండునపుడు ఒకనాడు ఈ
శూర్పణఖ అతనిపర్ణశాలకు వచ్చి అతఁడు తన్ను పెండ్లాడవలయును అను తలపున
సీతాదేవిని మ్రింగపోగా లక్ష్మణుడు దీని ముక్కుచెవులుకోసి తఱిమెను. అంతట ఇది
జనస్థానమునందు ఉన్న తన పినతల్లి కొడుకులు అగు ఖరుడు మొదలగు
రక్కసులతో తన అవమానపాటు చెప్పుకోగా ఆరక్కసులు రామునితో
పెనుయుద్ధము సలిపిరి.. ఆవల శూర్పణఖ లంకకు పోయి రావణునికి తన
భంగపాటు తెలిపి సీతమీద కామము కలుగ బోధించి ఆసీతను వాడు ఎత్తుకొని
పోవునట్లు చేసెను

34-9 శ్లో.
సోదర్యా ప్రోక్త వార్తావివశ దశముఖాదిష్టమారీచమాయా-
సారంగం సారసాక్ష్యా స్పృహితమనుగతః ప్రావధీర్బాణఘాతమ్ ।
తన్మాయాక్రందనిర్యాపిత భవదనుజాం రావణస్తామహార్షీత్
తేనార్తోఽపి త్వమంతః కిమపి ముదమధాస్తద్వధోపాయలాభాత్ ॥

ప్రతిపదార్థం: సోదర్యా= చెల్లెలగు శూర్పణఖ, ప్రోక్త= చెప్పిన వార్తా = వార్తను విని,

వివశ = ఒళ్లు మరచి వశము తప్పిన (విగతః వశః యస్య-వశంలో లేనివాడు


383
అధీనంలో లేనివాడు), దశముఖ = రావణునిచే, ఆదిష్టః=ఆదేశింపబడిన,
మారీచః= మారీచుడు, మాయా-సారంగం= మాయలేడిగా మారాడు (సరతి
గచ్ఛతి వెళ్లునది. చాతక పక్షి లేడి), సారస-అక్ష్యా= పద్మము వంటి కనులు కలిగిన
జానకి ( సారసపక్షి కన్నులవంటి కన్నులు గలది అని ఇంకొక అర్థం), స్పృహితమ్=
దానిపై (ఆ మాయ లేడిపై)మనసుపడగా(ఈప్సాయాం స్పృహయతి కోరుట),
అనుగతః= ఆ బంగారు లేడి వెంటవెళ్ళి, బాణఘాతమ్ = బాణపు దెబ్బతో, ప్రావధీః=
దానిని చంపితివి, తత్ = ఆ లేడిరూపమున నున్న మారీచుడు చేసిన, మాయా
క్రంద= “హా లక్ష్మణా!” అను మాయతో కూడిన ఆక్రందనమును విని, భవత్
అనుజాం= నీ సోదరుడు లక్ష్మణుడు, నిర్యాపితః = సీత దగ్గర నుండి నీ కడకు
పంపబడగా, రావణః = రావణుడు, తామ్= సీతను, అహార్షీత్= హరింపగా, త్వమ్
తేన –ఆర్తః అపి= నీవు బయటికి బాధపడినట్లు కనబడ్డావు కాని, అంతః = చివరకు,
తత్ వధ ఉపాయలాభాత్= కాని రావణ వధకు ఉపాయము లభించెనని, కిమ్ అపి
ముదమ్ అధాః= లోలోపల కొంచెం ఆనందించితివి.

తాత్పర్యము: 9. చెల్లెలగు శూర్పణఖ చెప్పిన వార్తను విని ఒళ్లు మరచి వశము


తప్పిన రావణుడు మారీచుని మాయలేడిగా పంపగా, పద్మము వంటి కనులు
కలిగిన జానకి దానిపై మనసుపడగా, ఆ బంగారు లేడి వెంట వెళ్ళి దానిని చంపితివి
ఆ లేడిరూపమున నున్న మారీచుడు చేసిన ““హా లక్ష్మణా!” అన్న ఆక్రందనమును
విని నీ సోదరుడు లక్ష్మణుడు సీతచే పంపబడగా , రావణుడు సీతను హరించాడు.
నీవు బయటికి బాధపడినట్లు కనబడ్డావు కాని రావణ వధకు ఉపాయము లభించెనని
లోలోపల కొంచెం ఆనందించితివి.

34-10 శ్లో.
భూయస్తన్వీం విచిన్వన్నహృత దశముఖస్త్వద్వధూం మద్వధేనేఽ
త్యుక్త్వాయాతే జటాయౌ దివమథ సుహృదః ప్రాతనోః ప్రేతకార్యమ్ ।
గృహ్ణానం తం కబంధం జఘనిథ శబరీం ప్రేక్ష్య పంపాతటే త్వం
సంప్రాప్తో వాతసూనుం భృశముదితమనాః పాహి వాతాలయేశ ॥

ప్రతిపదార్థం: భూయః = మరలా, తన్వీం = సీతను (తనుః అల్పా కృశాంగీ కృశించిన

384
అంగములు గలది. స్త్రీ), విచిన్వన్= వెదకుచుండగా, మత్ వధేన = నన్ను చంపి,
త్వత్ వధూం= నీ భార్యను, దశముఖః = రావణుడు, అహృతః = అపహరించాడు,
ఇతి = అని, ఉక్త్వా = చెప్పి, జటాయౌ= జటాయువు, దివమ్= స్వర్గమునకు, యాతే=
వెళ్లగా, అథ=అటుపిమ్మట, సుహృదః= జటాయువునకు, ప్రేతకార్యమ్= పరలోక
క్రియలు(ప్రేతస్య మృతస్య కర్మ, దహనాత్ సపిండీకరణపర్యంతం కర్మ -
చనిపోయినవానికి కర్మ. దహనము మొదలు సపిండీకరణము వరకు చేయు కర్మ),
ప్రాతనోః =చేసి, గృహ్ణానం తం కబంధం= నిన్ను పట్టుకొన్న ఆ కబంధుని(కం శిరః
బధ్యతే అస్మాత్ శిరస్సు ఛేదింపబడిన శరీరావయవము. మొండెము), జఘనిథ=
చంపి, శబరీం = శబరిని (శబరస్య స్త్రీ, భిల్లపత్నీ శబరుని భార్య. శబరి,
రామభక్తురాలు), ప్రేక్ష్య = చూసి, పంపాతటే = పంపానది తీరంలో, త్వం= నువ్వు,
వాతసూనుం= వాయుపుత్రుడైన హనుమంతుని (వాత=వాతి స్పృశతి
గచ్ఛతి వెళ్లునది, సృశించునది. వాయువు), సంప్రాప్తః = కలిసి, భృశ
ముదితమనాః= బాగా ఆనందమనుభవించితివి, వాతాలయ-ఈశ= ఓ
గురువాయూరు దేవా!, పాహి= రక్షింపుము.

తాత్పర్యము: సీతను వెదకుచుండగా “నన్ను చంపి నీ భార్యను రావణుడు


అపహరించాడు “అని నీతో చెప్పి జటాయువు స్వర్గమునకు వెళ్లగా అటుపిమ్మట
జటాయువునకు పరలోక క్రియలు చేసి నిన్ను పట్టుకొన్న ఆ కబంధుని చంపి శబరిని
చూసి పంపానది తీరంలో నువ్వు వాయుపుత్రుడైన హనుమంతుని కలిసి బాగా
ఆనందమనుభవించితివి. ఓ గురువాయూరు దేవా! రక్షింపుము.

విశేషాలు

జటాయువు:అనూరుని రెండవ కొడుకు. ఇతని తల్లి శ్యేని. తాత కశ్యపుడు. అవ్వ


వినత. అన్న సంపాతి. ఇతడు పంచవటియందు శ్రీరాముని ఆశ్రమమున ఉండి
సీతను రావణాసురుడు ఎత్తుకొనిపోవు కాలమున వానిని అడ్డగించి వానిచేత
చంపబడెను.

కబంధుడు: ఒక రాక్షసుడు. వీడు జంఘారహితుడు అయి యోజనదీర్ఘములు అగు


బాహువులును ఉదరమునందు అణగిన ముఖమును కలిగి దండకారణ్యమున

385
ఉండెను. రామలక్ష్మణులు సీతను వెదుకుచు పోవు అవసరమయిన వారిని పట్టి
మ్రింగపోగా వారు వీనిబాహువులు తెగనఱకిరి. అంతట వాడు ఒక గంధర్వుడు
ఆయెను. తొల్లి దనువు అను గంధర్వుడు తపోబలముచే చిరజీవిత్వమును
కామరూపిత్వమును పడసి క్రౌర్యపరుడు అయి ఉండగా వానికి స్థూలకేశుడు అను
ఋషి శాపముచే ఇట్టి రాక్షసరూపము ప్రాప్తము అయ్యెను. అనంతరము మఱి
ఒకప్పుడు వాడు ఇంద్రునితో సంగరము కోరి పోరునపుడు అతని వజ్రాయుధము
పెట్టుచేత కంఠమును శిరమును కాళ్లును పొట్టలోపలికి అడగిపోయెను. వాడె
కబంధుడు అన పరగెను. కాఁబట్టి రామలక్ష్మణులు తన బాహువులను తెగగొట్టగానే
వీనికి శాప విమోచనము అయ్యెను.

శబరి: పంపాతీరమునందలి మతంగాశ్రమమున ఉండిన రామభక్తురాలు అయిన


ఒక బోయత. మతంగుని శిష్యురాలు. ఈమె రాముని యనుగ్రహము పడసి
మోక్షము చెందెను.

నవమ స్కంధము
34వ దశకము సమాప్తము.

386
దశకమ్ 35 – శ్రీరామావతారమ్-02
35-1 శ్లో.
నీతస్సుగ్రీవమైత్రీం తదను హనుమతా దుందుభేః కాయము చ్చైః
క్షిప్త్వాంగుష్ఠేన భూయో లులువిథ యుగపత్ పత్రిణా సప్తసాలాన్ ।
హత్వా సుగ్రీవఘాతోద్యతమతులబలం వాలినం వ్యాజవృత్త్యా
వర్షావేలామనైషీర్విరహతరలితస్త్వం మతంగాశ్రమాంతే ॥

ప్రతిపదార్థము: తత్ -అను = ఆతరువాత, హనుమతా= హనుమంతునివలన


(హనూ అస్తి అస్య - దవుడలు కలవాడు. హనుమంతుడు), సుగ్రీవమైత్రీం=
సుగ్రీవునితో స్నేహము(శోభనా గ్రీవా యస్య - అందమైన మెడ గలవాడు.
సుగ్రీవుడు), నీతః= పొందావు. (నీతః అపనీతః వ్యతీతః లబ్ధః - తీసుకొనబడినది
పొందబడినది గడపబడినది), దుందుభేః కాయమ్ = దుందుభి శరీరమును(దుందు
ఇతి శబ్దేన ఉభతి పూరయతి దుందుం అను శబ్దమును చేయు ఒక రాక్షసుడు),
అంగుష్ఠేన= కాలి బొటన వేలితో(అంగౌ పాణౌ ప్రాధాన్యేన తిష్ఠతి ముఖ్యమైనది.
బొటన వ్రేలు), ఉ చ్చైః క్షిప్త్వా= దూరానికి విసిరేశావు, భూయః= మరలా,
యుగపత్= ఒకే కాలములో( యుగం ఇవ పద్యతే, ఏకకాలీనం, సమకాలీనమ్),
పత్రిణా= ఒక్క బాణముతో, సప్తసాలాన్ = ఏడు సాల వృక్షాలను(సలతి ఉచ్చైః
గచ్ఛతిబాగా పైకి పెరుగునది. మద్ది చెట్టు), లులువిథ= ఖండించావు, సుగ్రీవఘాత=
సుగ్రీవుని చంపుటకు, ఉద్యతమ్= ప్రయత్నం చేసిన, అతులబలం= సాటిలేని
బలంకలిగిన, వాలినం = వాలిని, వ్యాజవృత్త్యా= మిషతో, హత్వా = సంహరించి,
వర్షా వేలామ్ = వర్ష ఋతువును, త్వం= నువ్వు, విరహతరలితః = సీతా
విరహవేదనతో, మతంగ ఆశ్రమ అంతే= మతంగాశ్రమములో, అనైషీః= గడిపావు.

తాత్పర్యము: ఆతరువాత హనుమంతునివలన సుగ్రీవునితో స్నేహము పొందావు.


కాలి బొటన వేలితో దుందుభి శరీరమును దూరానికి విసిరేశా వు. మరలా ఒకే
కాలములో ఒక్క బాణము తో ఏడు సాల వృక్షాలను ఖండించావు. సుగ్రీవుని
చంపుట కు ప్రయత్నం చేసిన సాటిలేని బలంకలిగిన వాలిని మిష తో సంహరించి,
వర్ష ఋతువును సీతా విరహవేదనతో మతంగాశ్రమ ములో గడిపావు.
387
విశేషాలు

దుందుభి: మయుని రెండవ కొడుకు. మండోదరి సహోదరుడు. వాలిచే చంపబడెను.


వీని చంపి కళేబరమును వాలి పాఱవైచినపుడు దానినుండి రక్తబిందువులు
మతంగమహర్షి తపముచేయుచు ఉండిన ఋశ్యమూక పర్వతమున పడెను.
అందుకు అతఁడు కోపగించికొని ఆకొండమీదికి వాలి వచ్చిన అతనికి తల వేయి
వ్రక్కలు అగునట్లుగా శాపము ఇచ్చెను.

35-2 శ్లో.
సుగ్రీవేణానుజోక్త్యా సభయమభియతా వ్యూహితాం వాహినీం తాం
ఋక్షాణాం వీక్ష్య దిక్షు ద్రుతమథ దయితామార్గణాయావనమ్రామ్ ।
సందేశం చాంగులీయం పవనసుతకరే ప్రాదిశో మోదశాలీ
మార్గే మార్గే మమార్గే కపిభిరపి తదా త్వత్ప్రియా సప్రయాసైః ॥

ప్రతిపదార్థము: అథ = అటుపిమ్మట, అనుజ= లక్ష్మణుని, ఉక్త్యా= మాటతో,


సభయమ్ =భయముతో, సుగ్రీవేణ= సుగ్రీవుడు, అభియతా= నిన్ను సమీపించాడు,
వాహినీం= వానర సేనను (వాహాః వాహనాని అశ్వాదీని సంతి అస్యామ్ ఇందులో
గుఱ్ఱము మొదలగు వాహనములుండునది. సేన), వ్యూహితాం= సిద్ధ పరిచాడు,
ద్రుతమ్= వెంటనే, దిక్షు= దిక్కులందు, దయితామార్గణాయ = నీ ప్రియురాలిని
వెదకుటకు సిద్ధమై ఉన్న, అవనమ్రామ్ =వినయముతో వంగియున్న, తాం
ఋక్షాణాం= వానర సేనను(ఋషతి హినస్తి అసౌ హింసించునది. భల్లూకము,
ఎలుగుబంటు), వీక్ష్య = చూచి, సందేశం చ అంగులీయం = వారిలో ఉంగరాన్ని నీ
సందేశమును (సమ్యక్ దిశతి సూచయతి తస్య భావః కర్మ వా సూచించుట
సమాచారము సందేశము.) (అంగుళౌ భవమ్ వ్రేలుయందుండునది.
ఉంగరము),పవనసుత కరే= హనుమంతుని చేతికి (పవన=పునాతి పవిత్రము
చేయునది. గాలి), ప్రాదిశః= ఇచ్చి, మోదశాలీ = ఆనందంగా ఉన్నావు, తదా=
అప్పుడు, కపిభిః అపి= వానరులు కూడా, సప్రయాసైః= అనేక కష్టాలకు గురి అయి,
త్వత్ ప్రియా= నీ భార్య కొరకు, మార్గే మార్గే = అన్ని దారులలోను, మమార్గే
=వెతికారు.

388
తాత్పర్యము: లక్ష్మణుని మాటతో భయముతో నీసన్నిధికి సుగ్రీవుడు వచ్చి వానర
సేనను సిద్ధ పరిచాడు. నీ ప్రియురాలిని వెదకుటకు సిద్ధమై ఉన్న వానర సేనను
చూచి వారిలో ఉంగరాన్ని నీ సందేశమును హనుమంతునికి ఇచ్చి పంపి
ఆనందంగా ఉన్నావు. నువ్వు పంపిన వానరులు అనేక కష్టాలకు గురి అయి అన్ని
దారులను వెతికారు.

35-3 శ్లో.
త్వద్వార్తాకర్ణనోద్యద్గరుదురుజవసంపాతిసంపాతివాక్య-
ప్రోత్తీర్ణార్ణోధిరంతర్నగరి జనకజాం వీక్ష్య దత్త్వాంఽగుళీయమ్ ।
ప్రక్షుద్యోద్యానమక్షక్షపణచణరణః సోఢబంధో దశాస్యం
దృష్ట్వా ప్లుష్ట్వాచ లంకాం ఝటితి స హనుమాన్ మౌళిరత్నం దదౌతే ॥

ప్రతిపదార్థము: త్వత్ వార్తా= నీకు సంబంధించిన రామాయణము, ఆకర్ణన్ =


విన్నందువలన, ఉద్యత్ –గరుత్ = పుట్టిన రెక్కలు గల (శాపము తీరి పోగా రెక్కలు
వచ్చి), ఉరుజవ = అధికమైన వేగముతో, సంపాతి= ఎగిరి ఎదుట వాలిన,
సంపాతివాక్= సీతను చూస్తున్నాను అను సంపాతి మాటలను అనుసరించి
(సమ్యక్ పతతి ఉడ్డయతి బాగుగా ఎగురునది. జటాయువు అన్న, సంపాతి),
అర్ణోధిః = హనుమంతుడు సముద్రమును, ప్రోత్తీర్ణ= దాటి, అంతః నగరి= లంకా
నగరములో, జనకజాం= జానకిని, వీక్ష్య= చూసి, అంగుళీయమ్=
రామాంగుళీయకమును, దత్త్వా= ఇచ్చి , ఉద్యానమ్= అశోకవనమును, ప్రక్షుద్య=
నాశనము చేసి (అత్యంతం క్షుణ్ణః మర్దితః - బాగా మర్దింపబడినది తొక్కబడినది),
చణ-రణః= యుద్ధము చేయుటలో ప్రసిద్ధుడైన, అక్ష-క్షపణ= అక్షకుమారుని
చంపి, (అక్షైః దీవ్యతిపాచికలు ఆడువాడు రావణుని కుమారుడు), సోఢ-బంధః =
బ్రహ్మాస్త్ర బంధమును ఓర్చుకుని (సోఢః శాంతః కృతసహనః - సహింపబడినది),
దశ-ఆస్యం= దశముఖుని, దృష్ట్వా= చూచి, లంకాం చ ప్లుష్ట్వా= లంకను కాల్చి,
ఝటితి = వేగంగా తిరిగి వచ్చి, సః హనుమాన్= ఆ హనుమంతుడు, మౌళిరత్నం =
సీతాదేవి చూడామణిని(చూడా శిరోభూషణం తస్య తత్ర స్థితో వా మణిః -
శిరోరత్నము), తే= నీకు, దదౌ= ఇచ్చెను.

389
తాత్పర్యము: వానరులవలన నీకు సంబంధించిన రామాయణము విన్నందువలన
శాపము తీరి పోగా రెక్కలు వచ్చి అధికమైన వేగముతో వానరుల ఎదుట వాలిన
సంపాతి సీతను చూస్తున్నాను అని చెప్పాడు. సంపాతి మాటలను అనుసరించి
హనుమంతుడు సముద్రమును దాటి, లంకా నగరములో జానకిని చూసి,
రామాంగుళీయక మును ఇచ్చి , అశోకవనమును నాశనము చేసి , యుద్ధము
చేయుటలో ప్రసిద్ధుడైన అక్షకుమారుని చంపి, బ్రహ్మాస్త్ర బంధమును ఓర్చుకుని
,దశముఖుని చూచి, లంకను కాల్చి, వేగంగా తిరిగి వచ్చి ఆ హనుమంతుడు
సీతాదేవి చూడామణిని నీకు ఇచ్చెను

విశేషాలు

సంపాతి: అనూరుని పెద్దకొడుకు. తల్లి శ్యేని. తమ్ముడు జటాయువు. కొడుకు


సుపార్వ్శుడు. ఒకప్పుడు ఇతడును ఇతని తమ్ముడు అగు జటాయువును తమతమ
శక్తి కొలదిని ఎఱుఁగ కోరి అంతరిక్షమునకు ఎగసి పైకిపోవుచు సూర్యమండలమును
సమీపింపగా జటాయువు సూర్యుని వేడిమికి తాళచాలక క్రిందికి ఒఱగగా ఇతడు
తన ఱెక్కలచేత అతనిని కప్పెను. అపుడు సూర్యకిరణముల వేడిమిచే ఇతని ఱెక్కలు
కాలిపోయెను. అంతట మింట నిలువ నేరక ఇతఁడు సముద్రమునను, జటాయువు
దండకారణ్యమునందలి జనస్థానమునను పడిరి. పిమ్మట ఇతడు హనుమదాదులకు
సీత లంకలో ఉండు వృత్తాంతమును తెలిపి ఆసుకృతాతిశయముచే మరల ఱెక్కలు
మొలవగా తన ఉనికిపట్టు అగు హిమవంతమునకు పోయి చేరెను.

35-4 శ్లో.
త్వం సుగ్రీవాంగదాదిప్రబలకపిచమూచక్రవిక్రాంతభూమీ
చక్రోభిక్రమ్య పారే జలధి నిశిచరేంద్రానుజాశ్రీయమాణః ।
తత్ప్రోక్తాం శత్రువార్తాం రహసి నిశమయన్ ప్రార్థనాపార్థ్యరోష-
ప్రాస్తాగ్నేయాస్త్రతేజస్త్రసదుదధిగిరా లబ్దవాన్ మధ్యమార్గమ్ ॥

ప్రతిపదార్థము: త్వం = నువ్వు, సుగ్రీవ-అంగద-ఆది = సుగ్రీవాంగదాది వానర


ప్రముఖులతో(అంగద=అంగదానము చేయువాడు. సుగ్రీవుని కొడుకు), ప్రబల
కపి చమూ = బలమైన వానర సైన్యముతో(చమతి భక్షయతి హినస్తి
390
అరీన్ శత్రువులను చంపునది. సేన), చక్ర విక్రాంత భూమీ= భూమినంతా
ఆక్రమించి (విశేషేణ క్రాంతః పరాక్రమయుక్తః - పరాక్రమంతో కూడుకున్నవాడు.
శూరుడు శత్రువులను ఓడించువాడు, దాటినవాడు), చక్రః అభిక్రమ్య= సముద్రము
దాటుటకు నిశ్చయించి(అభిక్రమ్యతే ప్రారభ్యతే తస్య భావః - పని కారంభించుట),
పారే జలధి= సముద్రతీరములో నువ్వు(పరం తీరం ఏవ పారమ్ తీరము, ఒడ్డు.),
నిశిచర –ఇంద్ర- అనుజ = విభీషణునకు, ఆశ్రీయమాణః= శరణము ఇచ్చి,
(విభీషణుడు ఆశ్రయింపబడుచున్నవాడు కాగా), తత్ ప్రోక్తాం= అతడు చెప్పిన,
శత్రు వార్తాం = శత్రు వార్తలను, రహసి= రహస్యముగా, నిశమయన్ = విని,
ప్రార్థనా ఆపార్థ్య= నువ్వుచేసిన ప్రార్థన ఫలించక పోవుటచే, రోష= కోపముతో,
ఆగ్నేయ అస్త్ర= ఆగ్నేయాస్త్రమును, ప్రాస్త= విడిచి, తేజః త్రసత్= ఆ అస్త్ర తేజస్సుకు
భయపడిన, ఉదధి గిరా= ఆ సముద్రుని మాటలు అనుసరించి (ఉదకాని ధీయంతే
అస్మిన్ నీరు ఇచ్చట ధరింపబడును. సముద్రము), మధ్యమార్గమ్ = సముద్రము
దాటుఉపాయమును, లబ్దవాన్ = పొందినావు.

తాత్పర్యము: నువ్వు సుగ్రీవాంగదాది వానర ప్రముఖులతో బలమైన వానర


సైన్యముతో భూమినంతా ఆక్రమించి, సముద్రము దాటుటకు నిశ్చయించి
సముద్రతీరములో నువ్వు విభీషణునకు శరణము ఇచ్చి, శత్రు వార్తలను
రహస్యముగా విని, నువ్వుచేసిన ప్రార్థన ఫలించక పోవుట చే నువ్వు సముద్రునిపై
ఆగ్నేయ అస్త్రము వేయుటకు సిద్ధపడగా, ఆ అ స్త్ర తేజస్సుకు భయపడిన ఆ సముద్రుని
మాటలు అనుసరించి సముద్రము దాటుఉపాయమును పొందినావు

35-5 శ్లో.
కీశైరాశాంతరోపాహృతగిరినికరైః సేతుమాధాప్య యాతో
యాతూన్యామర్ద్య దంష్ట్రానఖశిఖరిశిలాసాలశస్త్రైః స్వసైన్యైః ।
వ్యాకుర్వన్ సానుజస్త్వం సమరభువి పరం విక్రమం శక్రజేత్రా
వేగాన్నాగాస్త్రబద్ధః పతగపతిగరున్మారుతైర్మోచితోఽభూః ॥

ప్రతిపదార్థము: కీశైః= వానరులు(కీ శబ్దం ఇతి ఈష్టే కీ అని శబ్దము చేయునది.


కోతి), ఆశా-అంతర = అనేక దిక్కుల నుండి(ఆసమంతాత్ సర్వత్ర అశ్నుతే అంతట

391
వ్యాపించునది. దిశ), ఉపాహృత= తీసుకొనివచ్చిన, గిరినికరైః= కొండలతో
బండలతో, సేతుమ్ -అధాప్య = సేతువు కట్టి (సినోతి బధ్నాతి జలమ్ జలమును
బంధించునది (వారిధి). కట్ట సేతువు), యాతః = లంకకు వెళ్లిన, స్వసైన్యైః = నీ
సేనలు, దంష్ట్రా= కోరలు (దశ్యతే అనయా దీనితో నమలబడును. దవుడ, పన్ను),
నఖ శిఖరి శిలా సాల శస్త్రైః = గోళ్ల చివరలు రాళ్లు వృక్షములు ఆయుధములుగా,
వ్యాకుర్వన్ = గ్రహించి (ప్రకాశింపచేస్తూ), యాతూని ఆమర్ద్య = రాక్షసులను
నశింపచేయగా, (యాతి సర్వేషా మంతమ్ అందరిని చంపువాడు. రాక్షసుడు)
(ఆమృద్నాతి తస్య భావః - తొక్కుట ఒత్తి పెట్టుట పీడించుట), త్వం = నువ్వు,
సానుజః = తమ్మునితో, సమరభువి= యుద్ధరంగములో, పరం విక్రమం= ఎదురు
లేని పరాక్రమము చూపి, శక్రజేత్రా వేగాత్= ఇంద్రజిత్తు వేగముగా వేసిన (శక్రం
జితవాన్ ఇంద్రుని జయించినవాడు. మేఘనాదుడు), నాగాస్త్ర బద్ధః =
నాగాస్త్రమునకు చిక్కుకొని, పతగపతి= గరుత్మంతుని, గరుత్ మారుతైః= రెక్కల
గాలిచల్లదనానికి, మోచితః అభూః= తేరుకొని విడువబడ్డావు.

తాత్పర్యము: వానరులు అనేక దిక్కుల నుండి తీసుకొనివచ్చిన కొండలతో


బండలతో సేతువు కట్టి లంకకు వెళ్లి., నీ సేనలు కోరలు గోళ్ల చివరలు రాళ్లు
వృక్షములు ఆయుధములుగా గ్రహించి రాక్షసులను నశింపచేయగా, నువ్వు
తమ్మునితో యుద్ధరంగములో ఎదురు లేని పరాక్రమము చూపి, ఇంద్రజిత్తు వేసిన
నాగాస్త్రమునకు చిక్కుకొని గరుత్మంతుని రెక్కల గాలిచల్లదనానికి తేరుకొని
విడువబడ్డావు.

35-6 శ్లో.
సౌమిత్రిస్త్వత్ర శక్తి ప్రహృతిగలదసుర్వాతజానీతశైల-
ఘ్రాణాత్ ప్రాణానుపేతో వ్యకృణుత కుసృతిశ్లాఘినం మేఘనాదమ్ ।
మాయాక్షోభేషు వైభీషణవచనహృతస్తంభనః కుంభకర్ణం
సంప్రాప్తం కంపితోర్వీతలమఖిలచమూభక్షిణం వ్యక్షిణోస్త్వమ్ ॥

ప్రతిపదార్థము: సౌమిత్రిః తు = లక్ష్మణుడు మాత్రము, అత్ర = ఆ ఇంద్రజిత్తుతో


జరిగిన యుద్ధంలో, శక్తి ప్రహృతి = ఇంద్రజిత్తు ప్రయోగించిన శక్త్యాయుధము

392
దెబ్బకు(ప్రహృతః హింసితః - హింసింపబడినవాడు), గలత్ అసుః =
కూలిపోయాడు, వాతజ-ఆనీత = హనుమంతుడు తెచ్చిన(ఆనయనం సమీపం
ఆనయనమ్ దగ్గరకు తీసుక వచ్చుట), శైల-ఘ్రాణాత్ = సంజీవని పర్వతం గాలి
వాసనచూచి(శిలాః సంతి శిలలు కలది. పర్వతము), ప్రాణాన్ ఉపేతః= ప్రాణము
పొంది, కుసృతిః లాఘినం = తన మాయలతో సంతోషపడుతున్న(కుత్సితా సృతిః
సరణం ఆచారః - చెడు ఆచారము శఠత్వము మూర్ఖత్వము)(సామర్థ్యే
లావతే సమర్థుడగుట, యోగ్యుడగుట), మేఘనాదమ్= ఇంద్రజిత్తును(మేఘస్య
నాద ఇవ గర్జనః ఇవ నాదః యస్య - మేఘముల గర్జనము వంటి గర్జనం గలవాడు.
రావణుని కుమారుడు), వ్యకృణుత = చంపి, మాయా క్షోభేషు= రావణుడు చేసిన
మాయాబాధను, వైభీషణవచనహృతస్తంభనః= విభీషణుని మాటతో
తొలగించుకొని, కంపిత ఉర్వీతలమ్ = భూమిని కంపింపచేస్తూ, అఖిల చమూ
భక్షిణం= సేనలను తినుచున్న, సంప్రాప్తం = దగ్గరకు వచ్చిన, కుంభకర్ణం = కుంభ
కర్ణుని (కుంభ ఇవ కర్ణౌ యస్య-కుండలవంటి కర్ణములు కలవాడు. కుంభకర్ణుడు,
రావణుని తమ్ముడు), త్వమ్= నువ్వు, వ్యక్షిణః = చంపావు.

తాత్పర్యము: లక్ష్మణుడు మాత్రము ఆ ఇంద్రజిత్తుతో జరిగిన యుద్ధంలో ఇంద్రజిత్తు


ప్రయోగించిన శక్త్యాయుధము దెబ్బకు కూలిపోయాడు. హనుమంతుడు తెచ్చిన
సంజీవని పర్వతం గాలి వాసనచూచి ప్రాణము పొంది, తన మాయలతో
సంతోషపడుతున్న ఇంద్రజిత్తును ఎదిరించి, రావణుడు చేసిన మాయాస్తంభనమును
విభీషణుని మాటతో తొలగించుకొని, తమమీదికి వచ్చి భూమిని కంపింపచేస్తూ
సేనలను తినుచున్న కుంభకర్ణుని నువ్వు చంపావు.

విశేషాలు

కుంభకర్ణుడు: రావణాసురుని తమ్ముడు. ఈరక్కసుడు మహాఘోరము అగు


తపము ఒనరించి వరము అడుగబోవు వేళ దేవతల ప్రార్థనచే సరస్వతీదేవి వాని
నాలుకయందు ప్రవేశించి ‘నిద్ర కావలెను’ అని పలికించెను. అది కారణముగ
వాడు ఎల్లపుడు నిద్రపోవుచుండును. మఱియు వానికి నిద్రాభంగము అగువేళ
చావు సంభవించును అని నియతి కలిగి ఉన్నందున రాముడు లంకలో

393
యుద్ధముచేయు నవసరమున రావణుఁడు నిద్రించుచు ఉన్న కుంభకర్ణుని లేపి
యుద్ధమునకు పంపగా వాఁడు రామునిచేత చచ్చినట్లు చెప్పుదురు. రావణ
కుంభకర్ణులు సనకసనందనుల శాపముచే రాక్షసావతారము ఎత్తిన
విష్ణుద్వారపాలకులు.

35-7 శ్లో.
గృహ్ణన్ జంభారిసంష్రేషితరథకవచౌ రావణేనాభియుధ్యన్
బ్రహ్మాస్త్రేణాస్య భిందన్ గళతతిమబలామగ్నిశుద్ధాం ప్రగృహ్ణన్ ।
దేవశ్రేణీవరోజ్జీవితసమరమృతై రక్షతైః ఋక్షసంఘైః
లంకాభర్త్రా చ సాకం నిజనగరమగాః సప్రియః పుష్పకేణ ॥

ప్రతిపదార్థము: జంభారి= ఇంద్రుడు (జంభుడు అను అసురుని చంపుటచే ఇతనికి


ఈనామము కలిగెను), సంష్రేషిత = పంపిన, రథ కవచౌ= రథకవచములను,
గృహ్ణన్= స్వీకరించి, రావణేన = రావణునితో, అభియుధ్యన్= యుద్ధమునకు
సిద్ధపడి, బ్రహ్మ-అస్త్రేణ= బ్రహ్మాస్త్రానుసంధానము చేసి, అస్య= రావణునియొక్క,
గళతతిమ్= పది తలలను, భిందన్= తుంచి, అగ్నిశుద్ధాం= అగ్నిశుద్ధయైన,
అబలామ్= సీతను, ప్రగృహ్ణన్= స్వీకరించి, దేవ శ్రేణీవర = గొప్ప
దేవతలచే(సంజీవకరణి విశల్యకరణి సంధానకరణి మొదలగు మహౌషధులచే),
ఉజ్జీవిత= తిరిగి ప్రాణం తీసుకొన్న, సమరమృతైః =యుద్ధములో మరణించిన,
అక్షతైః = గాయములు లేని, ఋక్షసంఘైః = ఎలుగుగొడ్లు మరియు వానర
సంఘములతో, లంకాభర్త్రా చ= నీచే లంకాధిపుడుగా జేయబడిన విభీషణునితో,
సప్రియః= జానకితో, సాకం = కలిసి, పుష్పకేణ= పుష్పక విమానము ఎక్కి (పుష్పం
ఇవ కాయతి ప్రకాశతే పుష్పము వలె ప్రకాశించునది. ఒక పుష్పము పూబొమ్మ
కుబేరుని పుష్పక విమానము), నిజ నగరమ్ =నిజ రాజధానికి, అగాః= వెళ్ళితివి.

తాత్పర్యము: ఇంద్రుడు పంపిన రథకవచములను గొని రావణునితో యుద్ధమునకు


సిద్ధపడి ఆదిత్య హృదయ పారాయణబలమున బ్రహ్మాస్త్రానుసంధానము సేసి
రావణుని పది తలలను తుంచి అగ్నిశుద్ధయైన సీతను స్వీకరించి, సంజీవకరణి
విశల్యకరణి సంధానకరణి మొదలగు మహౌషధుల అధిపతులయిన గొప్ప

394
దేవతలచే తిరిగి ప్రాణం తీసుకొన్న ఎలుగుగొడ్లు మరియు వానర సంఘములతో,
నీచే లంకాధిపుడుగా జేయబడిన విభీషణునితో, జానకితో – వీరందరితో పుష్పక
విమానము ఎక్కి నిజ రాజధానికి వెళ్ళావు.

35-8 శ్లో.
ప్రీతో దివ్యాభిషేకైరయుతసమధికాన్ వత్సరాన్ పర్యరంసీః
మైథిల్యాం పాపవాచా శివశివ కిల తాం గర్భిణీమభ్యహాసీః ।
శత్రుఘ్నేనార్దయిత్వా లవణనిశిచరం ప్రార్ధయాశ్శూద్రపాశం
తావద్వాల్మీకిగేహే కృతవసతిరుపాసూత సీతాసుతౌ తే ॥

ప్రతిపదార్థము: దివ్య అభిషేకైః=దివ్యమైన అభిషేకములతో పట్టాభిషిక్తుడవయి


(మంత్రపూర్వకం షేకఃస్నానమ్ మంత్రపూర్వకంగా స్నానము), ప్రీతః=
సంతోషించినవాడివయి, అయుత సమ అధికాన్ వత్సరాన్= పదివేలయేండ్లకు
మించి, పర్యరంసీ = పాలించి, పాపవాచా= అపనిందకు లోనైన, తాం గర్భిణీమ్
=ఆ గర్భిణి అయిన (గర్భః అస్తి అస్యాః - గర్భము కలది. గర్భవతి), మైథిల్యాం =
సీతను(మిథిలా జనపదస్య రాజస్య జనకస్య అపత్యం స్త్రీ మిథిల జనపదమునకు
రాజైన జనకుని కూతురు, సీత), అభ్యహాసీః= విడిచిపెట్టావు, శివశివ కిల=
అయ్యయ్యో !, శత్రుఘ్నేన = శత్రుఘ్నునిచే, లవణ నిశిచరం= లవణాసురుని,
అరయి ్ద త్వా= చంపించి, శూద్రపాశం= శూద్ర ముని అయిన శంబూకుని(శంబయతి
సూచయతి శుభమ్ శుభమును సూచించునది. శంఖము శంబూకుడు), తే
ప్రార్ధయః = నువ్వు సంహరించితివి, తావత్ = అటుపిమ్మట, వాల్మీకి గేహే =
వాల్మీకి ఆశ్రమమందు(వల్మీకస్య గోత్రాపత్యం పుమాన్ వల్మీక గోత్రమునందు
పుట్టినవాడు. వాల్మీకి ఋషి), కృతవసతిః = వసతి గ్రహించిన, సీతా =
సీతాదేవి( సినోతి బధ్నాతి స్నేహమ్ స్నేహమును బంధించునది. నాగటి చాలు
శ్రీరాముని భార్య), సుతౌ = ఇరువురి కుమారులను, ఉపాసూత= కన్నది.

తాత్పర్యము: అయోధ్యయందు పట్టాభిషిక్తుడై సంతోషించినవాడివయి పదివేల


యేండ్లకు మించి రాజ్యమును పాలించి అపనిందకు లోనైన గర్భిణి అయిన
జనకాత్మజను సీతను విడిచిపెట్టావు.. శివశివా! అపై శత్రుఘ్నునిచే లవణాసురుని

395
చంపించి, శూద్ర ముని అయిన శంబూకుని నువ్వు సంహరించితివి. అటుపిమ్మట
వాల్మీకి ఆశ్రమమందున్న సీతాదేవి ఇరువురి కుమారులను కన్నది.

35-9 శ్లో.
వాల్మీకేస్త్వత్సుతోద్గాపితమధురకృతే రాజ్ఞయా యజ్ఞవాటే
సీతాం త్వయ్యాప్తుకామే క్షితిమవిశదసౌ త్వం చ కాలార్థితోఽభూః ।
హేతోః సౌమిత్రిఘాతీ స్వయమథ సరయూమగ్ననిశ్శేషభృత్యైః
సాకం నాకం ప్రయాతో నిజపదమగమో దేవ! వైకుంఠమాద్యమ్ ॥

ప్రతిపదార్థము: దేవ= గురువాయూరు దేవా!, వాల్మీకేః ఆజ్ఞయా = వాల్మీకి ఆజ్ఞతో,


త్వత్ సుత= నీ కుమారులైన కుశలవులు, యజ్ఞవాటే = యజ్ఞవాటమునందు
(యజ్ఞాయ వటయతి యజ్ఞమునకు ఎన్నుకున్న భూభాగము), ఉద్గాపిత= గానం
చేసిన, మధురకృతేః = నీ మధురాతి మధురమైన కృతిని (విన్నావు), అసౌ సీతాం =
ఆ సీతను తిరిగి, త్వయి= నువ్వు స్వీకరింప కోరగా, ఆప్తుకామే= ఆమె (ఆప్తః ప్రాప్తః
కామః కామనా విషయేన - కోరిక, మనోరథము సిద్ధించినది), క్షితిమ్ = భూమిలో,
అవిశత్ = ప్రవేశించింది, త్వం చ = నువ్వు కూడా, కాల అర్థితః అభూః=-
యమధర్మరాజు చేత స్వర్గారోహణము కొరకు ప్రార్థింపబడి, హేతోః= ఒక
కారణముతో, సౌమిత్ర ఘాతీ =లక్ష్మణుని విడిచి వేసావు, అథ = అటుపిమ్మట,
స్వయమ్ = స్వయముగా, సాకం = సమస్తమైన, నిశ్శేష భృత్యైః = దేవాంశజులయిన
పౌరులతో, సరయూ మగ్నః= సరయూనదిలో మునిగి, నాకం= స్వర్గమునకు
పౌరులు, ప్రయాతం= వెళ్ళగా, నిజ పదమ్ వైకుంఠమ్ = నువ్వు వైకుంఠమునకు,
అగమః = ప్రయాణమైతివి, వైకుంఠమ్= ఆ వైకుంఠము (వికుంఠస్య విష్ణోః ఇంద్రస్య
వా ఇదం వా విష్ణువు, ఉండు చోటు. స్వర్గము, ఆద్యమ్= సర్వలోకములకు మొదటిది
అనగా బ్రహ్మాండోత్పత్తికంటే ముందరిది.

తాత్పర్యము: వాల్మీకి ఆజ్ఞ తో నీ కుమారులైన కుశలవులు గానం చేసిన నీ మధురాతి


మధురమైన కృతిని యజ్ఞవాటమునందు కుశలవులు పాడగా విన్నావు. ఆ మీద
సీతను తిరిగి నువ్వు స్వీకరింప కోరగా ఆమె భూమిలో ప్రవేశించింది. ఆ తరువాత
నువ్వు యమధర్మరాజు చేత స్వర్గారోహణము కొరకు ప్రార్థింపబడి ఒక కారణముపై

396
లక్ష్మణుని త్యజించి, స్వయముగా నీవారితో దేవాంశ సంభవులై అవతరించిన
పౌరులతోగూడ సరయూనదిలో మునిగి నీ వైకుంఠధామమునకు నువ్వు చేరు
కొన్నావు. దయచేసితివి. ఆ వైకుంఠము అన్ని లోకములకు మొదటిది. అనగా
బ్రహ్మాండోత్పత్తికంటే ముందరిది.

విశేషాలు

కారణము: యముడు తానును అవతార విరమణ విషయమైన రహస్య ప్రసంగము


చేయుచున్న సమయములో , ఆ సమయములో తనను చూడవచ్చిన వానిని విడిచి
పెడతానని యమునియెదుట రాముడు ప్రతిజ్ఞ చేసాడు. తాను చేసిన ప్రతిజ్ఞనుబట్టి,
ఆ నడుమవచ్చిన లక్ష్మణుని రాముడు విడిచిపెట్టాడు.

కుశలవులు: శ్రీరాముని కుమారులు.. వీరిని గర్భమునందు ధరించి ఉండగా


శ్రీరాముఁడు ‘కొంచెమైనను ఎరబరికములేక చిరకాలము రావణాసురుని ఇంట
ఉండిన సీతను ఆమెయందలి మోహము చేత విడనాడ చాలక తోడితెచ్చి ఇంట
ఉంచుకొని ఏలుచున్నాడు’ అని లోకులు చెప్పు మాటలు విని లోకాపవాదమునకు
వెఱచి పూర్ణగర్భిణి అయిన సీతను అడవికి పంపివేసెను. అంతట ఆమె వాల్మీకి
ఆశ్రమముచేరి అచట కవల పిల్లలను కనెను. అంతట ఆమహర్షి ఆబిడ్డలకు
జాతకర్మాది వైదికక్రియలు నడపి ధనుర్విద్య మొదలుగాగల సమస్తవిద్యలను
నేర్పించాడు. పిమ్మట కొంతకాలమునకు సీతయు కుశలవులును మరల
రామునియొద్ద వచ్చి చేరిరి. ఆకుమారులలో కుశుడు కుశస్థలి అను పురమును
నిర్మాణము చేసెను.

35-10 శ్లో.
సోఽయం మర్త్యావతారస్తవ ఖలు నియతం మర్త్యశిక్షార్థమేవం
విశ్లేషార్తిర్నిరాగస్త్యజనమపి భవేత్ కామధర్మాతిసక్త్యా ।
నోచేత్స్వాత్మానుభూతేః క్వ ను తవ మనసో విక్రియా చక్రపాణే।
స త్వం సత్త్వైకమూర్తే। పవనపురపతే। వ్యాధును వ్యాధితాపాన్ ॥

ప్రతిపదార్థము: కామధర్మ-అతిసక్త్యా= కామాదులందు అత్యంత ఆసక్తి(కామ్యతే

397
అసౌ కామము, కోరిక మన్మథుడు), విశ్లేష-ఆర్తిః= వియోగ వ్యథకు దారి
తీస్తుందని, ( విగతః శ్లేషః - విశ్లేషము, వియోగము, అభావము, వేర్పాటు, హాని),
నిరాగః త్యజనమ్ అపి భవేత్= ధర్మ విషయంలో అత్యంత ఆసక్తి వలన
నిరపరాధులైన తన వారిని కూడా వదిలివేయ వలసి వస్తుందని, మర్త్యశిక్షార్థమ్ =
లోకులకు(మ్రియతే అత్ర - ఇక్కడ నశించును. మర్త్యలోకము), ఏవం= ఇట్లు,
నియతం= రూఢిగా చెప్పటానికే, సః అయం మర్త్యావతారః తవ ఖలు= నువ్వు ఈ
మర్త్యావతారం (రామావతారం) ధరించావు కదా!, నోచేత్= కాకపోయినచో, స్వ-
ఆత్మానుభూతేః= ఆత్మ చైతన్యంలో సదా ఉండే, తవ మనసః= నీ మనస్సులో,
విక్రియా= మనో వికారాలు (విరుద్ధా క్రియావిరుద్ధమైన పని అనిష్టము, మార్పు
చెందుట, ఉద్వేగము, ప్రతిక్రియ), క్వ ను = ఎక్కడివి?(ఉండవని భావం),
చక్రపాణే= ఓ చక్ర పాణీ!, సత్వ-ఏకమూర్తే।= సత్వ గుణ సంపన్నుడా!,
పవనపురపతే।= గురు వాయూరు దేవా!, స త్వం = అటువంటి నువ్వు,
వ్యాధితాపాన్= వ్యాధి తాపములను, వ్యాధును= తొలగించు.

తాత్పర్యము: కామాదులందు అత్యంత ఆసక్తి వియోగ వ్యథకు దారి తీస్తుందని,


ధర్మ విషయంలో అత్యంత ఆసక్తి వలన నిరపరాధులైన తన వారిని కూడా
వదిలివేయ వలసి వస్తుందని లోకులకు చెప్పటానికే ఇట్లు రూఢిగా నువ్వు ఈ
మర్త్యావతారం (రామావతారం) ధరించావు కదా! కాకపోయినచో ఆత్మ
చైతన్యంలో సదా ఉండే నీ మనస్సులో మనో వికారాలు ఎక్కడివి? (ఉండవని
భావం) ఓ చక్ర పాణీ ! సత్వ గుణ సంపన్నుడా! గురు వాయూరు దేవా! అటువంటి
నువ్వు వ్యాధి తాపములను తొలగించు

నవమ స్కంధము
35వ దశకము సమాప్తము

398

You might also like