You are on page 1of 13

శ్

రీ దోసగీత
నేతి సూర్యనారాయణ శర్మ

‘‘అ ర్జునా! దేవుడంటే మరీ పిసినిగొట్టు వాడనకోకు. సృష్టిలో అందరూ


నాకు సమానమే. ఎవ్వరికీ ఏ లోపం చేయాలని నాకెప్పుడూ
ఉండదు. ప్రతివారూ రెండుపూటలా నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్లతో సుష్టుగా
భోంచేయాలన్నదే నా తపన. అందుకే నేనే వైశ్వానరుడనే అగ్నిరూపం ధరించి,
జీవులందరిలోనూ కొలువుంటాను. అగ్నికి వాయువు తోడులేనిదే రాణించలేదు
కనుక వాయువుగానూ నేనే జీవులలో దశావతారాలు ధరిస్తాను. ఆ అవతారాలలో
మరీ ముఖ్యమైన ప్రాణము, అపానము అనే వాయువుల సహాయంతో వైశ్వానరాగ్నిని
మండిస్తాను. నాలుగువిధాలుగా అన్నాన్ని వండుతూ ఉంటాను.
నీ కడుపులోనే నేనో వంటవాడిగా ఉంటాను. నువ్వు తినే ప్రతిదీ అరిగిస్తాను.
నీకు బలాన్ని, వీర్యాన్ని, తేజస్సునూ ఇస్తాను. కానీ నువ్వే కక్కుర్తిపడి దిక్కుమాలినవన్నీ
తిని, కడుపు చెడగొట్టుకుంటూ ఉంటావు. అయినప్పటికీ నీ ఇంద్రియాలకు
అధిదేవతనై నిన్ను నేను మాటిమాటికీ హెచ్చరిస్తూనే ఉంటాను. నువ్వు పెడచెవిని
పెడుతుంటావు. జీవులందరికీ పోషకుణ్ణైన నేను ఎవ్వణ్ణీ ఎప్పుడూ కడుపు మాడ్చి

శ్రీదోసగీత a 150
చంపను. ఎప్పుడూ ఏదో ఒకటి తినబెట్టడానికే ప్రయత్నిస్తుంటాను. కానీ మీ
మానవులేం చేస్తారంటే దొరికింది దొరికినట్లు ఆబగా తినేస్తూ, పుట్టింది మొదలు
తిన్నది అరిగించుకునే శక్తిని రోజుకు కొంత చొప్పున చంపుకుంటూ ఉంటారు.
అయినా పోన్లే ఆ సన్నాసుల్ని వదిలేద్దాం అని నేనెప్పుడూ అనుకోను. దేహం
విడిచిన జీవుడికి కొత్త దేహాన్ని ప్రసాదిస్తూ ఉంటాను. కర్మఫలాన్ని అనుభవింప
చేస్తుంటాను. మళ్లీ నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్లు పూటపూటకూ నైవేద్యం
పెడుతూనే ఉంటాను. పార్ధా! అదీ సంగతి’’ అన్నాడు కృష్ణుడు ఒకచేతిలో
పిల్లనగ్రోవిని, రెండోచేత అభయముద్రను ఓపిగ్గా కంటిన్యూ చేస్తూ.
‘‘బావా! మహానుభావా! నాకింకో డౌటు పీకుతోంది. నాలుగు కూరలు,
నాలుగు పచ్చళ్లలో నీకే కూరంటే ఇష్టం? పప్పుతో మిళాయించినా, ఉత్తగా పోపేసి
దింపేసినా ఏ కూర అన్నింటిలోనూ శ్రేష్టమైనది? ఏ కాయగూరతో పచ్చడి చేస్తే
భగవంతునివైన నువ్వు మెచ్చుకుంటావు? అన్నట్టుగా మర్చేపోయాను... పన్లోపనిగా
దప్పళం సంగతి కూడా చెప్పు బావా!’’ మోకాళ్లపై నిలిచి ప్రార్థనగా అడిగాడు
పాండవ మధ్యముడు.
‘‘అర్జునా! అప్పుడే మనం గీతలోని పదిహేనో అధ్యాయంలోకి వచ్చేశాం.
ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇంతకుముందే నీకు నా విశ్వరూపం చూపెట్టాను.
అది చూశాక అయినా నీ అనుమానాలన్నీ పటాపంచలు కావాల్సింది. కానీ నువ్వేమో
జడుసుకున్నావు. అందుకే ఏదైనా సూక్ష్మంలో మోక్షంలా ఉండాలని నా ప్రవచనం
మరికొంచెం పొడిగించాను. ఇప్పుడు చెబుతున్నాను విను. పురుషోత్తముడైన నన్ను
సూక్ష్మంలో ఎక్కడైనా చూడవచ్చు. హాయిగా చూడాలనుకుంటే దోసకాయలో చూడు.
గమ్మత్తేంటంటే దాంట్లో అస్సలు ఫ్యాట్ ఉండదు. వెయిట్ లాస్ కి చాలా మంచిది.
పోతే దానిక్కూడా శివుడికి ఉన్నట్లే మూడుకళ్లుంటాయి. కాస్త వెనక్కి తిప్పిచూడు.
అంబకం అంటే తండ్రి, కన్ను, బాణం అని మూడు అర్థాలున్నాయి. శివయ్య
మూడు కన్నుల తండ్రి. ఆయన ధనుస్సుకు మూడు బాణాలుంటాయి. అవే అన్నము,
వాతము, వర్షము. ఇలా చెబితే అందరికీ అర్థం కాదేమో అని ఆ మూడింటికీ మరో
మూడు పేర్లను కూడా నమకం చెప్పింది. అవే ద్రవ్యము, వేడిమి, నీరు. ఈ మూడే
శివుని బాణాలు. జీవుని దేహంలో ఈ మూడూ సమతౌల్యంగా ఉండాలి. ఈ
మూడింటినీ సక్రమంగా ఉంచుతూ పుష్టిని కలగచేసేవాడే శివుడు.
ఇడ, పింగళ, సుషుమ్న నాడులు మూడూ కలిసే భ్రుకుటి వద్ద ఆజ్ఞాచక్రం
మేలుకుంటుంది. దోసకాయను తరిగి చూస్తే మూడోనేత్రం తెరుచుకుంటుంది.
నేతి సూర్యనారాయణ శర్మ a 151
అలా మూడోనేత్రం తెరుచుకున్నందువల్లనే శివుడు మహోన్నతమైన గోలోకంలో
నా దర్శనం పొందగలిగాడు. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలనే నాలుగు వెరైటీల్లోనూ
దోసకాయను వినియోగించినవారు మృత్యుంజయులవుతారని శివుడే శాసనం
చేశాడు. మిగిలిన ఏ కూరలో అయినా దైవాసుర సంపద్విభాగాలు ఉండవచ్చు. కానీ
దోసకాయలో మాత్రం ఏ దోషాలూ లేవు. అది దైవికమైన విత్తనం.
సత్త్వ రజస్తమో గుణాలలో దోసకాయ సత్త్వమహత్తు కలిగినది. నీ శ్రద్ధ
దానిపై పెట్టు. పిచ్చివాడా! తొందరపడి మోక్షం కోరకు. నిత్యమూ దోసకాయను
సేవిస్తే, నీవునాతో సాయుజ్యం పొందినట్లే. నేను నీ వెంటే ఉంటాను. మొత్తంమీద
దోసకాయను గురించి నీకు సమగ్రంగా చెప్పాను. ఏ రకంగా దోసకాయను
తింటావో నీ ఇష్టం. నువ్వు కేవలం తింటున్నవాడివేనని మర్చిపోకు. అరిగిపోతున్న
వాణ్ణి, అరిగిస్తున్నవాణ్ణి నేనే అని గుర్తుపెట్టుకో’’ అని ముగించి రథంవైపుకి నడిచాడు
కృష్ణుడు.
మోకాళ్ల మీద నుంచి పైకి లేచి, కృష్ణుడి వెంటబడి వస్తూ, ‘‘అది సరేకానీ
బావా! దోసకాయను యధాశక్తి సేవించి, మోక్షసామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్న
వారెవరైనా ఉన్నారా? దీనికంటూ ఓ ప్రత్యేకమైన వ్రతం ఉందా? దయచేసి ఆ
వివరాలు కూడా నాకోసం చెప్పు’’ అడిగాడు అర్జునుడు.
నొగలు కిందినుంచి కొంతగడ్డి బయటకు తీసి, గుర్రాలకు వేస్తూ
వాసుదేవుడు కొనసాగించాడు. ‘‘పూర్వం సూతమహర్షి శౌనకాది మునులకు ఆ
వివరమంతా తెలియచేశాడు. తీరని కోరికలు ఉన్నవారు, మోక్షాన్ని కోరుకునేవారు,
సమాజక్షేమాన్ని ఆశించినవారు దోసయజ్ఞాలు చేస్తుంటారు. ఇది నూరురోజులపాటు
జరిగే విశేష క్రతువు. మాఘమాసంలో శిశిరరుతువులో భూమిని సమంత్రకంగా
దున్ని, దోసవిత్తనాలు చల్లాలి. ప్రతినిత్యం రుద్రహోమం, మృత్యుంజయ
హోమం చేయాలి. దోసతీగను నేలపై పాకిస్తూ రుత్విక్కులు యజ్ఞశాలలోనికి,
ఆమీద హోమగుండంలోకి మళ్లించాలి. పూర్తిగా పండిన దోసకాయ, తీగనుంచి

శ్రీదోసగీత a 152
విడిపోయిన తరువాత దానితో పూర్ణాహుతి చేయాలి. మంత్రప్రభావమో, దోసలో
ప్రకృతిసిద్ధంగా ఉన్న లక్షణమో కానీ రోజురోజుకీ కొంతచొప్పున జరుగుతూ
దోసకాయ ప్రయత్నపూర్వకంగా తొడిమనుంచి విడిపోతుందని మన వ్యవసాయ
శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.’’
‘‘ఇంతకూ బావా! ఈ దోసకాయ కొంపతీసి విశ్వామిత్ర సృష్టి కాదు కదా?!’’
మళ్లీ డౌటు పడ్డాడు అర్జునుడు.
ఆ మాట వింటూనే నాలిక బయటపెట్టి, ముక్కుమీద వేలేసుకున్నాడు
పార్థసారధి. ‘‘ఎంతమాట! విశ్వామిత్ర సృష్టి అయితే ఆబ్దికాల్లో పనికిరాకుండా
పోయేది కదా! అయినప్పటికీ దోసకాయ కూడా విశ్వామిత్రునితో సాటి రాగలిగినదే.
బ్రహ్మర్షి పదవి కోసం వశిష్టునితో విశ్వామిత్రుడు పోటీ చేసినట్లు దోసకాయ కూడా
మామిడికాయతో పోటీచేసింది. చివరకు తాను కూడా ఆవకాయ అయ్యేందుకు
అర్హత సంపాదించుకుంది. అయితే ఇది విశ్వామిత్ర సృష్టి కాదు. దోసకాయను
సంస్కృతంలో ఉర్వారుక, కర్కటిక, చర్మటికా అనే పేర్లతో పిలుస్తారు. ఈ మూడు
పేర్లు రావడం వెనుక మూడు ప్రసిద్ధమైన కథలు మన ప్రాచీన వాఙ్మయంలో
ఉన్నాయి’’ అంటూ లోకసమ్మోహనంగా నవ్వాడు సత్యాపతి.
‘‘బావా! ఆ కథలు తెలుసుకోవాలని మహా కుతూహలంగా ఉంది.
యుద్ధం మొదలైతే మళ్లీ ఖాళీ చిక్కదు. పన్లోపనిగా ఇప్పుడే చెప్పేసి పుణ్యం కట్టుకో’’
పసిపిల్లాడిలా బతిమాలాడు పార్థుడు.
‘‘అర్జునా! అదుగో... నకులుడు శంఖం పూరించాడు. ఈ అశ్వరాజాలు
లద్దెలు వేసే సమయం ఆసన్నమైనట్లుంది. మనం మర్యాదగా ఆ కనిపించే జమ్మిచెట్టు
కింద తూముమీద కూచుని మిగతా కథ సావధానంగా చెప్పుకుందా పద’’ అంటూ
దారితీశాడు కృష్ణుడు. అనుసరించాడు అర్జునుడు.
మొదటి కథ ఇలా చెప్పాడు.
‘‘యోగవాశిష్ఠంలో వశిష్ట మహర్షి శ్రీరామచంద్రమూర్తికి బోధించిన కథ ఇది.
పూర్వం జంబూద్వీపంలో కర్కటి అనే రాక్షసి ఉండేది. దానికళ్లలో అగ్నిపర్వతాలు
నిప్పులు చిమ్ముతుండేవి. అది నడిచివస్తుంటే నల్లటి కొండ నడిచొస్తున్నట్లుండేది.
సముద్రంలో పుట్టే నిప్పులాంటి బడబానలం దాని కడుపులో ఉంది. ఎంతతిన్నా,
ఏం తిన్నా దాని ఆకలి తీరేది కాదు. జంబూద్వీపంలో ఉండే అందరినీ ఒక్కదెబ్బలో
తినేసినా తన ఆకలి తగ్గదేమో అనిపించేది. అందరినీ ఒక్కసారే తినేస్తే రేపటి

నేతి సూర్యనారాయణ శర్మ a 153


తిండి మాటేమిటి? చివరకు దానికి ఏమీ పాలుపోక ఉత్తర హిమాలయాలకు
పోయింది. ఒంటికాలి మీద నిలిచి, రెప్పవేయడం మానేసి తపస్సు మొదలుపెట్టింది.
వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి. కర్కటి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు
ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. కర్కటి కొంచెం తబ్బిబ్బు పడింది.
‘‘దేవా! నాకింత పెద్ద శరీరం ఇచ్చావు. దీన్ని పోషించాలంటే చాలా కష్టంగా
ఉంది. ఈ దేహానికి సరిపడేంత తిండి దొరకడం లేదు. అంచేత ముందస్తుగా నన్ను
సూదిలా సన్నగా మార్చెయ్. అలాగే నాకు ఈ తోలుతిత్తి వద్దు. ఇనుప ఒళ్లు కావాలి’’
అంది.
‘‘తథాస్తు’’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘‘నువ్వు సూదిలా మారిపో. ఇక నుంచి
నిన్నందరూ విశూచిక అని పిలుస్తారు. తినకూడనివి తినేవాళ్లను, తప్పుడు మార్గాల్లో
జీవించేవాళ్లను నువ్వు శాసిస్తావు. అతిసారం పుట్టించి, నీ దెబ్బ రుచిచూపించి
వారి ఆరోగ్యాన్ని కాజేస్తావు. అలా నీ ఆకలి తీరిపోతుంది’’ అని చెప్పి బ్రహ్మ
అంతర్ధానమయ్యాడు.
కొండంత శరీరం కలిగిన కర్కటి చిన్నసూదిలా మారిపోయింది. దుమ్ము,
ధూళి ఉన్న అపరిశుభ్ర వాతావరణాల్లో సంచరించడం మొదలుపెట్టింది. ప్రజల్ని
వ్యాధిగ్రస్తుల్ని చేసి తన ఆకలి తీర్చుకోసాగింది. ప్రజలందరూ అతిసార పాలబడి
మరణించసాగారు. విశూచిక ప్రజల జీవసూచిక అయింది. అలా కొన్ని వందల ఏళ్లు
గడిచాయి. కర్కటికి జీవితం పట్ల రోతపుట్టింది. కొన్నిసార్లు బురదలో, కొన్నిసార్లు
కుళ్లిన ఆహారంలో అపరిశుభ్రమైన వాతావరణంలో సంచరించడం దానికి నచ్చలేదు.
కొండంత దేహం వదిలిపెట్టి, ఇంత చిన్న దేహంలోకి మారిపోవడం అవమానంగా
భావించసాగింది. మళ్లీ తన ఒళ్లు తిరిగి రావాలని హిమాలయాలకు వెళ్లి తపస్సు
సాగించింది.
తపస్సులోని వేడిమికి దాని నెత్తిమీదనుంచి పొగ బయలుదేరింది. ఆ పొగ
మరో విశూచిక అవతారం ధరించింది. ఆమె నీడ మరో విశూచిక అయింది. ముగ్గురూ
కలిసి తపస్సు సాగిస్తున్నారు. ఆ తపస్సు వేడికి హిమాలయాలు కరిగిపోవడం
మొదలుపెట్టాయి. ఆమె పరిశుద్ధురాలైంది. తనలోని అజ్ఞానం పటాపంచలైంది. ఆమె
ప్రభావానికి ఇంద్రలోకం దద్దరిల్లడం ప్రారంభించింది.
దేవేంద్రుడు వాయుదేవుణ్ణి పిలిచి, ఆమె తపస్సు భగ్నం చేయమని చెప్పాడు.
వాయువు ఆమెను సమీపించి నోటిలో దూరడానికి ప్రయత్నించాడు. మాటిమాటికీ
ఆమె తనను ఉమ్మేయడంతో విఫలుడై వాయుదేవుడు డీలాపడి ఇంద్రుడి వద్దకు
శ్రీదోసగీత a 154
వచ్చాడు. ‘‘లాభం లేదు ఇంద్రదేవా! ఆమె తన
శరీరాన్ని ఇనుప ఖనిజంలా మార్చుకుంది. అందులో
పంచభూతాలకు తావులేదు. తనలోని వేడిమిని,
చివరకు ఛాయను కూడా బయటకు తెచ్చి ఆమె తపస్సు
చేస్తోంది’’ అని చెప్పాడు.
చేసేది లేక ఇంద్రుడు వెళ్లి బ్రహ్మను ఆశ్రయించాడు. ఆమె
ఇంద్రియాలను సైతం పరిత్యజించి తపస్సు చేస్తోంది. బ్రహ్మ స్వయంగా
ఎదురుగా వెళ్లి ప్రత్యక్షం అయినా కంటితో తనను చూడలేదు. కనుక
ఆమెలోనే ప్రవేశించాడు బ్రహ్మ. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు.
సత్యదర్శనం జరిగిన తరువాత కోరికలేముంటాయి? నాకేమీ అక్కరలేదంది
కర్కటి.
‘‘అలా కుదరదు. సృష్టి నియమాలను ఎవరూ ధిక్కరించలేరు. కొన్నాళ్లు
మళ్లీ నీ పాతశరీరంలో నువ్వు ప్రవేశించు. లౌకిక భోగాలను అనుభవించి, విముక్తిని
పొందు’’ అని బ్రహ్మ ఆదేశించాడు.
ఆమె ఆ విధంగానే చేసింది. మళ్లీ కొండంత రూపాన్ని పొందింది. దానికి
ఆమెకు ఆరునెలల సమయం పట్టింది. క్రమంగా ఆమెకు మళ్లీ ఆకలి దప్పికలు
పుట్టాయి. పూర్ణవివేకం ఉదయించిన తరువాత జీవించి ఉండడానికి, మరణించడానికి
మధ్య భేదం కూడా పోయిందామెకు. ఆకలిని తట్టుకోవడం నేర్చుకుంది.
అప్పుడు ఆకాశవాణి పలికింది. ‘‘ఓ కర్కటీ! అజ్ఞానులైన వారిని ఉద్ధరించు.
మోసగాళ్ల మనస్సులు మార్చు. వివేకవంతులు చేయవలసిన పని అదే. సత్యాన్ని
తెలుసుకున్న తరువాత కూడా మేలుకోని వారిని హాయిగా ఆరగించు. నీకేమీ పాపం
అంటదు’’ అని ప్రబోధించింది.
హిమాలయ శిఖరాన్ని వదిలి కర్కటి జనపదాల్లో ప్రవేశించింది. విక్రముడనే
రాజు పాలిస్తున్న రాజ్యానికి వచ్చింది. అక్కడికి వచ్చేసరికి బాగా చీకటి పడింది.
కొందరు గస్తీ తిరుగుతున్నారు. రాజు, మంత్రి మారువేషాల్లో సంచరిస్తున్నారు.
వాళ్లిద్దరూ కర్కటి కంట్లో పడ్డారు. మాయారూపంలో కంటికి కనిపించకుండా కర్కటి
వారిద్దరితోనూ వాదనలు చేసింది. వేదాంత చర్చల్లో మునిగింది. తన ప్రశ్నలకు
వారిచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందింది.
చివరకు వారి కంటికి కనిపించి, ‘‘రాజా! ఇంత రాత్రివేళ ఎందుకిలా
సంచరిస్తున్నావు. నీ రాజ్యం సుభిక్షంగానే ఉందికదా!’’ అని ప్రశ్నించింది.

నేతి సూర్యనారాయణ శర్మ a 155


రాజు దీనవదనుడై, ‘‘ఏం చెప్పను తల్లీ! నా ప్రజలంతా కీళ్లనొప్పులు,
రాచకురుపులు, రక్తహీనతలతో బాధపడుతున్నారు. దీనికి విరుగుడు ఏమిటో
తెలియడం లేదు’’ అన్నాడు.
‘‘శరీరం ఇనుప ముక్కలా చేసుకోవడానికి చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా
నాకో మంత్రం ఉపదేశించాడు. ఇప్పుడు నీకు నేనా మంత్రం ఇస్తాను. దాంతో నువ్వు
నీ ప్రజల అనారోగ్యాలు తగ్గించుకో’’ అంటూ కర్కటి అప్పటికప్పుడే రాజును నది
ఒడ్డుకు తీసుకువెళ్లి శాస్త్రయుతంగా మంత్రదీక్ష నిచ్చింది.
గురుసన్నిధిలోనే కొద్దిసేపు మంత్రాన్ని జపించిన తర్వాత విక్రముడు,
‘‘తల్లీ! ఇప్పుడు నువ్వు నాకు గురువు అయ్యావు. నా రాజ్యక్షేమాన్ని కోరినందువల్ల
మిత్రురాలివి కూడా అయ్యావు. ఇక మీదట నీ ఆకలి తీర్చే పూచీ నాది. పాపాత్ములు,
దొంగలను నీకు ఆహారంగా అందిస్తాను. సామాన్య స్త్రీలా రూపం ధరించి నాతో రా’’
అంటూ ఆమెను రాజమందిరానికి తీసుకువెళ్లాడు.
కర్కటికి కడుపునిండా ఆహారం దొరికింది. అయినా కక్కుర్తి లేకుండా
అయిదేళ్లపాటు ఆకలి తట్టుకుంటూ నిరాహారంగా తపస్సు చేసేది. అప్పుడప్పుడు
మాత్రమే ఏ వందమందినో మాత్రమే తేలికపాటి ఆహారంగా పుచ్చుకునేది. మళ్లీ
అయిదేళ్లు సమాధిలోకి వెళ్లిపోయేది. విక్రముని తర్వాతి రాజులు కూడా ఆమెతో
స్నేహం పాటించారు. ఆమె ఆ రాజ్య ప్రజల రుగ్మతల్ని తగ్గించింది. ఆమెను
వారు కాంధారదేవిగా పూజించేవారు. తరువాతికాలంలో ప్రజలందరి సంక్షేమం
కోరి ఆమెయే కర్కటికా ఫలం అంటే దోసకాయగా పుట్టింది.... ఇదీ దోసకాయకు
సంబంధించిన తొలి కథ... ఆకలి కథ... ఇంతటితో ముగిసింది.’’
‘‘మరి తరువాతి కథ?’’ ఆసక్తిగా అడిగాడు అర్జునుడు.
‘‘చర్మఠుడు అనేవాడిది విచిత్రమైన కథ.... నిద్ర కథ. భాగవతంలో
ముచికుందుడు యుద్ధంలో బాగా అలిసిపోయాడు కాబట్టి, యుగాల తరబడి
నిద్రపోయే వరం కోరుకున్నాడు. కానీ చర్మఠుడు అలాకాదు. ఏ రోజూ
అలిసిపోయేంతగా ఏ పనీ చేయని వఠ్ఠి సోమరిపోతు. కడుపునిండా తిన్నా వాడికి
ఏనాడూ కంటినిండా నిద్రపట్టేది కాదు. ఏది తిన్నా అజీర్ణమో, కడుపుమంటో
తగులుకుని రాత్రిళ్లు కంటినిండా నిద్రలేకుండా చేసేది. ఒకసారి వాడు గోదావరి
తీరంలో లంక దోసకాయ తిన్నాడు. ఆరోజు వాడికి కంటినిండా కమ్మగా నిద్రపట్టింది.
ఆనాటివరకూ వాడిని పట్టిపీడిస్తున్న రోగాలన్నీ క్రమంగా కుదురుకున్నాయి. వాడిలో
సోమరితనం కూడా క్రమంగా నశించింది. చర్మఠుడు కర్షకుడయ్యాడు. లంకదోసను
శ్రీదోసగీత a 156
విస్తృతంగా పండించి, ప్రపంచ వ్యాప్తం చేశాడు. అలా వాడి
పేరుమీద దోసకాయకు చర్మటికా అనే పేరు వచ్చింది’’ అని
వివరించాడు కృష్ణ భగవానుడు.
‘‘మరి ముచ్చటగా ఆ మూడోకథ ఏమిటి?’’ మళ్లీ
విజయుడు ప్రశ్నించగా ద్వారకాధీశుడు ఇలా చెప్పాడు.
‘‘ఉజ్జయినిలోని సాందీపని మహర్షి దగ్గర నేను
విద్యాభ్యాసం చేశాను. ఆరోజుల్లో విన్న కథ ఇది. పూర్వం
ఉజ్జయినిలో ఉర్వారుకనాథుడు అనే సిద్ధుడు ఉండేవాడు.
అతడంటే పుర ప్రజలకు ఎంతో భయభక్తులుండేవి. నడిచొచ్చే
కొండలా ఉండేవాడతను. చేతిలో సటకా, నడుముకు పటకాతో ప్రజల ముందు
ఎన్నో సిద్ధవిద్యల్ని ప్రదర్శించేవాడు. కాలభైరవుణ్ణి, పాతాళ భైరవిని ప్రతినిత్యం
పూజించేవాడు. పదిహేను అంగుళాల వెడల్పాటి బిలమార్గంలో కొండంత శరీరం
ఉన్న ఆ సిద్ధుడు సునాయాసంగా ప్రవేశించి, భైరవిని కొలిచేవాడు. ఆ సమయంలో
బిలంలోనుంచి విపరీత ధ్వనులు పుట్టేవి. ప్రజలు భయాందోళనలకు గురయ్యేవారు.
ఉర్వారుక నాథుడు మాత్రం రెట్టింపు తేజస్సుతో బిలంలో నుంచి పాములా పాకుతూ
బయటకు వచ్చేవాడు. బయటకు వచ్చిన తరువాత ఎవరేం కోరినా కాదనేవాడు
కాదు. అటువంటి సిద్ధుడికి కూడా అనుకోకుండా ఓ ఇద్దరి వల్ల పెనుప్రమాదం
ముంచుకొచ్చింది.
ఆ ఇద్దరూ చాలాకాలంగా రెండు వేర్వేరు కోరికలతో సిద్ధుడి దగ్గరకు
ప్రతిరోజూ వచ్చేవాళ్లు. ఒకడి కోరిక భయానికి సంబంధించినదైతే, రెండోవాడి కోరిక
మైధునానికి చెందినది. అధర్మము, సృష్టి వ్యతిరేకమూ అయిన ఆ కోరికలను తీర్చే
పసక్తి లేనేలేదని సిద్ధుడు చాలాసార్లు తెగేసి చెప్పాడు. అయినా వాళ్లు వినిపించుకోలేదు.
వెంటబడి అడుగుతూనే ఉన్నారు. సిద్ధుడు తిరస్కరిస్తూనే ఉన్నాడు. కొన్నాళ్లపాటు
సిద్ధుడి దినచర్యను చాలా దగ్గరగా పరిశీలించారు వాళ్లిద్దరూ. చివరకు వాళ్లిద్దరికీ
ఏమనిపించిందంటే... అతని మహిమలన్నింటికీ అసలు కారణం నడుముకున్న
పటకా, చేతిలోని సటకాలే... కాబట్టి ఆ రెండింటినీ దక్కించుకుంటే మనం
కోరుకున్నవి పొందవచ్చు అనుకున్నారు. ఒకనాటి రాత్రి క్షిప్రానది ఒడ్డున సిద్ధుడి
చేత మత్తుగా తాగించి, ఆ మత్తులోనే అతగాణ్ణి తెగనరికేశారు. తమకు కావాల్సిన
వస్తువులు తీసుకుని సిద్ధుణ్ణి అక్కడే భూమిలో పాతేశారు. వాళ్లకు కావాల్సింది
దొరకలేదని వేరే చెప్పనక్కర లేదు. కానీ, ఉర్వారుకనాథుణ్ణి పాతేసిన మట్టినుంచి

నేతి సూర్యనారాయణ శర్మ a 157


కొంతకాలానికి ఏవో తీగలు బయటపడ్డాయి. ఆ తీగలనుంచే దోసకాయలు పుట్టాయి
అని ఉజ్జయినిలో జానపదులు కథలుగా చెప్పుకుంటారు. అర్జునా! ఇవీ దోసకథలు.
ఆహార నిద్రా భయ మైధునాల్లా జీవులందరిపై సమాన ప్రభావాన్ని చూపించేది
దోసకాయ మాత్రమేనని ఈ కథల వల్లనే మనకు తెలుస్తోంది’’ అన్నాడు శ్రీకృష్ణుడు.
తన్మయత్వంగా కాసేపు కళ్లు మూసుకున్నాడు అర్జునుడు. అంతలోనే
ఏదో కలవరపాటు కలిగినట్లుంది. ‘‘గోకుల నందనా! ఇంత గొప్ప దోసకాయపై
మన కవులెవరూ కవిత్వాలు రాయలేదా? మల్లెపూలు, చందమామలపైనే కానీ
ఇంతటి మహత్త్వపూర్ణమైన దోసకాయమీద ఎవ్వరూ ఎందుకు ఇంతదాకా పెన్ను
చేసుకోలేదు’’ ఆవేదనగా ప్రశ్నించాడు.
‘‘కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తన వేయిపడగలు నవలలో
దోసకాయను అడ్డంపెట్టి కొన్నిపేజీలు కథ నడిపించారు. ఆదర్శవంతమైన
సంఘానికి ఉన్న నాలుగు మూలస్తంభాలూ ఒరిగిపోకుండా, కూలిపోకుండా
ఉండాలంటే దోసకాయ నిత్యం సేవించాల్సిందేనని సోదాహరణంగా నిరూపించారు.
మార్కండేయుడి తర్వాత ఆ పట్టు తెలిసింది విశ్వనాథకే. బమ్మెర పోతన మాత్రం
ఏం తక్కువ తిన్నాడు? గుర్రం రూపంలో నన్ను చంపడానికి కేశి అనే రాక్షసుడు
వచ్చినప్పుడు, దాని నోటిలో చేయిపెట్టి పెద్దది చేస్తే రాక్షసుడి దేహం దోసకాయ
విచ్చిపోయినట్లు విచ్చిపోయిందని రాశాడు. ఇక మన తెలుగు సినిమా కవులు వట్టి
వెధవాయలోయ్... ఒక్క జంధ్యాల మాత్రమే కకుంభరీ అని తనదైన స్టయిల్లో ఓ
పాత్రచేత తిట్టించాడు అంతే!’’ మూడుముక్కల్లో తేల్చేశాడు శ్రీకృష్ణుడు.
అర్జునుడిలో రెండోసారి నిర్వేదం ప్రవేశించింది. ధనుర్బాణాలు రథంమీదే
వదిలేశాడు కనుక ఈసారి కిరీటి కిరీటం తీసి పక్కన పెట్టాడు. ‘‘ఎన్ని కథలు ఎంత
వివరంగా చెబితే ఏం ప్రయోజనం బావా! మన ఆధునిక మేధావులు కట్టుకథల
కింద కొట్టి పారేస్తారు. ఊసుపోక రాసిపారేశారని ఈసడిస్తారు. సైంటిఫిక్ టెంపో
మిస్సయిందని చులకన చేసేస్తారు. యుగయుగాల ఈ వెనుకబాటుకు అంతమే

శ్రీదోసగీత a 158
లేదా? పరాయికూరల పెత్తందారీతనంలో మన నేటివ్ దోసకాయలు ఇలా
మగ్గిపోవలసిందేనా?’’ కంటనీరు కవచం కిందినుంచి జారి ఛాతీని తడిపేస్తుంటే
తుడుచుకోలేని అసహాయతలో అర్జునుడు ఆగకుండా ఏదేదో మాట్లాడేస్తున్నాడు.
‘‘అర్జునా! ఎంత విజ్ఞానం పెరిగితే మాత్రం లాభమేముంది? మానవుడు
మరణాన్ని జయించలేని నిస్సహాయుడు. అతడికి అమృతత్వాన్ని ప్రసాదించే దివ్యఫలం
దోసకాయే. ఆ విషయం దానికి పెట్టిన మూడుపేర్లే రుజువు చేస్తున్నాయి. సృష్టిలో
మరణమే లేని జీవి కర్కాటకం అంటే ఎండ్రకాయ. అది బిడ్డను ప్రసవిస్తూ పాతదేహాన్ని
విడిచిపెట్టేస్తుంది. ఆ కర్కాటకం స్మరణకు వచ్చేలా దోసకాయను కర్కటికా ఫలం
అన్నారు. చర్మంపై మోజు లేదు కనుక చర్మటికా అన్నారు. ఇక పొట్టమీద పాకే
లక్షణం ఉన్నది కనుక ఉర్వారుకమని చెప్పారు. దానికి సహజ సుగంధం ఉందని,
పుష్టి కలిగిస్తుందని, ఈశ్వరుడే దానిని సేవించి మృత్యుంజయుడు అయ్యాడని
చెప్పారు. పూర్తిగా పండిన దోసపండు సునాయాసంగా తీగనుంచి విడివడినట్లుగా
మృత్యుబంధనం నుంచి త్రయంబకుడు నన్ను దూరం చేయుగాక! అమృతత్వం
నుంచి మాత్రం కాదు అని త్రయంబకం యజామహే అనే మృత్యుంజయ మంత్రానికి
అర్థం. ఇంత విన్న తర్వాత కూడా దైవకణం ఎక్కడో లేదు... దోసకాయలోనే ఉందని
అర్థం కాకపోతే....ఇదిగో ఇప్పుడు గీతాసారాంశంగా మోక్షసంన్యాస యోగాన్ని
అనుగ్రహిస్తున్నాను విను...’’ అంటూ గొంతు సవరించుకుని లేచి నిలబడ్డాడు
భగవానుడు.
అర్జునుడు మోకాళ్లపై నిలిచి పాతపోజులో నమస్కరించాడు.
గీతాకృష్ణుడు చెబుతున్నాడు... ‘‘పొటాషియం, మెగ్నీషియం అధికంగా
కలిగిన దోసకాయలు బిపికి చాలా మంచివి. మా చిన్నతనాల్లో జగ్గయ్యపేట
నక్కదోసకాయలు మహారుచిగా చిరుపులుపుతో ఉండేవి. గాదెల్లో పోస్తే చాలాకాలం
నిల్వ ఉండేవి కూడా. దోసకాయకు కందిపప్పు సరైన కాంబినేషను. ముక్క నలగకుండా
పచ్చడి చేయడంలో రుక్మిణీదేవి అందెవేసిన చేయి. సత్యభామ మాత్రం వంకాయలాగా
కాల్చి పచ్చడి చేస్తుంది. బుడందోసకాయ ఒరుగులు లేకుండా జాంబవతి ఇంటిలో
భోజనం పూర్తికాదు. చిన్నపాటి గుమ్మడికాయల్లాంటి తినే దోసకాయలు... వాటిని
మిత్రవింద అవంతీ రాజ్యం నుంచి పుట్టింటిసారెగా తెచ్చుకుంది. కాళిందికి పందిరి
దోసకాయమీద ప్రేమ ఎక్కువ. నాగ్నజితి దోసకాయలో గింజలు తీసేసి వండుతుంది.
మా మరదలైన భద్ర చెక్కుసైతం తీయడానికి ఒప్పుకోదు. మద్రదేశాధిపతి కూతురైన
లక్షణ మహా చలాకీ అయినది. దోసగింజల పైతోలు తీసి పప్పులన్నీ ఏరి భోజనం

నేతి సూర్యనారాయణ శర్మ a 159


అయ్యాక తాంబూలానికి ముందు
అందిస్తుంది. కుంతీ కుమారా! అష్టభార్యలు
నాకు అందించిన అష్టైశ్వర్యాలు ఇవే. ఈ
భాగవత మహారహస్యాన్ని తెలుసుకున్నవాడు
సచ్చిదానంద పరబ్రహ్మమును
చేరుకుంటాడు.’’
‘‘బావా!’’ అడ్డుకున్నాడు అర్జునుడు.
పైపంచెతో ముఖం తుడుచుకున్నాడు. రెండుచేతులూ జోడించి, ‘‘కుటిలాలక
సంయుక్త పూర్ణచంద్ర నిభాననా! బావా! విలసత్ కుండల ధర దేవా! కన్నూ
ముక్కూ ఏకమై లాలాజలంతో చేరి త్రివేణీ సంగమం జరిగేటట్లుంది. ఈ
పూటకి చాలిద్దాం బావా! నీ ప్రబోధంతో నాకళ్లకు కమ్మిన మాయపొరలు
విచ్చిపోయాయి. నేడు నాకు జ్ఞానోదయమైంది. ఇన్నాళ్లూ గలగలలాడే వేపుడు
ముక్కలే గొప్పవనే భ్రమలో ఉన్నాను. చప్పిడిగా ఉంటుందని, నీరొచ్చేస్తుందని
దోసకాయను దూరంపెట్టాను. ఆఖరికి ఈ వేళ పొద్దున కూడా ద్రౌపది దోసకాయ
మూనబద్దల కూర వడ్డిస్తే విసిరి కొట్టేసి వచ్చేశాను. చెడ్డతప్పు చేసేశానని ఇప్పుడు
కదా తెలిసింది!! పద బావా! ముందు వెళ్లి కూర తిందాం. యుద్ధం సంగతి ఆనక
చూసుకుందాం’’ అంటూ ఆకలిగా బయలుదేరాడు అర్జునుడు.
‘‘భీభత్సా ఆగు...’’ అన్నాడు శ్రీకృష్ణుడు. చిద్విలాసంగా మురళిని
ఎడమచేతిలోకి మార్చుకుని కుడిచేయి పైకి చాపాడు. దానిలో దోసకాయ
ప్రత్యక్షమైంది. ఆబగా చూస్తున్న అర్జునుడికి దాన్ని ప్రసాదించకుండానే మళ్లీ
ఉపన్యాసం మొదలుపెట్టాడు.
‘‘మన మనసెప్పుడూ దోసకాయ పైతోలులా ఉండాలి. దృఢంగానూ,
బయటినుంచి వచ్చే ఆలోచనలు స్వాగతించ గలిగేంత పల్చగానూ ఉండాలి.
కాయ ముదిరేకొద్దీ లోపల కండపెరిగినట్లు విజ్ఞానం పెరుగుతూ పోవాలి. గింజలనే
మూలాలను మర్చిపోకూడదు. నిజానికి దోసగింజల మధ్య ఉండే గుజ్జు అసలైన
జ్ఞానం. కొంతమంది తెలియక గింజలు తీసేసి దోసకాయ వండేస్తుంటారు. అది
తప్పు. దోసగింజలో ఎన్నో వ్యక్తిత్వ వికాస సూత్రాలున్నాయి. త్వరలో దీనిపై పుస్తకం
కూడా తీసుకొస్తాను’’ ఉత్సాహంగా ప్రకటించాడు శ్రీకృష్ణుడు.
‘‘వద్దు బావా! దయచేసి అంతపని మాత్రం చెయ్యకు’’ అంటూ
కంగారుగా దోసకాయను లాక్కుని కొంచెం కొరికి తిన్నాడు అర్జునుడు. ‘‘బావా!

శ్రీదోసగీత a 160
నువ్వు మామూలుగా శ్లోకాల్లో చెప్పు చాలు. ఆ పుస్తకాల సంగతి మిగతావాళ్లు
చూసుకుంటారు. నువ్వొక్కడివే ఎంతని కష్టపడతావు చెప్పు!’’ అన్నాడు కడుపునిండిన
కృతజ్ఞతతో.
శ్రీకృష్ణుని కంఠం పాంచజన్యంలా మోగింది.
‘కుదరదు. దోసకాయకు మూలము, అగ్రమూ కూడా నేలమీదే ఉంటాయి.
దోస విషయంలో అయినా, నా విషయంలో అయినా
అందరూ సమానమే. గీతాజ్ఞానం కొందరికే సొంతం
కాదు, అందరికీ అందవలసిందే. స్వతంత్రంగా
నేనే యుద్ధం చేయకపోయినా ప్రతివాడి యుద్ధానికి
మూలకారణము, సన్నాహము, నిర్వహణ, ముగింపు నేనే
అని తెలుసుకో.
ఇప్పటికి స్వస్తి.

నేతి సూర్యనారాయణ శర్మ a 161


నేతి సూర్యనారాయణ శర్మ
రచనలు

• శంకరవిజయం (నవల), వెల : రూ. 350


• శివానందలహరి రసదీపిక, వెల : రూ. 116
• విష్ణుసహస్రనామ స్తోత్రం (శంకరభాష్యానుసారం), వెల : రూ. 200

• మొగలాయి దర్బార్ (అలనాటి చారిత్రక నవల), వెల : రూ. 275


• కాకర్త్య గుండన (నవల), వెల : రూ. 250
• శ్రీదోసగీత (కథలు), వెల : రూ. 150

శంకర సాహిత్యానికి...
సరళానువాదాలు అందించాలనే
ప్రణాళికలో భాగంగా త్వరలో...

• భుజంగ ప్రయాతం
• కనకధారా స్తోత్రం
• భజగోవిందం (మరికొన్ని శంకరుల ఉపదేశగ్రంథాలు)

ప్రతులకు :
ఫోన్ : 99 5174 8340

follow us on
www.facebook.com/groups/sankaravijayam

శ్రీదోసగీత a 162

You might also like