You are on page 1of 18

మనుస్మృతి - మంచీ చెడూ

( అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన తానా 23 వ మహాసభలో ‘ సాహితీ స్రవంతి’ కార్యక్రమంలో భాగంగా నేను

చేసిన ప్రసంగం పూర్తి పాఠం)

‘మనుస్మృతి’. విద్యావంతులు, సాహిత్యాభిమానులలో దాదాపుగా ఆ పేరు విననివారుండరు. అయితే ఆ గ్రంథం

గురించి గతంలో వినివున్నవారిలో కూడా అసలా గ్రంథంలో ఏమున్నదనే సమగ్ర అవగాహన లేనివారే ఎక్కువ.

‘మను ధర్మశాస్త్రం’ లేక ‘మానవ ధర్మశాస్త్రం’ అని కూడా వ్యవహరించే ఆ గ్రంథంలో అన్ని ప్రాచీన గ్రంథాలలో ఉన్నట్లే

ఆ కాలపు సామాజికార్థిక నియమావళులు ఉన్నాయి. సమాజం నిరంతరం పురోగమిస్తూనే ఉంటుంది కనుక

మారుతున్న సామాజిక, ఆర్ధిక అవసరాల మేరకు కట్టు బాట్లు , నీతి రీతులలోనూ నిత్య పరిణామం సహజమే. ఆ

కారణంగా ఆనాటి సమాజం రూపొందించుకున్న నియమాలలో నేటి సమాజానికి కొరగానివే ఎక్కువ ఉండటం

కూడా అంతే సహజం. దానిలో వివరించబడిన అంశాలలో కొన్నిశాస్త్రీయమైన విషయాలుంటే మరెన్నో ఆధునిక

శాస్త్ర పరీక్షకు ఏమాత్రం నిలబడని అసంగతమైన విషయాలు కూడా ఉన్నాయి. కొన్ని అంశాలు చరిత్ర పాఠకులకు,

సామాజిక చరిత్రకారులకు విద్యాపరమైన ఆసక్తి ( Academic Interest) ని కలిగించేవి కాగా మరికొన్ని

సామాజిక ఉద్యమకారులకు జుగుప్స కలిగిస్తా యి. వేదాలు, రామాయణ, మహాభారతాలు, పురాణాలు వంటి

ప్రాచీన గ్రంథాలన్నిట్లోలాగే ఈ గ్రంథంలోనూ ఎన్నో అశాస్త్రీయమైన, అసంగతమైన విషయాలున్నట్లే కొన్నినేటి

ఆధునిక సమాజానికి సైతం ఉపయుక్తమైన అంశాలు కూడా ఉన్నాయి. ఆ యా గ్రంథాలు ఆనాటి పాలక

వర్గాల సామాజిక, ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల పరిరక్షణ కోసమే రూపొందించబడ్డా యనేది నిర్వివాదాంశం.

అయితే ఏ నేపథ్యంలో మనుస్మృతి రూపొందిందో, ఆ గ్రంథంలో అసలేముందో విద్యావంతులంతా

తెలుసుకోవలసిన అవసరం మాత్రం ఉంది. ప్రతి ప్రాచీన గ్రంథంలోనూ ఆనాటి చారిత్రక, సామాజిక సమాచారం

కొంతైనా నిక్షిప్తం అయివుంటుంది కనుక చరిత్రకారులకు ఎంతో కొంతమేరకు అదొక విలువైన చారిత్రక ఆకరం (

Historical Source Book) కాగలదు. నేనూ ‘ మనుస్మృతి’ ని ఒక Historical Document గానే

భావిస్తు న్నాను. నా దృష్టిలో దానికి ఎలాంటి పవిత్రత లేదు. అదొక చారిత్రక దశకు ఆధార గ్రంథం. అందుకే దాని

లోతైన అధ్యయనానికి పూనుకున్నాను.

మనుస్మృతి - మంచీ చెడూ : 1


‘ పురాణమిత్యేవ న సాధు సర్వం’ అన్నాడు మహాకవి కాళిదాసు. కనుక గతంలో చెప్పబడిందంతా యథాతథంగా

నేటికి కూడా పనికొచ్చేది కాదని ముందుగా మనమంతా గ్రహించాలి. ‘మంచి గతమున కొంచెమేనోయ్’ అంటూ

మందగించక ముందడుగు వెయ్యమని ఉద్బోధించాడు మహాకవి గురజాడ. మన గతమంతా చెడ్డదేననీ, అందులో

నేటి సమాజానికి పనికొచ్చే విషయాలేవీ ఉండవని నమ్మే ఆధునికులు సైతం గతంలో ఉన్న ఆ కాస్త మంచిని

స్వీకరించి ముందడుగు వేయాల్సివుంటుంది. దానిలో ఏముందో తెలుసుకోకుండానే దాన్ని కొందరు

సంప్రదాయవాదులు నేటికీ ఆ నియమాలు యథాతథంగా అనుసరణీయమేనని గుడ్డిగా వెనకేసుకొస్తుంటే,

ఇంకొందరు దానిని పూర్తిగా వ్యతిరేకిస్తుండటం, ఆ గ్రంథాలను తగులబెడుతూ ఉండటం చిత్రం. తాత్త్విక

పరిభాషలో దీనినే ఏకాంతవాదం (One-sidedness) అంటారు. ప్రతి విషయాన్నీ పలు కోణాల్లో పరిశీలించి

గతితార్కిక దృష్టితో దానిని మూల్యాంకనం చేయటం విజ్ఞుల లక్షణం. గతి తార్కిక దృష్టి అంటే సమాజంతో సహా

ఈ విశ్వంలోని ప్రతి ఒక్కటీ పరిణామానికి లోబడే ఉంటుందనే గ్రహింపు కలిగి, మంచిని మంచిగా, చెడును

చెడుగా విశ్లేషించి చూడగలగటం. ఇందుకు విరుద్ధంగా ఏ విషయాన్నైనా ఎలాంటి లోతైన విచారణ చేయకుండా

కొట్టిపారేయటం ‘ధ్వంసతావాదం’ కిందికే వస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ముందుగా

మనుస్మృతిలో అసలు ఏముందో తెలుసుకోవటం విజ్ఞులందరికీ అవసరం. అప్పుడే దానిలో ఏ కాస్తైనా నేటి

సమాజానికి ప్రయోజనకరమైనది ఉందో లేదో, ఉంటే అది ఏ మేరకో ఎవరైనా తేల్చగలుగుతారు. ఈ ఉద్దేశంతోనే

నేనా పనికి పూనుకున్నాను.

నరబలితో సహా శ్రౌత యజ్ఞాలలో మన పూర్వులు విశృంఖలంగా చేసిన జంతుబలులు, బానిసత్వం, మనుషుల్ని

సంతల్లో పశువుల్లా గా అమ్మటం, కొనటం, వారిని జూదంలో పందెంగా ఒడ్డటం, సతీసహగమనం, భర్త మరణిస్తే

ఒక స్త్రీ అతడి సోదరునితో కలిసి జీవించే దేవరన్యాయం, బాల్యవివాహాలు, బహుభార్యాత్వం, ఆడపిల్లల్ని అమ్ముకుని

వారి తల్లిదండ్రు లు వసూలుచేసే కన్యాశుల్కం (ఓలి), వివాహం కోసం పురుషులు తీసుకునే వరకట్నం వంటి మన

ప్రాచీన సమాజంలో ఉండిన అనేక అనాగరికమైన, అశాస్త్రీయమైన సామాజిక ఆచారాలు పరిణామ క్రమంలో

కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే అవేవీ తమకు తాముగా అదృశ్యమైపోలేదు. పెరుగుతున్న శాస్త్ర పరిజ్ఞానం,

మారుతున్న సామాజిక అవసరాలు, సమాజ హితం కోరే అభ్యుదయవాదులు చేసిన పట్టు వదలని పోరాటాలు,

ప్రజాభిప్రాయానికి తలవొగ్గి పాలకులు చట్టా ల్లో తీసుకొచ్చిన సంస్కరణలు – వీటన్నిటి కారణంగా ఈ

దురాచారాలన్నీసమాజం నుంచి నిష్క్రమించక తప్పలేదు. సంప్రదాయ వాదులు సామాజిక పురోగతిని

మనుస్మృతి - మంచీ చెడూ : 2


అడ్డు కునేందుకు తమ శక్తికొలదీ ప్రయత్నించినా అనివార్యమైన ఈ పరిణామాన్ని వారు అడ్డు కోలేకపోయారన్నది

చారిత్రక సత్యం. అయితే కొన్ని ప్రాంతాలలో, కొన్ని సామాజిక వర్గాలలో ఆలోచనలలో వెనుకబాటు కారణంగా ఈ

దుర్మార్గపు ఆచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనేదీ సత్యమే. ప్రగతికాముకుల అలుపెరగని పోరాటాలే ఈ

దురాచారాలను సమూలంగా నివారించగలవు. పుస్తకాలను తగలబెట్టినంతమాత్రం చేతనో, చట్టా లుచేయడం

చేతనో దురాచారాలు అంతమైపోవు. ఆ యా విషయాలపై ప్రజలను జాగృతం చేయడం ద్వారానే వాటిని

సమాజంనుంచి ఊచముట్టు గా సాగనంపగలం. పైపెచ్చు అసమంజసం, అశాస్త్రీయం, అనాగరికం, అమానవీయం

అనే కోణాలనుంచి చూస్తే ఆధునికుల శీలపరీక్షలకు నిలిచే ప్రాచీన గ్రంథం ఏదీ మిగలదు. ‘రామాయణం రంకు !

భారతం బొంకు !! ‘ అంటున్నవారు మనకు ఉండనే ఉన్నారు. అయితే మనం ప్రత్యామ్నాయ సాహిత్య సృష్టి

ద్వారానే అనాగరికమైన సంప్రదాయ భావజాలాన్ని తిప్పికొట్టా లి. అంతేగానీ ప్రాచీన గ్రంథాలను తగులబెట్టటం

సమస్యకు ఎంతమాత్రం పరిష్కారం కాబోదు. పైపెచ్చు అలాంటి చర్యలు ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం

కూడా ఉంది. అలాంటి చర్యలు చరిత్రకు కూడా నష్టదాయకం అనేందుకు ఒక ఉదాహరణ చెపుతాను. ఒకప్పుడు

బుద్ధభూమిగా విలసిల్లిన ఆంధ్ర దేశంలో - ప్రత్యేకించి మహాయాన బౌద్ధా నికి పట్టు గొమ్మ అయినట్టి పల్లవ

భోగ్య(పలనాడు)

లో- బౌద్ధం వెనుకపట్టు పట్టిన దశలో వ్యతిరేకులు బౌద్ధ సాహిత్యమంతా తగులబెట్టిన కారణంగానే ప్రాచీన తెలుగు

సాహిత్యం ఆనవాళ్ళు లేకుండా మటుమాయమైపోయింది.

బౌద్ధ యుగపు పలనాటి విభవం సింహళ భాషలోని ‘ దీపవంశ’, ‘మహావంశ’ అనే బౌద్ధ గ్రంథాల నుంచి మనకు

తెలుస్తు న్నది. మన తెలుగు భాషకు, సాహిత్యానికీ ఎంత ప్రాచీన చరిత్ర ఉన్నా ప్రాచీన భాష హోదాకోసం ప్రాచీన

తెలుగు గ్రంథాలు ఆధారంగా చూపలేకపోయిన కారణంగా ఆ విషయంలో తమిళ, కన్నడ భాషలతో పోటీలో

మనం వెనుకబడ్డాం. కనుక మనం విజ్ఞులమైతే మన పోరాటాన్ని ప్రాచీన గ్రంథాలమీద కాదు – వాటిలోని

దుర్మార్గపు భావజాలం మీదనే ఎక్కుపెట్టా లి. నేను ముందుగా అభ్యుదయవాదులందరికీ ఈ విషయం స్పష్టం

చేయదలచాను.

మనువు సంతానం అయినందునే మనందరికీ మానవులనే పేరు ఏర్పడిందట. ఒకప్పుడు పెద్ద జలప్రళయం ఒకటి

వచ్చి అత్యున్నతమైన మహా పర్వతాలు సైతం ఆ నీటి కింద మునిగిపోయి, ఆ కారణంగా జీవరాసులన్నీ

మనుస్మృతి - మంచీ చెడూ : 3


చాలామేరకు నశించాయట. ఒకప్పటి ఈ జలప్రళయ గాథ ప్రపంచవ్యాప్తంగా మనుస్మృతి, బైబిల్, ఖుర్ - ఆన్

వంటి దాదాపు అన్ని ప్రాచీన గ్రంథాలలోనూ ఒకేవిధంగా ప్రస్తా వించబడిన కారణంగా అందులో కొంత కల్పన ఉండే

అవకాశమున్నా ఎంతో కొంత వాస్తవం ఉండే ఉంటుందని చరిత్రకారులు భావిస్తు న్నారు. ప్రళయానంతర దశలో

అప్పటికి నశించిపోగా మిగిలిన మానవులకు ఒరిపిడి లేని సమాజంకోసం వారంతా ఎలాంటి సామాజిక, ఆర్ధిక

నియమాలు పాటించాలో నిర్దేశిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పలు నిబంధనావళులు సృష్టించబడ్డా యి.

అలాంటి ప్రాచీన సామాజికార్థిక నియమావళులలో మనుస్మృతి కూడా ఒకటి. ఇప్పుడిక ఈ గ్రంథంలోని మంచి

చెడుగులను క్లు ప్తంగా పరిశీలిద్దాం.

మంచి

‘మనుస్మృతి’ మొత్తం 12 అధ్యాయాలు 2,508 శ్లోకాలు. వాటిలో ఎన్నెన్నో విశేషాలు. కొన్ని శతాబ్దా ల పాటు ఈ

గ్రంథం విద్యావంతులైన భారతీయులకు ఒక రిఫరెన్స్ గ్రంథం ( ‘వేడీ మికం’ - vade mecum) గా

ఉపయోగపడింది. వర్ణాశ్రమ ధర్మాలు - ప్రత్యేకించి ఆహార, ఆరోగ్య నియమాలు, సంస్కారాలు - సంప్రదాయాలు,

ప్రాయశ్చిత్తా లు - శిక్షలు, ఇలా మన ప్రాచీన సంస్కృతిలోని పలు అంశాలు ఈ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాయి.

తరతరాల భారతీయుల నరనరానా అవి ఇంకిపోయాయి. కాబట్టే అవన్నీ ఆ స్మృతిలో ఉన్నాయని

తెలియనివారు కూడా వాటిలో కొన్నింటినైనా నేటికీ తమకు తెలియకుండానే పాటిస్తూ ఉండటం చిత్రం.

‘విజయ’ చలనచిత్ర నిర్మాణ సంస్థ కెవి రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘మాయాబజార్’ చిత్రంలో దుర్యోధనుడి

కుమారుడైన లక్ష్మణకుమారుడి పాత్రలో రేలంగి నటించారు. ఆయన్ని పెళ్ళికి ఒప్పించటం కోసం ఆయన దగ్గర

ఉండే శాస్త్రి, శర్మ అనే పండిత విదూషకులు పురుషులు పెళ్లి చేసుకోవటానికి అర్హురాలైన సలక్షణమైన స్త్రీకి

ఉండాల్సిన లక్షణాలు ఇలా వివరిస్తా రు.

‘అవ్యంగాంగీం సౌమ్య నామ్నీం హంసవారణ గామినీమ్

తనులోమ కేశ దశనాం మృద్వంగీ ముద్వహేత్ స్త్రియం’ ( 3 -10)

చక్కని రూపం( ఎటువంటి వంపు, టొంపులు లేని తిన్నని శరీరం), (తేలికగా పలకగలిగే) చక్కని పేరూ,

(హంస,ఏనుగులాగా ఠీవిగా ఉండే) చకచక్కని నడక, చర్మం మీద సూక్ష్మ రోమాలు, చక్కని శిరోజాలు, పలువరస

మనుస్మృతి - మంచీ చెడూ : 4


కలిగి, మృదువైన శరీరాంగాలు కలిగిన స్త్రీని వివాహం చేసుకోవాలి - అంటూ ఈ శ్లోకం తాత్పర్యాన్ని ఆ పండితులు

వివరిస్తా రు.

చిన్నప్పటి నుంచి ఆ చిత్రంలో కీ.శే. పింగళి నాగేంద్రరావు పేర్కొన్న ఈ శ్లోక భాగం బాగా విన్నదే అయినా అది ఏ

గ్రంథంలోదో నాకు 2000 సం. వరకూ తెలియదు.

సంస్కృతంలో కుల్లూక భట్టు వ్యాఖ్యతో సహా కీ.శే. సరస్వతి వేంకట సుబ్బరామశాస్త్రి చేసిన తెలుగు వ్యాఖ్యాన

గ్రంథం 1928 లో వావిళ్ళ వారు ప్రచురించగా దానికి బాలసరస్వతి బుక్ డిపో వారు చేసిన పునర్ముద్రణ ప్రతిని

నేను 2000 లో కొనుక్కున్నాను. మరింత లోతైన అధ్యయనం కోసం మోతీలాల్ బనార్సిదాస్ పబ్లిషర్స్, ఢిల్లీ వారు

ప్రచురించిన, మాక్స్ ముల్లర్ తదితర పండితులు సంపాదకత్వం వహించిన 50 వాల్యూముల “ The Sacred

Books of the East” సీరీస్ లోని 25 వ వాల్యూం “ THE LAWS OF MANU”- G.Buhler) అనే

ఆంగ్లా నువాదం, ఆర్యసామాజికులు రాసిన కొన్ని వ్యాఖ్యాన గ్రంథాలు మనుస్మృతికి ఒక శాస్త్రీయ వ్యాఖ్య రాసే

కృషిలో నాకు ఉపకరించాయి. ఫిబ్రవరి 2020 లో కోవిడ్ రాకముందు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు

ప్రచురించిన నా ‘మనుస్మృతి - సమగ్ర శాస్త్రీయ వ్యాఖ్య - మొదటి భాగం’ విడుదలైంది. రెండు, మూడు భాగాలు

ఇంకా వెలువడాల్సి ఉంది.

పాడి పశువుల గిట్టలు,కొమ్ములు, చర్మం మీది సుడులు, తోక వెంట్రు కలు, పొదుగు మొదలైన వాటిని పరిశీలించి

మన ప్రాచీనులు వాటి ఆరోగ్యం, పాడి స్థా యి వంటి వాటిమీద కచ్చితమైన అంచనా వేసేవారు. అలాగే

ఆరోగ్యవంతులైన స్త్రీ పురుషులకు ఉండాల్సిన శారీరక లక్షణాలు ‘ మనుస్మృతి’లో చక్కగా వివరించబడ్డా యి. అవి

ఏ గ్రంథంలో ఉన్నాయో మనకి తెలియకున్నా మనం వాటిని నేటికీ అనుసరిస్తు న్నాం.

మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యులు కీ.శే. యడ్లపాటి వెంకట్రావు గారు 101 వ సంవత్సరంలో ప్రవేశించిన

సందర్భంగా నేను ఆయన్ని సుమారు మూడుగంటల పాటు చేసిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ మనుస్మృతి యొక్క

విస్తృతికి మరో ఉదాహరణ. మనుస్మృతి ఏనాడూ చదవకుండానే దానిలో మనువు చక్కని జ్ఞాపకశక్తి కోసం

విద్యార్థు లు సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అధ్యయనం చేయాలనీ, సూర్యస్నానం ( Sun

Bath - రోజూ కాసేపు ఎండలో ఉండటం) ఆరోగ్యాన్నిస్తుందనీ, నగ్నంగా ఎప్పుడూ స్నానం చేయరాదనీ - సచేల

స్నానమే అదీ గోరువెచ్చని నీటితోనే చేయాలనీ, గోరువెచ్చని ఆహారాలు తీసుకోవాలనీ, రాత్రివేళల్లో పాల అన్నమే

మనుస్మృతి - మంచీ చెడూ : 5


తినాలనీ, పెరుగన్నం మంచిదికాదనీ, పాలు ఆయుష్షును పెంచితే, నెయ్యి బుద్ధిని పెంచుతుందనీ, శ్లేష్మ పిత్తా లను

తగ్గించటంలో తేనె ప్రశస్తమైనదనీ, ఆరోగ్యం కోసం రోజూ ఒక ఉసిరిపండు తినాలనీ, భోజనానికి ముందు శొంఠీ -

ఉప్పు కలిపి తినాలనీ, రాత్రి రాగి పాత్రలో నిలవచేసిన నీటిని ఉదయాన్నే తాగటం శరీరారోగ్యానికి ఎంతో మంచిదనీ

మనువు తదితరులు చెప్పిన ఎన్నెన్నో మంచి విషయాలు మనుస్మృతి చదవకున్నా పెద్దలు చెప్పగా విని, వారి

మాటలు శ్రద్ధగా పాటించి, 103 సంవత్సరాలు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించారా పెద్దా యన.

సూర్యరశ్మిలో రోజూ కాసేపు ఉంటే శరీరానికి డి - విటమిన్ తగినంతగా లభించటమే కాక మెదడులో ఉత్పత్తి

అయ్యే సెరొటోనిన్ (Serotonin) అనే హార్మోన్ రక్తపోటును అదుపులో ఉంచుతుందని ఆధునిక వైద్య శాస్త్రజ్ఞుల

నిర్ధా రణ.

మనుస్మృతిలో ‘నేక్షేతోద్యంతమాదిత్యమ్’ అనే శ్లోకం( 4-37) ఉదయిస్తు న్న, అస్తమిస్తు న్న సూర్యుడినిగానీ, గ్రహణ

కాలంలో సూర్యుడినిగానీ చూడవద్దని హెచ్చరిస్తుంది. అలా చూస్తే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని

భావించే గత అనుభవాల రీత్యా మనువు అలా పేర్కొనివుంటాడు. ఆధునికులు సైతం సోలార్ ఎక్లిప్స్ గ్లా సెస్, ఫిల్టర్లు

కలిగిన టెలిస్కోప్ ల సాయంతోనే గ్రహణ సూర్యుడిని చూడటం అందుకే.

‘రాత్రౌ చ వృక్ష మూలాని దూరతః పరివర్జయేత్ ‘ (4 -73) - రాత్రి వేళల్లో వృక్షాల మొదళ్ళ వద్ద పడుకోవద్దంటాడు

మనువు. పగలంతా సూర్యరశ్మి లభిస్తుంది కనుక కిరణజన్య సంయోగ క్రియ ( Photosynthesis) ద్వారా

వృక్షాలు తమకు అవసరమైన పిండి పదార్థా న్ని తయారు చేసుకుంటాయి. ఆ ప్రక్రియలో భాగంగా అవి మనం

శ్వాసక్రియలో వదిలే కార్బన్ డయాక్సైడ్ (బొగ్గుపులుసు వాయువు- CO2 ) ని స్వీకరించి జంతుజాలంతో పాటు

మానవ మనుగడకు అత్యంత ఆవశ్యకమైన ప్రాణవాయువు (ఆక్సిజన్ )ను ఇస్తా యి. పగలూ రాత్రీ వృక్షాలు

జంతువులలాగే శ్వాస క్రియ చేస్తూనే ఉంటాయి. అంటే మనలాగే ప్రాణవాయువు స్వీకరించి బొగ్గుపులుసు

వాయువును విడిచి పెడతాయి. అందుకే పెద్ద వృక్షాల కింద రాత్రివేళలలో పడుకుంటే మనకు అత్యవసరమైన

ప్రాణవాయువును అవి ఎక్కువగా స్వీకరించే కారణంగా మనకు తగినంత ప్రాణవాయువు లభించక మనం

ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉంది. అదీకాక రాత్రిళ్ళు పిడుగులతో కూడిన వర్షం కురిస్తే పెద్ద వృక్షాల మొదళ్ళలో

నిదురించేవారు పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువ.

మనుస్మృతి - మంచీ చెడూ : 6


మనుస్మృతిలో ప్రాచీన భారతీయులు పాటించిన షోడశ (16) సంస్కారాల గురించి చాలా వివరాలున్నాయి.

వాటిలో ఉపయుక్తమైన కొన్నింటిని పేర్కొంటాను. సీమంతోన్నయనము (సీమంతం) సందర్భంగా లక్ష్మణ,

సహదేవి, దర్భ, వట శుంగం (లేత మర్రి చిగుళ్ళు) వంటి వాటి రసాన్ని గర్భిణికి ఇస్తా రు. ఈ మూలికలలోని

ఔషధవిలువలు గర్భిణికి గర్భపాతం జరగకుండా నిరోధిస్తా యి. సీమంతంలో భాగంగా ఆమెకు భర్త స్వయంగా

చేయించే ఫలస్నానం, ఆ సమయంలో ఆమెకు భర్త చేసే సేవల కారణంగా గర్భిణికి మానసికోల్లా సం, ఆత్మ

విశ్వాసం కలిగి సుఖప్రసవానికి దారితీస్తుంది.

జాతకర్మ అనే సంస్కారం సందర్భంగా బంగారు ఉంగరాన్ని అరగదీసి, తేనెతో రంగరించి నవజాత శిశువు ( Neo-

natal Baby) నాలుక మీద రాస్తా రు. బంగారానికీ, తేనెకూ ఉన్న ఔషధ విలువల కారణంగా నవజాత శిశువు

శరీరంలో పుట్టు కతో ఉండే కఫము, మలము పరిహరించబడతాయి.

నవజాత శిశువుకు నాల్గవ నెల తరువాతనే సూర్యదర్శనం చేయిస్తా రు. అప్పటివరకూ ఇంటిలోని సూతికా గృహం

(Labour Room) దాటి శిశువును బయటకు తీసుకురారు. పుట్టిన నాలుగు నెలల తరువాతనే శిశువును

బయటికి తెచ్చే మనువు చెప్పిన ఈ సంస్కారాన్ని, గృహనిష్క్రమణం అని కూడా అంటారు. ఇది కూడా

ప్రయోజనకరమైన శాస్త్రీయ ప్రక్రియే. నవజాత శిశువుకు సూర్యరశ్మి సోకి ప్రభావితం అయితే ఒక్కోసారి శిశువులకు

చర్మపు క్యాన్సర్ ( Paediatric melanoma) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని ఆధునిక వైద్య శాస్త్రజ్ఞులు కూడా

అభిప్రాయపడుతున్నారు.ఇలాంటివే పలు ఇతర ఉపయుక్తాంశాలు ఉన్నా సమయాభావం కారణంగా వాటన్నిటినీ

ఇక్కడ ప్రస్తా వించలేకున్నాను.

‘పురాణమిత్యేవ న సాధు సర్వమ్’ అని మహాకవి కాళిదాసు చెప్పాడని ముందే పేర్కొన్నాను. గతమంతా మంచిదీ,

స్వీకరించదగిందీ కాదని దాని అర్థం. అలాగని గతకాలపు మంచి విషయాలను మనం వదిలిపెట్టలేము. నేటి

సమాజానికి ఉపయుక్తమైన మంచిని, నేటికీ సత్యాలైన శాస్త్రీయ విషయాలను ఎలా వదిలి పెడతాం ?

అందుకే మనుస్మృతిలో ఈనాటి సమాజానికి ఎంతమాత్రం పనికిరాని, నేటి సమాజానికి హానికరమైన విషయాలను

మాత్రం వదిలేసి నేటి సమాజానికి కూడా ఉపయుక్తమైన మంచి విషయాలు మాత్రమే మనం గ్రహిద్దాం.

ఇప్పుడిక మనుస్మృతిలోని నేటి సమాజానికి పనికిరాని, హానికరమైన అంశాల గురించి వివరిస్తా ను.

మనుస్మృతి - మంచీ చెడూ : 7


చెడు

ఇప్పటిదాకా మనుస్మృతి లోని కొన్ని ఉపయుక్తమైన అంశాల గురించి చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు ఆ గ్రంథంలోని

అసంగతమైన, అశాస్త్రీయమైన, అర్థరహితమైన విషయాలతోపాటు కొన్ని సామాజిక వర్గాలకు ప్రయోజనాలు

చేకూర్చటం కోసం మిగిలిన సమాజానికి ముఖ్యంగా అణగారిన ప్రజలకు ఈ ‘మను ధర్మాలు’ ఎంత ద్రోహం

చేశాయో కూడా చూద్దాం. కుటుంబ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, సమాజంలో తిరుగులేని విధంగా

పురుషాధిక్యతను ప్రతిష్ఠా పించటం కోసం మానవ జాతిలో సగభాగంగా ఉన్న స్త్రీలను ఈ అమానుష ధర్మాలు ఎలా

తొక్కేశాయో కూడా తెలుసుకుందాం. మనుస్మృతిలోని ఈ అవతలి చెడు పార్శ్వాన్ని ఇప్పుడు వివరిస్తా ను.

అసంగతాలు - అశాస్త్రీయాలు

తన స్మృతిలోని మొదటి అధ్యాయం 32 వ శ్లోకంలో మనువు ” బ్రహ్మ తన దేహాన్ని రెండుగా విభజించుకుని ఒక

భాగం పురుషునిగానూ, రెండవభాగం స్త్రీగానూ రూపొందాడు ( ద్విధా కృత్వాత్మనో దేహమ్ అర్ధేన పురుషః అర్ధేన

నారీ ) అని చెప్పి, ఆ పురుషుడు ఆ స్త్రీయందు విరాట్ ను సృష్టించాడని వివరించాడు. అంటే విరాట్ పురుషుడో,

లేక మరో సాధారణ పురుషుడో లేక స్త్రీయో జన్మించడం కోసం స్త్రీపురుష సంయోగం తప్పనిసరన్న పరిజ్ఞానం

మనువుకు అప్పటికి ఉందన్నమాటే కదా ! పురుషుని వీర్యంలోని బీజ కణం (Male Gamete), స్త్రీ అండం (

Female Gamete) తో సంగమించి సూక్ష్మ రూపంలో జైగోట్ (Zygote) ఏర్పడి, అదే తల్లి గర్భాశయంలో

కణవిభజన ద్వారా వృద్ధి చెందుతూ సుమారు పది నెలలపాటు క్రమంగా పిండంగా పరిణామం చెంది శిశు

జననం సంభవిస్తుందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం నిర్ధా రణ. మానవ జాతిలో శిశు జననానికి పట్టే ఈ కాలావధి (

Gestation Period) సుమారు పదినెలలు కాగా వివిధ జంతు జాతులలో ఈ కాలావధి వేర్వేరుగా ఉంటుంది.

ఉదాహరణకు ఒక ఆడ ఏనుగు గర్భస్థమైన పిండాన్ని 22 నెలలపాటు మోసి, గున్న ఏనుగును కంటుంది. మానవ

జాతి సహా అన్ని జాతులలోనూ పిండం అభివృద్ధి చెందడానికి ఈ కాలావధి తప్పనిసరి. మన పురాణ గాథలలో

లాగా స్త్రీపురుష సంగమం తరువాత అప్పటికప్పుడు సద్యోగర్భాన శిశువు జన్మించడం అసాధ్యం.

బ్రాహ్మణాధిపత్య సిద్ధాంత ఖండన

మనుస్మృతి - మంచీ చెడూ : 8


ఇక ఆ సంగతి అలా ఉంచితే – మనువు ఈ స్మృతిలోని మొదటి అధ్యాయం 31 వ శ్లోకంలో ప్రకృతి విరుద్ధమైన

మరో విషయం పేర్కొన్నాడు. అదేమిటంటే బ్రహ్మ ఈ భూలోక వివృద్ధి కోసం తన ఉత్తమాంగమైన శిరస్సులోని

ముఖము (నోరు) నుంచి బ్రాహ్మణులను,బాహువులనుంచి క్షత్రియులను,ఊరువుల (తొడల) నుంచి

వైశ్యులను,పాదముల నుంచి శూద్రు లను సృష్టించాడట. (‘లోకానాం తు వివృద్ధ్యర్థం ముఖబాహూరు పాదతః

బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రం చ నివర్తయత్’ 1-31). అసహజమైన ఇలాంటి పుట్టు కను మనం మరి

ప్రశ్నించకుండా ఎలా ఉంటాం ?

పుట్టింది మనుష్యులయితే వారు అందరు మనుష్యులలాగే పుట్టా లి కదా ? విరాట్ పుట్టినట్లే తన తల్లిదండ్రు ల

కలయిక కారణంగా తండ్రి కి తల్లి గర్భాన జన్మించాలి.

( 1- 32). అంతేగానీ ఇలా నోట్లోంచి, చేతుల్లోంచీ, తొడల్లోంచీ, పాదాలలోంచీ మనుష్యులెవరూ పుట్టు కురారు.

మరో విషయం. పుట్టు కరీత్యానే బ్రాహ్మణులు మిగిలిన అందరి కంటే ఉత్తములని చెప్పటం కోసమే ఇలా ప్రకృతి

విరుద్ధంగా బ్రహ్మ యొక్క ఉత్తమాంగమైన నోటినుంచి బ్రాహ్మణులు జన్మించారనే సిద్ధాంతం మనువు

కల్పించాడనేది మనకు అర్థమౌతూనే ఉంది. ఆ తరువాత 39 వ శ్లోకంలో మరీచి మొదలైన పదిమంది

ప్రజాపతులు కిన్నరలు, వానరులు, మత్స్యములు, పక్షులు, పశువులు, మృగాలు ( లేళ్ళు) మొదలైన వాటితో పాటు

మనుష్యులను సృష్టించారని పేర్కొన్నాడు మనువు. ఇంతకీ మనుష్యులను బ్రహ్మ సృష్టించాడా ? లేక ప్రజాపతులా ?

మరి బ్రహ్మ సృష్టించిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలవారు మనుష్యులు కారా ? వారు మనుష్యులే

కానప్పుడు వారికోసం తాను రూపొందించిన ధర్మసూత్రాలు, నియమాలు మనుష్యులకెలా వర్తిస్తా యంటూ మనం

మనువును నిలదీయాలి.

మనం విష్ణువును పద్మనాభుడు అంటాం. విష్ణువు నాభి (బొడ్డు ) లోని ఆ పద్మం నుంచే బ్రహ్మ పుట్టా డని మన

పూర్వుల నమ్మకం. తమ్మి అంటే పద్మం ( తామర) అని అర్థం. అందుకే విష్ణువు బొడ్డు లోని తెల్ల తామర నుంచి

పుట్టిన బ్రహ్మను ‘తమ్మి చూలి’ అనికూడా అంటారు. మన కావ్యాలలో బ్రాహ్మణులను ‘తమ్ముల చుట్టంబగు

వేల్పు వంగడమున’ పుట్టినవారంటారు. వారంతా తామరలకు చుట్టమైన వేల్పు అంటే బ్రహ్మ వంగడం (వంశం)లో

పుట్టినవారట !! ఇక్కడ నేను మనువుకు మరికొన్ని ప్రశ్నలు కూడా వేయదలచాను.

మనుస్మృతి - మంచీ చెడూ : 9


“ అయ్యా ! మనువు గారూ ! మీరు (1-31) శ్లోకంలో చెప్పినట్లు మనుష్యులను తన శరీరాంగాల నుంచి బ్రహ్మ

సృష్టించాడా ? లేక తద్విరుద్ధంగా (1-39) శ్లోకంలో మీరే చెప్పినట్లు ప్రజాపతులు సృష్టించారా ? అది ముందు

తేల్చండి. మరో ప్రశ్న. మీరు బ్రాహ్మణులను పుట్టు క రీత్యానే మిగిలిన వర్ణాల వారికంటే ఉత్తములుగా

నిలబెట్టటంకోసం వారు బ్రహ్మ ఉత్తమాంగమైన శిరస్సులోని నోటి నుంచి పుట్టా రనే అసహజమైన సిద్ధాంతం

ముందుకు తెచ్చారు. బ్రాహ్మణుడు వేదాలను ధరించినవాడూ, అందరికీ ధర్మోపదేశం చేయడానికి

హక్కున్నవాడూ కనుక బ్రాహ్మణుడు మిగిలిన వర్ణాల వారందరికీ ప్రభువనీ కూడా పేర్కొన్నారు. అయితే ముందు

ఒక్క విషయం స్పష్టం చేయండి. బ్రాహ్మణులు మీరు చెప్పినట్లు అసహజంగా బ్రహ్మ నోటి నుంచి పుట్టా రా ? లేక

పురాణాలు చెపుతున్నట్లు వారు విష్ణువు బొడ్డు లోని తెల్ల తామర నుంచి అసహజంగా పుట్టిన బ్రహ్మ యొక్క ఔరస

సంతానమా ? ఏ రకంగా చూసినా వారి జననం అసహజం, అశాస్త్రీయం కనుక బ్రాహ్మణుల జననం మిగిలిన

వర్ణాలవారి జననం కంటే భిన్నమైనదీ, ఉత్తమమైనదీ అనటానికి వీలే లేదు. కనుక అందరు మానవులలాగే వారు

కూడా మీరు ఈ స్మృతి మొదటి అధ్యాయం 32 వ శ్లోకంలో చెప్పిన విరాట్ పుట్టినట్లే తమ తండ్రికి తల్లి గర్భంలో

జన్మించినవారేనని మాకు అర్థమైందని మీరు గ్రహించాలి.”

శూద్ర కులాల వారికి, నిమ్న వర్ణాల వారికి మనువు చేసిన అన్యాయం గురించి అందరికీ తెలిసిందే. బ్రాహ్మణులను

ఎవరికీ అందనంత ఎత్తు న కూర్చోబెట్టటం కోసమే అసహజమైన, అశాస్త్రీయమైన ఈ చాతుర్వర్ణ ప్రజనన సిద్ధాంతం

సృష్టించారు.

షట్కర్మలు బ్రాహ్మణుల అధికారాలట

అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహం అనే ఆరింటినీ షట్కర్మలు అంటారు. వేద

శాస్త్రములు అధ్యయనం చేయటం - అంటే తాము చదువుకోవటం, అధ్యాపనం - అంటే ఇతరులకు బోధించటం,

యజనము అంటే తాను యజ్ఞం చేయటం, యాజనము - అంటే ఇతరుల చేత యజ్ఞములు చేయించటం, దానం

- తాను ఇతరులకు దానం చేయటం, ప్రతిగ్రహం - అంటే ఇతరులు చేసే దానాలు స్వీకరించటం - ఈ ఆరూ

బ్రాహ్మణుల విశేషాధికారాలు. (1- 88)

‘ప్రజానాం రక్షణం దానమిజ్యాధ్యయనం’ అంటే ప్రజలను రక్షించటం, దానాలు ఇవ్వటం, ఇజ్యా అంటే యజ్ఞాలు

చేయటం, వేదశాస్త్రా లు అధ్యయనం చేయటం ఇవన్నీ క్షత్రియుల విధులు. (1- 89)

మనుస్మృతి - మంచీ చెడూ : 10


పశూనాం రక్షణం ( గోవులు మొదలైన పశువులను రక్షించి, పోషించటం), దానము చేయటం, ఇజ్యా (యజ్ఞం

చేయటం), వేదాధ్యయనం (వేదశాస్త్రా లు చదవటం), వణిక్పథము ( భూ, జల మార్గాలలో వ్యాపారం చేయటం),

కుసీదం (వడ్డీ వ్యాపారం), కృషి (వ్యవసాయం) - ఇవన్నీ వైశ్యుల కర్తవ్యాలు. (1- 90)

ఇలా క్షత్రియులు, వైశ్యులకు అధ్యయనం చేయటాన్ని( చదువుకోవటాన్ని) ఒక విధిగా నిర్ణయించి, అధ్యాపనను (

చదువు చెప్పటాన్ని) మాత్రం బ్రాహ్మణులకే విశేషాధికారంగా

నిర్ణయించిన మనువు, యాజనము ( యజ్ఞాలు చేయించటం), దానాలు స్వీకరించటం అనే విశేషాధికారాలు

కూడా బ్రాహ్మణులకే కట్టబెట్టి వారి ఆర్థికాభ్యున్నతికి చక్కటి అవకాశం కల్పించాడు. అంతేవాసులు ( విద్యార్థు లు)

గురువులకు ఇచ్చే గురుదక్షిణలు, యజ్ఞాలు చేయించుకునే గృహస్థు లు ఇచ్చే సంభావనలు, రాజులతో సహా అన్ని

వర్గాల ప్రజలు చేసే భూదాన, గోదాన, సువర్ణ దానాల కారణంగా బ్రాహ్మణులు అనతికాలంలోనే ఆర్థికంగా,

సామాజికంగా బలీయమైన సంపన్న వర్గంగా ఎదిగారు. అధ్యాపనము, యాజనము, దానము కేవలం బ్రాహ్మణ

వర్ణానికి మాత్రమే కట్టబెట్టిన విశేషాధికారాలే తప్ప అవి వారు తప్పనిసరిగా నిర్వర్తించాల్సినట్టి విధులు కావు. ఆ

కారణంగా వారు తప్పనిసరిగా చదువు చెప్పాలనో, దానం చేయాలనో, యజ్ఞం చేయించాలనో నియమమేమీ లేదు.

వారు తమ అవసరాలు, ఇష్టా యిష్టా లను బట్టి ప్రవర్తించే వీలుంది. బ్రాహ్మణ పక్షపాతంతో మనువు రూపొందించిన

ఈ సానుకూల నియమావళి కారణంగా చదువు చెప్పినా, యజ్ఞం చేయించినా, దానం స్వీకరించినా బ్రాహ్మణులే

తప్ప వేరెవ్వరికీ ఆ అధికారం లేకుండా చేయడంతో అనతికాలంలోనే సమాజం మీద బ్రాహ్మణాధిపత్యానికి

తిరుగులేకుండా పోయింది.

ద్విజుడు అంటే రెండు జన్మలు కలవాడు అని అర్థం. ఉపనయనం ద్వారా యజ్ఞోపవీతం ధరించి రెండవ జన్మ

ఎత్తినవాడు కనుక ద్విజుడు. నాలుగు వర్ణాలలోని మొదటి మూడు వర్ణాలవారినీ అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు,

వైశ్యులను ద్విజులని భావిస్తా రు.ద్విజ సూచకమైన యజ్ఞోపవీతము ( జందెము- the insignia of the

Twiceborn) ధరించటానికి వారు అర్హులు. యజ్ఞం సందర్భంగా ఉపవీతంగా ధరించేది కనుక జందెమును

యజ్ఞోపవీతము అంటారు.పై మూడు వర్ణాలవారు మాత్రమే యజ్ఞం చేసేందుకు అర్హులు. శూద్రు లకు యజ్ఞార్హత

లేదు. బ్రాహ్మణుడు పత్తి నూలుతో తయారైన తొమ్మిది పోగుల జందెం ధరించాలి. క్షత్రియులు జనపనారతో,

వైశ్యులు తెల్ల మేక బొచ్చుతో పేనిన తొమ్మిది పోగుల జందాన్ని ధరిస్తా రు.

మనుస్మృతి - మంచీ చెడూ : 11


మనువు తన స్మృతిలో బ్రాహ్మణ పక్షపాతిగా వారికి ప్రాథమ్యం ఇచ్చి ఎన్నో వెసులుబాట్లు కల్పించాడు. బుద్ధి

పూర్వకంగా బ్రాహ్మణుడిని కొట్టే ఉద్దేశంతో మరో బ్రాహ్మణుడే కర్ర ఎత్తినా అతడు నూరేళ్ళ పాటు తామిస్రం అనే

చిమ్మ చీకటి నరకంలో పొర్లా డతాడు.(4- 165) ఎవరైనా వ్యక్తి ఒక బ్రాహ్మణుడిని కోపంతో బుద్ధిపూర్వకంగా గడ్డి

పరకతో కొట్టినా 20 జన్మలపాటు అతడు కుక్క వంటి నీచజన్మలు ఎత్తు తాడు. ( 4- 166). ఇలాంటివే పాపం,

పుణ్యం, స్వర్గం, నరకం, పునర్జన్మ మొదలైన అశాస్త్రీయమైన విశ్వాసాల మీద ఆధారపడిన ఎన్నెన్నో నియమాలు

బ్రాహ్మణుడిని సమాజానికి ప్రభువును చేసే ఉద్దేశంతో కల్పించాడు మనువు. అందుకే వాటన్నిటినీ నేనిక్కడ

ప్రస్తా వించను. అయితే ‘ విభజించి పాలించు’ అన్న సూత్రాన్ని పాటించి క్షత్రియ, వైశ్యులకు కూడా మనువు కొన్ని

వెసులుబాట్లు కల్పించాడు. వారికి కూడా అధ్యాపనార్హత కలిగించాడు. ఒక శిష్యుడు ఆపత్కాలంలో క్షత్రియ, వైశ్య

గురువుల వద్ద కూడా వేద శాస్త్రా లు నేర్చుకోవచ్చు. ఆ గురువుకు శుశ్రూషలు చేయవచ్చు. బ్రాహ్మణ గురువుకు

చేసినట్లే ‘అనువ్రజ్యా’ అంటే సాగనంపేటప్పుడు కొంత దూరం శిష్యుడు కూడా గురువును అనుసరించి వెళ్ళటం

చేయవచ్చు. అయితే బ్రాహ్మణ గురువుకు చేసినట్లు పాద ప్రక్షాళన ( కాళ్ళు కడగటం), ఉచ్చిష్ట భోజనం ( గురువు

తిని వదిలేసిన అన్నం తినటం) మాత్రం శుశ్రూషలో ఈ ఆపత్కాల గురువు విషయంలో శిష్యుడు చేయరాదు.(2-
241)

వైశ్యుడి నౌక మునిగిపోయినా, ప్రకృతి వైపరీత్యం కారణంగా అతడికి వ్యాపారంలో నష్టం వచ్చినా ఇతరులకు

అతడు చెల్లించాల్సిన బాకీల విషయమై ఒత్తిడి చేయకూడదనీ మనువు నిర్దేశించాడు.

ఇలాంటివే ఇంకా చాలా ఉన్నాయి. క్షత్రియులకూ, వైశ్యులకూ తెలివిగా ఎన్నో వెసులుబాట్లు కల్పించి ఒక పథకం

ప్రకారం ఆ యా వర్ణాల వారిని దువ్విన మనువు శూద్రు ల పట్ల మాత్రం కాస్తైనా కనికరం చూపలేదు.

పై మూడు వర్ణాల వారికీ - అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు - గుణనింద చేయకుండా సేవలు చేయటం

శూద్రు ల ఒకే ఒక్క విధిగా బ్రహ్మ నిర్ణయించాడు

- (1 -91). దాస్యమే శూద్రు డి విధి.

దీనినే ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి కాస్త కూడా జాలిలేని చర్య అంటూ స్మృతి కర్త మనువును విమర్శిస్తూ, ‘

శూద్రు లకు కేవలం పై మూడు వర్ణాల వారికి సేవచేయడం మాత్రమే విధిగా నిర్ణయిస్తూ ఈ దుర్మార్గపు స్మృతిని

ఎలా రాశావు ?’ అంటూ ఓ పద్యంలో ఇలా ప్రశ్నిస్తా రు.

మనుస్మృతి - మంచీ చెడూ : 12


ఒక్కటి యడిగెద జెప్పుమ

‘యెక్కటి ‘ శూద్రంతు కారయేద్దా స్య’ మటం

చెక్కరణిన్ స్మృతి వ్రాసితి

వక్కటికము నీకు సుంతయైనను గలదే ?

పునర్జన్మ, పాపపుణ్యాల సిద్ధాంతాన్ని మనువు శూద్రు లను మరింతగా దాస్యంలో ముంచడానికి ఉపయోగించాడు.

శౌచం పాటిస్తూ, మృదువైన మాటలతో, అహంకారం లేకుండా ద్విజులను సేవించే శూద్రు డికి తదుపరి జన్మలో

ఉత్తమ వర్ణం లభిస్తుందని ప్రలోభపెట్టా డు. ( 9 - 335)

అయితే పాప పుణ్యాలు, స్వర్గ నరకాలు, పునర్జన్మల సిద్ధాంతాలు శాస్త్ర పరీక్షకు నిలిచేవి కావు. అవి ఎవరూ

రుజువుపరచగలిగేవీ కావు. అవి కేవలం నమ్మకాలు మాత్రమే.

బౌద్ధ, జైన ధర్మాల ప్రచారం కారణంగా హింసాత్మకమైన శ్రౌత యజ్ఞాల స్థా నంలో జంతు హింస లేని జపయజ్ఞాలను

ప్రజలు ఆదరిస్తు న్న రోజులలో మనుస్మృతి సంకలనం చేయబడినట్లు ఆ గ్రంథంలోని కొన్ని ఆధారాలనుబట్టి

గ్రహించగలం. కొంత మేరకు జాగృతమైన ఆనాటి సమాజంలో అప్పటివరకూ ఉన్న కొన్ని అంధ విశ్వాసాలు

కాలదోషం పట్టిపోయాయి. జ్యోతిషము, హస్త సాముద్రికము పచ్చి మోసాలని మనువే తీవ్రంగా తిట్టిపోశాడు.

ధనప్రాప్తి, సంతానం కలుగుతుందని చెప్పి, జోస్యం మీద భ్రమలు కల్పించి సొమ్ము తీసుకుని మోసం చేసే

జోస్యులు, ‘ ఫలానా శుభ ముహూర్తంలో ఫలానా పని చేస్తే మీకు శుభం జరుగుతుంది’ అంటూ అబద్ధా లు చెప్పి

ధనం గుంజే మౌహూర్తికులు, చేతిలోని రేఖలు, హస్త పాదాలలోని సుడులు, ఒంటి మీది పుట్టు మచ్చలు చూసి

మేలు కీళ్ళను చెప్పి డబ్బు కోసం వంచించే హస్త సాముద్రికులు

మొదలైనవారిని ప్రకాశ వంచకులు ( పట్టపగలే ప్రజలను మోసం చేసేవారు) అంటూ మనువు తీవ్రంగా

తిట్టిపోయటం గొప్ప విశేషం. అయితే నాటి పాలక వర్గపు పురుషాధిక్య సమాజం ప్రతినిధిగా ఋగ్వేదంలోని

పురుషసూక్తంలో చెప్పబడిన దానికి అనుగుణంగా వర్ణ వ్యవస్థను నాటి సామాజిక అవసరాలకు తగినట్లు గా

మరింత అమానవీయంగా మలచి, స్త్రీలనూ, శూద్రు లనూ మరింత దాస్యంలో ముంచాడు మనువు.

అంతకుముందరి సమాజంలో బ్రహ్మజ్ఞానం సముపార్జించిన వారందరూ- వారు ఏ వర్ణానికి చెందినవారైనా, స్త్రీలై నా

మనుస్మృతి - మంచీ చెడూ : 13


బ్రాహ్మణులుగానే గౌరవించబడేవారు. పుట్టు కతో అందరూ శూద్రు లేననీ, జన్మ బ్రాహ్మణ్యం అంటూ ఏదీ లేదనీ,

బ్రహ్మజ్ఞానం కలిగినవారు మాత్రమే బ్రాహ్మణులనే భావన ఉండేది. గత కాలపు సమాజాలలో గార్గి, మైత్రేయి,

లోపాముద్ర వంటి విదుషీమణులు, వాల్మీకి, వ్యాసుడు, ధర్మవ్యాధుడు, కపిల ముని వంటి నిమ్న వర్గాలకు చెందిన

ప్రసిద్ధ పండితులు ఎందఱో ఉండగా ఈ దుర్మార్గమైన స్మృతి ప్రభావం కారణంగా అనంతరకాలంలో కొన్ని

శతాబ్దా లపాటు సమాజంలో శూద్రు లనూ, స్త్రీలనూ విద్యలకు దూరం చేయటం గొప్ప విషాదం. బ్రిటిష్ పార్లమెంట్

1813 చార్టర్ యాక్ట్ అమలులోకి తెచ్చేవరకు భారతదేశంలోని స్త్రీలు, శూద్ర కులాల వారంతా దాదాపు విద్యకు

దూరంగానే ఉన్నారు.

ఇక స్త్రీలకు మనువు చేసిన అన్యాయం గురించి ఎంత చెప్పినా తీరదు. కొన్ని ముఖ్యాంశాలు మాత్రం వివరిస్తా ను.

స్త్రీకి మనువు చేసిన అన్యాయం

ప్రాచీన భారతీయ సమాజం స్త్రీలకు ఎంతో గౌరవం ఇచ్చిందనీ, ఆనాటి స్త్రీలలో ఎందఱో విదుషీమణులు ఉండేవారనీ
సంప్రదాయవాదులు ఎన్నెన్నో గొప్పలు చెప్పుకుంటూ గార్గి, మైత్రేయి, లోపాముద్ర వంటి విదుషీమణుల పేర్లు
ఉదాహరిస్తా రు.
అయితే వారంతా వేద కాలంనాటి సమాజానికి సంబంధించినవారు. గత కాలంలో స్త్రీలు అనుభవించిన స్వేచ్చనూ,
స్వాతంత్ర్యాన్ని ‘మనుస్మృతి’ లోని నియమనిబంధనలు హరించివేశాయి.
యజుర్వేదంలోని ‘వాజసనేయ సంహిత’ లో ఇలా ఉంది.
యథేమాం వాచం కల్యాణీమ్
ఆవదాని జనేభ్యః
బ్రహ్మరాజన్యాభ్యాం
శూద్రాయచార్యాయ చ
స్వాయ చారణాయ చ (య.వే.వా.సం. 26 -2 )
వేదవిద్యలు సమాజంలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ( అప్పట్లో వైశ్యులను ఆర్య అనే శబ్దంతో వ్యవహరించేవారట),
శూద్రు లతో కలుపుకుని, స్త్రీలతో సహా స్వజనులందరికీ, ఇంకా బయటినుంచి వచ్చిన చారణుల (నానాదేశ
సంచారుల) కు కూడా అందుబాటులో ఉండేవి.
వేదవిద్యలు గరపటంలో లింగ, వర్ణభేదాల పాటింపు లేని కారణంగానే నాటి సమాజంలో ఎందఱో విదుషీమణులు,
శూద్ర వర్ణం నుంచీ, బానిసల నుంచీ కూడా ఎందఱో పండితులు, ఋషులు రూపొందారు. సంస్కృతంలో
ఆదికావ్యం ' రామాయణమ్' ను రచించిన వాల్మీకి వేటాడడమే వృత్తిగా జీవించే బోయ కులస్థు డు. సకల ధర్మశాస్త్ర
మర్మాలనూ క్షుణ్ణంగా ఎరిగినవాడని పేరొందిన ధర్మవ్యాధుడు సైతం బోయ కులస్థు డే. పదిమంది
ప్రజాపతుల( Patriarchs or Progenitors) లో ఒకనిగా పేరొందిన కర్దమ ప్రజాపతి మాంస విక్రయం చేస్తూ
జీవించిన నిమ్న కులస్థు డు. ' సిద్ధా నాం కపిలో మునిః' అంటూ 'భగవద్గీత' విభూతి యోగం (10-26) లో 'సిద్ధు లలో
శ్రేష్ఠు ని'గా శ్రీకృష్ణునిచే కీర్తించబడిన కపిలముని కర్దమ ప్రజాపతికి, దేవహూతికీ పుట్టినవాడు. కపిల మహర్షి భారతీయ
షడ్ దర్శనాలలో ఒకటై న సాంఖ్య దర్శన సిద్ధాంత కర్త. వేదాలను విభజించి, అష్టా దశ పురాణాలు,ఉప పురాణాలు
సృష్టించిన వ్యాసుడు పరాశరుడికి, మత్స్యకార వృత్తి చేసుకునే బెస్త కన్య సత్యవతికి జన్మించినవాడు. పరాశరుడు
సప్తర్షులలో ఒకడైన వసిష్ఠు ని మనుమడు. వసిష్ఠు ని భార్య అరుంధతి చర్మకారునిగా, మాంస విక్రేతగా పేరొందిన

మనుస్మృతి - మంచీ చెడూ : 14


నిమ్న కులస్థు డైన కర్దమ ప్రజాపతి కుమార్తె. కపిల మహర్షి సోదరి. అరుంధతి మహా పతివ్రతగానూ, సప్తర్షులతో
సమానమైన కీర్తిగలదిగానూ పేరొందింది. నీతికోవిదునిగానూ, ధర్మాత్మునిగానూ, మహాజ్ఞానిగానూ ప్రఖ్యాతిపొందిన
విదురుడు వ్యాసుడికి, ఒక శూద్ర దాసికీ పుట్టినవాడు. వైదిక సమాజంలో అందరికీ అందుబాటులో ఉన్న విద్య
మనుస్మృతి సంకలన కాలం వరకూ అలాగే కొనసాగింది.
మనువు లక్ష్యం పురుషాధిక్య సమాజాన్ని నెలకొల్పటం. అందుకే ఆయన స్త్రీల ప్రతిభను చిన్నచూపు చూసి, వారి
గొప్పతనాన్ని కూడా పురుషులకే ఎలా కట్టబెట్టా డో చూడండి.
స్త్రీ మంచివాడో లేక చెడ్డవాడో ఎలాంటి గుణాలు కలిగినవాడిని వివాహం చేసుకున్నా భర్త గుణాలే ఆమెకు
అలవడతాయి - నదిలోని తియ్యటి నీరు సముద్రంలో కలిసి ఉప్పునీరుగా మారుతున్నట్లే. (9-22 )
స్త్రీలకు తమకంటూ స్వయంగా ఎలాంటి గొప్పతనమూ ఉండదు. తమ భర్తల గొప్పతనం కారణంగానే వారు కూడా
గొప్పతనం పొందుతారు. వసిష్ఠు డిని వివాహం చేసుకుని అక్షమాల (అరుంధతి) అనే నీచ జాతి స్త్రీ గొప్పది కాలేదా ?
చటక (సారంగి) అనే నిమ్న జాతి స్త్రీ మందపాలుడనే ఋషిని పెండ్లా డి ప్రజల మన్ననను
పొందలేదా ? ( 9- 23)
ఇలా స్త్రీని అబల అని పేర్కొని, ఆమెను పిల్లల్నికనే యంత్రంగానో, విద్యా గంధం లేకుండా ఇంటి పనికే పరిమితమైన
దాసిగానో మార్చేయటం ‘ మనుస్మృతి’ చేసిన గొప్ప నిర్వాకమే.
పురుషులు సత్సంతానమో, పురుష సంతానం కోసమోననే పేరుచెప్పి కాటికి వెళ్ళే వరకు మళ్ళీ మళ్ళీ ఎన్నైనా
వివాహాలు చేసుకోవచ్చు. ఇక భార్య గొడ్రాలు అయినా, లేక ఆమె మరణించినా పునర్వివాహం చేసుకోవటం
పురుషుడి హక్కు. భర్త అసమర్థు డు, అయోగ్యుడు, వ్యాధిగ్రస్థు డు అయినప్పటికీ ఈ జన్మంతా అతడిని సేవిస్తూ
జీవించటం మాత్రమే కాదు. ఇంకా ఏడు జన్మల వరకు అతడే తనకు భర్తగా రావాలని పతివ్రతలు నోములు, వ్రతాలు
చేయాలట. ఇవీ మనువు నాటి పురుషాధిక్యపు సామాజిక నియమాలు. సంతాన సాఫల్యం, శీలం వంటి
విషయాలలో పురుషుడికి ఒక నీతి, స్త్రీకి మరొక నీతి. భర్త లోపాన్ని గుర్తించక తరచు సంతానం కలగకపోవటానికి
స్త్రీనే బలిపశువును చేయటం మనువు ప్రవేశపెట్టిన పురుషాధిక్య భావజాలం కారణంగానే. భార్యకు మాత్రమే శీల
పరీక్షలు భారతీయ సమాజంలో అనాదిగా ఉన్నవే.
భార్య గయ్యాళి అయితే ఆమె అంగీకారంతో ప్రమేయం లేకుండా భర్త ఎప్పుడైనా ఆమెను ‘ గ్రక్కున’
వదిలెయ్యవచ్చు. ఇందుకు ఎలాంటి విచారణ అవసరం లేదు. ఇంకా ముస్లిం సమాజంలోనే నయం. భర్త భార్యకు
విడాకులు ఇచ్చే ముందు తలాక్ .. తలాక్ .. తలాక్ .. అంటూ మూడు సార్లు అదీ కొంత కాలవ్యవధితో అనాలనీ,
పెళ్లి జరిపిన పెద్దలు అవసరమైతే జోక్యం చేసుకోవచ్చనే నియమం ఉంది. అటువంటిది ఏదీ ఇక్కడ మనుస్మృతి లో
లేదు.
ఇక స్త్రీల శీలాన్ని, నడతను మనువు ఎంత తీవ్రంగా విమర్శించాడో చూడండి.
“స్వభావ ఏష నారీణాం నరాణామిహ దూషణమ్ “ ( 2 - 213). స్వభావ రీత్యానే స్త్రీలు పురుషుడిని చెడగొడతారు.
వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి.
అవిద్యావంతుడినైనా, విద్వాంసుడినైనా చివరికి మూఢుడినైనా - స్త్రీలు లోబరచుకుని చెడ్డ దారికి ఈడ్వగలరు. (2-
214)
వయస్సు, అందంతో నిమిత్తం లేకుండా స్త్రీలు తాము కోరుకున్న పురుషుడితో సంగమించి సుఖిస్తా రు.
ముసలివాడా ? యువకుడా ? అందగాడా ? కురూపా ? అన్నదానితో వారికి సంబంధం లేదు. మగవాడైతే చాలు.
(9 -14)
పురుషుడిని చూడగానే స్త్రీలు అతడితో కూడాలని ప్రయత్నిస్తా రు. వ్యభిచారదోషం కారణంగా స్త్రీలు భర్తల పట్ల
అనురాగం చూపరు. స్త్రీలు సహజంగానే హృదయం లేనివారైన కారణంగా ఎంత జాగ్రత వహించి కాపలా కాసినా
నిర్దయగా, నిర్భయంగా భర్తలకు నమ్మకద్రోహం చేస్తా రు. (9 -15 )
బ్రహ్మ సృష్టించిన దగ్గరనుంచీ వీరి స్వభావం ఇదేనని గుర్తించి, పురుషులు స్త్రీలను పూర్తిగా అదుపులో ఉంచాలి. (9 -
16 )
‘ న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి’ అంటే మనువు దృష్టిలో ఏ స్త్రీ స్వాతంత్ర్యానికి అర్హురాలు కాదు. చూడండి మనువు
ఏమంటున్నాడో -

మనుస్మృతి - మంచీ చెడూ : 15


పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే |
రక్షంతి స్థా విరే పుత్రా న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి || ( 9- 3)
బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధా ప్యంలో పుత్రు లు స్త్రీలను పూర్తిగా కనిపెట్టి ఉండి అదుపులో ఉంచాలి. ఏ
స్త్రీ స్వతంత్ర జీవనానికి అర్హురాలు కాదు.
ఇంకా మనువు స్త్రీలను ఎలా తీవ్రంగా నిందించాడో చూడండి.
శయ్యాసనమలంకారం కామంక్రోధమనార్జవమ్ |
ద్రోహభావం కుచర్యాం చ స్త్రీభ్యో మనురకల్పయత్ || ( 9 -17)
శయ్య (పడక), ఆసనము ( పీఠము), భూషణములు, కామక్రోధాలు, అనార్జవము (కపటం), ద్రోహభావం, కుచర్య (
చెడు నడత) - వీటన్నిటినీ మనువు స్త్రీలను సృష్టించినప్పుడే వారికి కల్పించాడు. స్త్రీలకు వ్యభిచారశీలత్వం
స్వాభావికం.
ఇంద్రియ సమూహం బలమైనది. అది వివేకినైనా చెడ్డ దారికి ఈడుస్తుంది. అందుకే పురుషుడు తల్లితో గానీ, అక్క
చెల్లెళ్ళతో గానీ, కూతుళ్ళతో గానీ ఒంటరిగా
కూర్చుని ముచ్చట్లు చెప్పకూడదు. (మాత్రా, స్వస్రా, దుహిత్రా వా న వివిక్తా సనో భవేత్ )
స్త్రీలు ఇంతగా నమ్మదగనివారు కనుకనే వారికి మంత్రవత్సంస్కారం గానీ, మంత్రార్హత గానీ, వేద పఠనార్హత గానీ
లేవు. (9- 18). అంతేనా యజ్ఞం చేసే సందర్భంలో స్త్రీ వండిన వంటకూడా హవ్యంగా పనికిరాదు. (4-205).
పురుష పక్షపాతియైన మనువు స్త్రీల చపల చిత్తా న్ని ఇంతగా తిట్టిపోశాడు గానీ ఎక్కడా పురుషుల చిత్తచాంచల్యాన్నీ,
వారి చెడు నడతనూ మాట మాత్రంగానైనా విమర్శించకపోవటం చిత్రమేమీ కాదు. విస్పష్టంగా ఆయన పురుష
పక్షపాతి అనీ, పురుషాధిక్య సమాజాన్ని ప్రతిపాదించినవాడనీ తెలుస్తూనే ఉంది.

కుటుంబం, వంశం - ఆస్తి పై వారసత్వ హక్కు

పురుషాధిక్యతకు ఆయువుపట్టైన బీజ ప్రాధాన్య సిద్ధాంతాన్ని పటిష్టపరచటం కోసం, తాను రూపొందించిన


ధర్మసూత్రాలలో స్త్రీని మనువు నిమిత్తమాత్రు రాలినిగా చేశాడు. స్త్రీలు ఎటువంటి ప్రభావమూ చూపని క్షేత్రం
వంటివారనీ, పుట్టే సంతానానికి బీజ లక్షణాలే వస్తా యనీ మనువు సిద్ధాంతం (9 - 35, 36). ఈ సిద్ధాంతం ఇలా
రూపొందించడంలో మనువు ఉద్దేశం ఒక కుటుంబ వ్యవస్థ, ఆ కుటుంబానికి స్వంత ఆస్తి, ఆ ఆస్తి ఆ
కుటుంబంలోని పురుష సంతానానికి వారసత్వంగా సంక్రమించే నియమం ఏర్పరచడానికే. ఫ్రీడ్రిఖ్ ఎంగెల్స్ తాను
రాసిన ‘ కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగ యంత్రాల పుట్టు క’ ( The Origin of the Family, Private
Property and the State 1884 - Friedrich Engels )అనే గ్రంథంలో కుటుంబ వ్యవస్థ, వ్యక్తిగత ఆస్తి ఏ
విధంగా ప్రాచీన సమాజాలలో నాటి మానవ సంబంధాలను, సామాజిక నియమాలనూ నిర్దేశించాయో
వివరించాడు. బీజ ప్రాధాన్య సిద్ధాంతం ఆధారంగా పురుష సంతానానికి మాత్రమే వారసత్వ హక్కులు కల్పించాలనేది
మనువు యోచన.
కుటుంబ ఆస్తి బయటి వ్యక్తు లకు వెళ్ళకుండా నిరోధించటం కోసమే విధవా పునర్వివాహాన్ని గట్టిగా వ్యతిరేకించాడు
మనువు. పునర్వివాహాన్ని వ్యతిరేకించిన మనువు వైధవ్యం ప్రాప్తించిన స్త్రీ తన భర్త యొక్క సోదరునితో సహజీవనం
చేసే దేవరన్యాయాన్ని అందుకే తప్పుపట్టలేదు. భర్త మృతి తరువాత పునర్వివాహం చేసుకున్న స్త్రీ స్వర్గంలో తన
మొదటి భర్త పక్కన నివసించే స్థా నాన్ని శాశ్వతంగా కోల్పోతుందట. ఇంకా వితంతు పునర్వివాహాన్ని పశుధర్మం
అన్నాడు మనువు. జైనాన్ని స్వీకరించి, హింసాత్మకమైన యజ్ఞయాగాదులను నిలిపేసి, వితంతు పునర్వివాహాలు
చేయించిన అంగరాజ్య (నేటి బిహార్) పాలకుడు వేనరాజును అధర్మిష్ఠు డన్నాడు మనువు. అయినదానికీ,
కానిదానికీ అందరిచేతా యజ్ఞయాగాదులు చేయిస్తూ, యాజక వృత్తిని చక్కటి ఆదాయ మార్గంగా మలచుకున్న
పురోహితవర్గానికి వేనరాజు జైన ధర్మం స్వీకరించటం కారణంగా యజ్ఞయాగాదులకు రాజపోషణ నిలిచిపోవటం,
వైధవ్యం ప్రాప్తించిన స్త్రీలకు వేనరాజు పట్టు దలగా పునర్వివాహాలు చేయించటం ఎంతమాత్రం నచ్చలేదు. దాంతో
పురోహితవర్గం ఆయనపై పగబట్టి, హత్యచేయించి ఆయన్ని అడ్డు తొలగించి, ఆయన కుమారుడైన పృథువును
చక్రవర్తిని చేసింది. చరిత్రలో వేనరాజుకు జరిగిన అన్యాయం పై ‘కవిరాజు’ త్రిపురనేని ‘ఖూనీ’ అనే నాటకం
రాశారు. వేనుడు, నహుషుడు, సుదాసు, సుముఖుడు, నిమి మొదలైనవారంతా అవినయం కారణంగా

మనుస్మృతి - మంచీ చెడూ : 16


నశించారనీ, పృథువు, మనువు వినయం కారణంగా రాజ్యం పొందగా, అదే వినయం కారణంగా కుబేరుడు
ధనాన్నీ, గాధి పుత్రు డైన విశ్వామిత్రు డు బ్రాహ్మణ్యాన్నీ
పొందగలిగారనీ మనువు పేర్కొన్నాడు.(7-41, 42).ఇక్కడ అవినయం, వినయం అనేవి పురోహితవర్గం
వర్గం పట్లనే అనేది గమనార్హం. వీటన్నిటి కారణంగా మనువు పాలితులందరినీ సమదృష్టితో చూసిన ఆదర్శ
పాలకుడు కాడనీ, ఆయన పూర్తిగా పురోహితవర్గం పక్షమే వహించాడన్నది సుస్పష్టం.

బహిష్టు - అశౌచం (మైల) – జననాశౌచం, మృతాశౌచం

బహిష్టు లో స్త్రీని బయట కూర్చోబెట్టటం మొదలైన వాటిని గురించి అవి ఎంతగా శాస్త్రీయమని వివరణలు
ఇచ్చుకున్నా అవి స్త్రీలను కొంచెపరచడానికే.
స్త్రీలను చిన్నచూపు చూసే మనువాద భావజాలానికి అది కొనసాగింపే. తాము మాతృత్వానికి పెద్ద పీట వేస్తు న్నామని
చెప్పుకుంటూనే మాతృత్వం అనే పవిత్ర లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఒక స్త్రీ బహిష్టు అయితే సంప్రదాయవాదులు
కొందరు దానినొక అపవిత్రతగా భావించి ఆ స్త్రీని దూరం పెట్టటం, ఒక స్త్రీకి వైధవ్యం సంప్రాప్తిస్తే అది ఆమె తప్పన్నట్లు
ఆమె ఎదురు రావటం అశుభదాయకమని భావించటం ఏ రకంగానూ సరి కాదు. కేరళలోని శబరిమల
ఆలయంలోకి ఏకంగా 10 నుంచి 50 సంవత్సరాలలోపు స్త్రీలు ఎవ్వరూ ప్రవేశించరాదని కొందరు అర్థరహితంగా
పట్టు బట్టటం కూడా ఈ మనువాద భావజాలం యొక్క కొనసాగింపే. భారత రాజ్యాంగంలో లింగ వివక్షకు
ఎంతమాత్రం తావులేదు. భారత రాజ్యాంగంలోని 15 వ అధికరణాన్ని అనుసరించి జాతి (పుట్టు క) లేక లింగం
కారణంగా ఏ భారతీయ పౌరుడు/ పౌరురాలు వివక్షకు గురికారాదు. అందుకే 2018 సెప్టెంబర్ లో భారత
సర్వోన్నత న్యాయస్థా నం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు జడ్జ్ ల బెంచ్ 10
నుంచి 50 ఏళ్ల లోపు స్త్రీలకు శబరిమల ఆలయ ప్రవేశాన్ని నిషేధించటం రాజ్యాంగ విరుద్ధమమని తీర్పు చెప్పి, ఆ
వయోవర్గంలోని స్త్రీలు ఎవరైనా శబరిమల ఆలయాన్ని దర్శించటానికి వస్తే వారికి కేరళ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి భద్రత
కల్పించాలని ఆ తీర్పులో విస్పష్టంగా పేర్కొంది.
బిడ్డ పుట్టినప్పుడు జననాశౌచం పేరుతో, పురిట్లో బిడ్డ చనిపోయినప్పుడు మృతాశౌచం పేరిట అశౌచాన్ని
పాటిస్తా రు. కుటుంబంలో ఎవరు చనిపోయినా సన్నిహిత ఆత్మీయ బంధువులు (సగోత్రు లో , సపిండులో)
అశౌచాన్ని(మైలను) పాటిస్తా రు. కొందరు ఈ మైల పాటింపును సమర్థిస్తూ “ ఏవైనా తెలియని వైరస్ ల కారణంగా
ఒక వ్యక్తి చనిపోతే, ఆ కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితులను తాకితే ఆ వైరస్ అందరికీ వ్యాప్తి అవుతుందనే
భయంతోనే అసలీ మైల పాటింపు” అంటూ ఒక సిద్ధాంతం చెపుతున్నారు. అయితే దానివల్ల ఏమైనా నష్టం ఉందో
లేదో గానీ - ఈ మైల పాటింపును ఇప్పుడెవరూ లెక్కచేయటం లేదు. ప్రస్తు తం ఎవరూ మైల పాటించకపోగా,
చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లి కూర్చుని, పరామర్శ చేసి వారు ఇచ్చిన టీ/ కాఫీ తాగి మరీ బయటికొస్తు న్నారు.
ఒకవేళ వైరస్ అంటూ వస్తేగిస్తే అలాంటివారికి వచ్చే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. కానీ కొన్ని సంప్రదాయ
కుటుంబాలలో తమ కుమారుడు / కుమార్తె విదేశాలలో ఉన్నా ఫోన్ చేసి మరీ తమ సన్నిహిత బంధువు మృతి వార్త
చెప్పి, సంప్రదాయం ప్రకారం మైల పాటించమని కోరుతున్నవారూ ఉన్నారు. మృత శరీరానికి వేల కిలోమీటర్ల
దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఈ అశౌచం పాటించటాన్ని వారు ఎలా సమర్థిస్తా రో మరి ?
అలనాటి జైన, బౌద్ధ ధర్మాలు కేవలం యజ్ఞయాగాదులలో వ్యవసాయానికి అత్యంత ఆవశ్యకమైన పశు హింసను
వ్యతిరేకించటం మాత్రమే కాక, పురుషాధిక్యతను నిరసించి, వారికి అన్నిటా పురుషులతో సమాన హక్కుల కల్పన
కోసం అనాదిగా పోరాటం చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ప్రభుత్వం స్త్రీలకు కూడా తండ్రి ఆస్తిలో సమానవాటా
కల్పించి, జనాభాలో సగానికి పైగా ఉన్న స్త్రీలకు చదువులో, ఉద్యోగ నియామకాలలో, స్థా నిక సంస్థల ఎన్నికలలో వారి
జనాభాకి తగిన ప్రాతినిథ్యం లభించటం కోసం 33 శాతం రిజర్వేషన్లు కల్పించటంతో వారి పరిస్థితి కొంత మెరుగ్గా
ఉంది. అయినా ఇంకా చెయ్యాల్సిందెంతో ఉంది.

ముగింపు

ఇక చివరిగా మన ప్రాచీనుల కాలగణనలో ఉన్న గందరగోళం కారణంగా కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాల
పరిమాణం గురించి కూడా మనవారిలో కొంత గందరగోళం ఏర్పడింది. కలియుగం ప్రారంభమై నేటికి 5,120
మనుస్మృతి - మంచీ చెడూ : 17
ఏళ్లయిందనీ, అంతకు ముందు ద్వాపర యుగం 8 లక్షల ఏళ్ల పాటు సాగిందనీ, దానికి ముందు త్రేతాయుగం 12
లక్షల 96 వేల ఏళ్లపాటు నడిచిందనీ, అంతకు ముందరి కృతయుగం ప్రారంభంలో మనువు ఈ స్మృతిని రచించాడని
సంప్రదాయవాదులు భావిస్తు న్నారు. శాస్త్రజ్ఞులు ఏ రకంగా చూసినా ఋగ్వేదమే క్రీ. పూ. 1500 సంవత్సరం కంటే
ప్రాచీనమైనది కాదని తేల్చారు. జన్యుపరమైన, శిలాజ సంబంధమైన ఆధారాలతో మానవ జాతి సుమారు లక్షన్నర
ఏళ్ల క్రిందట ఆఫ్రికా ఖండంలో ఉద్భవించి, సుమారు 90 వేల సంవత్సరాల క్రితం వారిలో కొందరు ఆఫ్రికాను వదిలి,
భూగోళంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించారని శాస్త్రీయంగా నిర్ధా రణ అయింది. కనుక ఇన్నిన్ని లక్షల సంవత్సరాల
మానవ నాగరికత మనుగడ ఎలా సాధ్యమో సంప్రదాయవాదులే శాస్త్రీయంగా రుజువు చేయాల్సి ఉంటుంది.
అబినాష్ చంద్ర బోస్ వంటి సువిఖ్యాత వేద పండితులు కూడా ఋగ్వేద రచన జరిగి ఇప్పటికి మూడు వేల
అయిదువందల సంవత్సరాలై ఉంటుందని - అంటే ఋగ్వేదం సుమారుగా క్రీ.పూ. 1500 ప్రాంతాలలో సంకలనం
అయిందనీ భావించారు. అలాంటప్పుడు ఈ మూడు వేల అయిదు వందల సంవత్సరాల కాలంలోనే కృత, త్రేతా,
ద్వాపర యుగాలు మూడే కాక కలియుగంలో ఇప్పటికి గడిచాయని చెపుతున్న 5,120 సంవత్సరాలు ఎలా
ఇముడుతాయో కూడా వారే చెప్పాలి. పైపెచ్చు కృత యుగానికి మనుస్మృతి, త్రేతాయుగానికి గౌతమ స్మృతి, ద్వాపర
యుగానికి శంఖ లిఖిత స్మృతి, కలియుగానికి పరాశర స్మృతి అనుసరణీయాలని పరాశర స్మృతి పేర్కొంది. స్మృతుల
ఉద్దేశం శ్రు తుల (వేదాల) అర్థా న్నీ, అన్వయాన్నీ వివరించటమే కనుక, అవన్నీ వేదాల తరువాత వచ్చినవేననీ, ఆ
కారణం చేత అవేవీ క్రీ.పూ. 1500 కంటే పూర్వకాలం నాటివి అయ్యే అవకాశమే లేదనీ మనం గ్రహించాలి.
అందుకే శాస్త్రీయ దృష్టి కలిగిన చరిత్రకారులు మనుస్మృతి రచనాకాలం క్రీ.పూ. మూడవ శతాబ్ది, క్రీ.పూ. రెండవ
శతాబ్ది మధ్యకాలంలో అయివుంటుందని తేల్చారు. శ్లోకాల భావం, ప్రస్తా విత అంశాలు, వాటిలో పేర్కొన్న చారిత్రక
వ్యక్తు లనుబట్టి చూస్తే ఈ అంచనా సరైనదేనని అనిపిస్తుంది. ఏ గ్రంథమైనా ఏ చారిత్రక దశలో రచించబడిందో, ఆ
రచన నాటి ఆధిపత్య వర్గాల ఏ రాజకీయ, సామాజిక, ఆర్ధిక ప్రయోజనాల సాధనకోసం ఉద్దేశించబడిందో ఆ
గ్రంథాన్ని నిశితంగా పరిశీలించేవారికి అర్థమౌతుంది. మనుస్మృతి మూలప్రతిలోని శ్లోకాలు ఎలాంటి అధ్యాయాలుగా
విభజించబడలేదు. కాగా ఆధునిక ప్రతులన్నింటిలో ఆ శ్లోకాలు 12 అధ్యాయాలుగా విభజించబడ్డా యి. కొన్ని
శ్లోకాలు కాలక్రమంలో కలపబడి ఉండవచ్చు కూడా.
ఎప్పుడో కృతయుగం లో పాటించవలసిన మనుస్మృతిని ఇప్పుడు కూడా పాటిస్తా ననే వాడిని వెర్రివాడని కాక
మరేమంటాం ? వేదాలు నాలుగింటిలో ఋగ్వేదంలో చెప్పబడిన విషయాలే దాదాపుగా మిగిలిన మూడిట్లోకూడా
పునశ్చరణ అయ్యాయి. అందుకే మూల గ్రంథమైన ఋగ్వేదానికి ఆ ప్రత్యేకత, అంతటి గుర్తింపు లభించాయి.
అచ్చం అలాగే మనుస్మృతి కూడా. మనుస్మృతిలోని ధర్మాలు ఎప్పుడో కృతయుగంలో పాటించాల్సిన ధర్మాలనీ,
కలియుగంలో పాటించాల్సినవి పరాశర స్మృతి లోని ధర్మాలనీ ఒక పక్క చెపుతూ కూడా, మరి అన్నిటికీ మూలం
మనుస్మృతే కనుకనేనేమో సనాతనులకు మనుస్మృతి మీద ఆ ఆరాధనా భావం ? మరొక పక్క అంటరానితనంతో
సహా మొత్తం మనువాద భావజాలానికి మనుస్మృతే మూలం కనుక దానినే కొందరు ద్వేషించటం సహజమే.
1927 డిసెంబర్ 25 వ తేదీన మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లా లోని మహద్ అనే చిన్న పట్టణంలో డా. బి. ఆర్.
అంబేద్కర్ అంటరానితనం పట్ల తన నిరసనకు సంకేత సూచకంగా ఒక మనుస్మృతి ప్రతిని బౌద్ధ సన్యాసుల
పర్యవేక్షణలో తగులబెట్టా రు. అక్కడి ఒక ఊరచెరువులోని నీటిని ఎవరూ తాగకుండా కోర్టు ఇచ్చిన ఉత్తర్వును
ఉల్లంఘించటం ఇష్టంలేక, వేరే చేసేదీ ఏమీ లేక అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని డా. అంబేద్కర్ ఆ గ్రంథాన్ని
తగులబెట్టా రు. ఆ కారణంగా ఆ గ్రామంలోని అంటరాని ప్రజానీకం సమస్యలు పరిష్కారమౌతాయని ఆయన కూడా
భావించలేదు. ఆ చర్య కారణంగా ప్రతికూల వాతావరణమే ఏర్పడింది. మహారాష్ట్రలో అది దశాబ్దా ల తరబడి రావణ
కాష్టం అయింది. నాటినుంచీ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 వ తేదీని అంబేద్కర్ అభిమానులు,
అభ్యుదయవాదులు ‘మనుస్మృతి దహన్ దివస్’ గా పాటిస్తు న్నారు. అయితే ఇప్పుడు కాలం మారిపోయింది.
మనుస్మృతిని తగులబెట్టే అవసరం లేకుండానే ఇప్పుడు దానిలోని కాలంచెల్లిన ధర్మాలను ఎవరూ పాటించటం
లేదు. ఇంకా మనలో ఎవరికైనా మనసులో ఆ భావాల బూజు మిగిలి ఉంటే ప్రత్యామ్నాయ సాహిత్య సృష్టి చేయడం
ద్వారా మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. ప్రాచీన గ్రంథాలను తగులబెట్టటం కాక వాటిలోని
దుర్మార్గపు భావజాలానికి వ్యతిరేకంగా పోరాడదాం. ఇంకా అందులోనూ ఏ కాస్తన్నా గ్రహించదగిన మంచి ఉంటే
దానిని స్వీకరిద్దాం. దానిని ఆ చారిత్రక దశకు సంబంధించిన ఒక చారిత్రక ఆధార గ్రంథంగానే చూద్దాం. ఇది నా
అభిప్రాయం.
– మీ.. ముత్తేవి రవీంద్రనాథ్.

మనుస్మృతి - మంచీ చెడూ : 18

You might also like